breaking news
Palakollu government hospital
-
రెండో పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం..
సాక్షి, పశ్చిమగోదావరి : పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన పోడూరు మండలం కవిటం గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. సుధాకర్‌రెడ్డి అనే వివాహితుడు కొవ్వూరి తేజశ్రీ (20)ని రెండో పెళ్లి చేసుకుందామనుకున్నాడు. ఆమె ససేమిరా అనడంతో కక్ష పెంచుకున్నాడు. బుధవారం ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరినీ పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తేజశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని!
సాక్షి, పాలకొల్లు సెంట్రల్ : సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. మన ఊరు నాకు ఏమిచేసిందనే కన్నా ఊరికి నేను ఏమిచేశాననే ఆలోచన పుట్టినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఉదయాన్నే లేచినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఉండే మనం ఎక్కడైనా అవినీతి జరిగినట్టు కనపడితే ఒక లైక్ కొట్టడమో, షేర్ చేయడమో చేసి మన బాధ్యత అయిపోయిందని చేతులుదులుపుకుంటున్నాం. నాయకులు మన ఊరికి చేయనివన్నీ చేసేశామని చెబుతున్నా ఏమి చేశారని ప్రశ్నించలేకపోతున్నాం. అలా ప్రశ్నించగలిగిన చైతన్యం మనందరిలో వచ్చనప్పుడే నాయకుల్లో సైతం బాధ్యత, భయం ఏర్పడతాయి. మన సమస్యలపై దృష్టి పెడదాం ఎక్కడెక్కడి సమస్యలనో పట్టించుకునే యవత స్థానిక సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి. నేను, నా కుటుంబం.. అనే భావనతో పాటే నాఊరు, నా పట్టణం, నా సమాజం అనే భావనతో ముందుకు సాగాలి. ఐదేళ్ల ముందు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన నాయకులు మళ్లీ ఓట్లడగడానికి వస్తే నెరవేర్చని హామీల గురించి ధైర్యంగా ప్రశ్నించే స్థాయికి ఎదగాలి. అధికారపార్టీ ఖర్చుచేస్తోంది ఎవరి సొమ్మో కాదని.. అని మనందరి డబ్బేనని ప్రజలంతా గుర్తెరగాలి. వీటిపై ఎప్పుడైనా ప్రశ్నించారా..? నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి తానే చేశానని ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మల చెబుతున్నారు. ప్రతీ సమావేశంలో ఎమ్మెల్యే రాష్ట్రం రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్లో ఉందని ఊదరగొడుతుంటారు. అంత లోటు బడ్జెట్‌ఉంటే అభివృద్ది చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఎవరైనా ప్రశ్నించారా..? మూణ్నాళ్ల ముచ్చటగా సీసీరోడ్లు నియోజకవర్గంలో రోడ్లు, డ్రెయిన్లు వేశామని చెబుతున్నారు. 30 ఏళ్లు పాటు ఉండాల్సిన సీసీ రోడ్లు వేసిన మూడు నెలలకే పాడైపోతున్నాయంటే అందులో ఎంత అవినీతి జరిగి ఉంటుంది. దానిపై ఎప్పుడైనా ప్రశ్నించారా..? ఎక్కడ 100 పడకల ఆస్పత్రి..? 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామం వచ్చిన సందర్భంలో పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన విషయం ఎంతమందికి గుర్తుంది. ఇంతవరకూ ఎందుకు అభివృద్ధి చేయలేదు. దాని గురించి ప్రశ్నించే పౌరుడు ఎవరైనా ఉన్నారా..? శంభుని పార్కులో రూ.70 లక్షల అవినీతి శంభుని చెరువు, రామగుండం పార్కులు సరే.... మరి పాత పార్కుల దుస్థితి ఏమిటని ప్రశ్నించారా..? శంభుని చెరువులో జరిగిన సుమారు రూ.70 లక్షల అవినీతి గురించి తెలుసా. ఇన్ని కోట్లు ఖర్చు చేసినా శంభుని చెరువులో చెరువుకు తూర్పు భాగంలో ఊబి ఉంది. ఆ ఊబి మట్టిని ఎందుకు తొలగించలేదని అడిగారా..? అన్నీ మాయమాటలే డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేస్తానన్నారు. గెలిచిన తరువాత డ్వాక్రా మహిళకు రూ. 10 వేలే చేస్తానన్నారు. అది కూడా నాలుగు విడతలుగా ఐదేళ్లకు అంతంత మాత్రంగానే సరిపెట్టడం తెలిసిందే. నిరుద్యోగ యువతకు రూ. 2 వేలు భృతి కల్పిస్తానన్నారు. నాలుగున్నర సంవత్సరాలు తరువాత వెయ్యి రూపాయలు చేశారు. ఎన్నికలు సమీపించడంతో ఒక నెల నుంచి రెండు వేలు ప్రకటించారు. ఈకప్పదాటు ధోరణిపై ప్రశ్నించారా..? హోదాపై యూటర్న్ ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తామని చెప్పి దానిని రూ. 35 వేలకు కుదించారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. నాలుగేళ్లు క్రితం వరకూ ప్రత్యేక హోదాపై ఎన్ని మాటలు మార్చారో ఆరు మాసాల నుంచి యూటర్న్ తీసుకుని హోదా గురించి ఇప్పుడు చేస్తున్న రాద్ధాంతం ఏపాటిదో అందరికీ తెలిసిందే.. దీనిపై ప్రశ్నించారా..? కాంగ్రెస్‌తో పొత్తా..? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్‌ను నాడు దూషించి నేడు పొత్తు పెట్టుకుని ప్రజల మనోభావాలను ఢిల్లీలో ఎలా తాకట్టు పెడతారని ఎప్పుడైనా ప్రశ్నించారా..? గర్భిణులనూ ఇబ్బంది పెట్టారు డ్వాక్రా మహిళలను, అంగన్వాడీ మహిళలను టీడీపీ ఏర్పాటుచేసిన ప్రతీ సమావేశానికి తరలించేవారు. సమావేశాలకు గర్భిణీలను కూడా తీసుకువచ్చిన దారుణ సంఘటనలు పాలకొల్లులో జరిగిన విషయంపై స్పందించారా..? -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి !
పాలకొల్లు ప్రభుత్వాస్పత్రి వద్ద బాలుడి మృతదేహంతో ఆందోళనకు దిగిన బంధువులు పాలకొల్లు టౌన్, న్యూస్‌లైన్ : పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బంధువులు వివరాలిలా ఉన్నాయి. పెనుగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బుంగ సామ్యూల్ (12) తనతల్లిదండ్రులు గణేశ్వరరావు, తులసీరత్నంలతో కలిసి మూడు రోజుల క్రితం యలమంచిలి మండలం దొడ్డిపట్లలో జరిగిన సువార్త మహాసభల్లో పాల్గొనడానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఆరాధనోత్సవాలు ముగియడంతో తిరిగి వెంకటాపురం వెళ్లడానికి దొడ్డిపట్లలో ఆటోలో బయలుదేరారు. దొడ్డిపట్ల శివారుకి వచ్చేసరికి అదేమార్గంలో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సామ్యూల్ పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందాడు. అయితే ఆసుపత్రి వైద్యులు సరైన చికిత్స అందించకపోవడం వల్లే తన కుమారుడు మృతి చెందాడని గణేశ్వరరావు, తులసిరత్నం ఆరోపిస్తూ బాలుడి మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉంచి బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పాలకొల్లు రూరల్ సీఐ ఎ.చంద్రశేఖర్, యలమంచిలి ఎస్సై బి.శ్రీనివాసు, ఆసుపత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ వి.సూర్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని వారిని శాంతింపచేయడంతో ఆందోళన విరమించారు.