breaking news
P. BALARAJU
-
'రైల్వే ఆసుపత్రి నుంచి మృతదేహలను కేజీహెచ్‌కు తరలించండి'
గొట్లం రైలు ప్రమాద ఘటనలో మరణించిన ఎనిమిది మృతదేహలను రైల్వే ఆసుపత్రి నుంచి కేజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని రాష్ట్ర మంత్రి పి.బాలరాజు ఉన్నతాధికారులను ఆదివారం ఆదేశించారు. నిన్న రాత్రి విజయనగరం సమీపంలోని గొట్లంలో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన మృతదేహలను ఆదివారం గుర్తించారు. అనంతరం ఆ మృతదేహలను విశాఖలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఆసుపత్రిలో ఫ్రీజింగ్ బాక్స్‌లు లేకపోవడం పట్ల మంత్రి బాలరాజు విస్మయం వక్యం చేశారు. దాంతో బాలరాజు వెంటనే స్పందించి పైవిధంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. విజయనగరం సమీపంలోని గొట్లంలో నిన్న రాత్రి జరిగిన రైల్వే ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఆ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురిని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరోకరిని గుర్తించవలసి ఉంది. అయితే మృతుల్లో ఒక్కరే రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. అయితే గాయపడిన ఇద్దరు క్షతగాత్రులు విశాఖపట్నంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
‘కొట్టుకుపోయిన’ హామీలు
=కోటలు దాటుతున్న మంత్రుల హామీలు =రూ.100 కోట్ల ప్రతిపాదనలు బుట్టదాఖలు =బలహీనమైన కరకట్టలు, గట్లతో వరద ముప్పు =పూడికతో సామర్థ్యం తగ్గుతున్న జలాశయాలు =శాశ్వత నిర్మాణాలపై దృష్టి పెట్టని నేతలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : భారీ వర్షాలు జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. బాధితులను ఆదుకుంటామంటున్న అమాత్యుల మాటలు కోటలు దాటుతున్నాయి. హామీలకు అంతులేకుండా పోతోంది. వరద నీరు గ్రామాల్లోకి ఉప్పొంగకుండా చేపట్టాల్సిన నిర్మాణాల ప్రతిపాదనలపై మాత్రం మంత్రులు నోరు మెదపడం లేదు. ప్రభుత్వం వద్ద ఉన్న రూ.100 కోట్ల విలువైన ప్రతిపాదనల ఫైలును కదిలించే ప్రయత్నం చేస్తామని చె ప్పడం లేదు. జల్, లైలా, నీలం, తాజాగా అల్పపీడనం.. ఇలా పేరు ఏదైనా ఏటా భారీ వర్షాలకు జిల్లా కుదేలవుతూనే ఉంది. కాలువలు, చెరువుల్లో పూడికలు తొలగించకపోవడం, శాశ్వత ప్రాతిపదికన పటిష్ట చర్యలు చేపట్టకపోవడంతో వర్షాలప్పుడు ప్రతిసారి గండ్లు పడుతూ వరద నీరు ఊళ్లను ముంచెత్తుతోంది. గట్లు, కరకట్టల నిర్మాణాలకు సుమారు రూ.100 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. శారద, తాండవ, వరాహ జలాశయాలకు రూ.26 కోట్లు మంజూరు చేస్తామని అప్పట్లోనే ముఖ్యమంత్రి హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. గతంలో పొలాల్లో వేసిన ఇసుక మేటల్ని ఇప్పటికీ తొలగించలేదు. తాజాగా వర్షాలకు మళ్లీ పొలాల్లోకి వరద నీరు చేరింది. ఏటా వరదలకు వందల గ్రామాలు మునుగుతున్నా.. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.బాలరాజు ఈ విషయాలపై కనీసం దృష్టి సారించడం లేదు. భారీగా నష్టం జరిగిన తరువాత మాత్రం మంత్రులిద్దరూ సమీక్షలు, పర్యటనలు పేరుతో హడావుడి చేస్తున్నారు. ప్రజలను ఏమార్చడానికి హామీలు గుప్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం జిల్లా అధికారులు నిర్లక్ష్యం కూడా గ్రామీణులను వెంటాడుతోంది. ప్రధానంగా జలాశయాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతూ సమీప గ్రామాలను ముంచేస్తోంది. జిల్లాలో తాండవ, రైవాడ, కోనాం, వరాహ, గంభీరంగెడ్డి, మేహాద్రిగెడ్డ, పెద్దేరు జలాశయాలున్నాయి. ఏటా వర్షాలు కురిసినప్పుడు వీటి నుంచి భారీగా నీటిని విడిచిపెడుతున్నారు. జలాశయాల్లో పూడిక తీయకపోవడం వల్ల వీటి ల్లో నీటి నిల్వల సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. కొన్నేళ్లలో ఒక్కసారిగా కూడా పూడిక తీసిన సందర్భాలు లేవు. ఏమాత్రం ఇన్‌ఫ్లో వచ్చి పడినా జలాశయాలు నిండిపోయి ప్రమాదస్థాయికి చేరుతున్నాయి. అలాంటప్పుడు నీటి విడుదలతో లోతట్టు ప్రాంతాల్లోని కింది గ్రామాలు మునుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పూడికతీతపై మాత్రం దృష్టి సారించడం లేదు. జిల్లాలో నదీ, జలాశయాల కాలువల పరిస్థితి దారుణంగా మారింది. ఏటా వర్షాలకు తీవ్రంగా దెబ్బతింటున్న వాటిని అప్పటికప్పుడు తాత్కాలికంగా పూడ్చడమే గానీ శాశ్వత నిర్మాణాలు కానరావడం లేదు. నదీ పరీవాహక ప్రాంతాల్లో రెండువైపులా ఎత్తుగా గట్టు నిర్మించాల్సి ఉంది. శాశ్వత ప్రాతిపదికన కాంక్రీట్‌తో కాలువలను నిర్మించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ప్రతిపాదనలు లేవు. మట్టితో కాలువలు ఉండటంతో గండ్లు పడుతూ గ్రామాల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరద నష్టాన్ని తగ్గించి గ్రామాలు, పొలాల్లోకి వరద నీరు చేరకుండా ఉంటాలంటే విధిగా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించి భవిష్యత్తులో గ్రామాలు మునిగిపోకుండా చెరువులు, కాలువుల గట్లను శాశ్వత ప్రాతిపదికన నిర్మించే ఏర్పాట్లు చేయాలని గ్రామీణులు కోరుతున్నారు.