breaking news
Ox competitions
-
గిట్టబలంతో..‘పట్టు’దలతో..
కడియం (రాజమహేంద్రవరం రూరల్) : మండలంలోని వీరవరం–దుళ్ళ రోడ్డుకు అనుబంధంగా ఉన్న పుంతదారిలో ఆదివారం ఎన్నడూ లేనంతగా దుమ్ము రేగింది. నందుల దమ్ము ఎంతో తేల్చే ఎడ్ల పట్టు ప్రదర్శనకు ఆ దారి వేదిక కావడమే అందుకు కారణం. వీరవరం–దుళ్ళ రోడ్లోని నందన్నబాబు గుడి వద్ద తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఉగాది నాడు ఎడ్ల పట్టు ప్రదర్శన నిర్వహిస్తుంటారు. ఆ ఆనవాయితీ ప్రకారమే ఆదివారం ఏర్పాటు చేసిన ఎడ్ల పట్టు ప్రదర్శన హోరాహోరీగా సాగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం పన్నెండుజతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. నిర్ణీత దూరాన్ని 39.10 సెకన్లలో చేరుకున్న చింతలనామవరానికి చెందిన బొల్లి అనంతలక్ష్మీనారాయణ ఎడ్లు ప్రథమ స్థానంలో; 41.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న రాజవరానికి చెందిన గ్రామ రాము ఎడ్లు ద్వితీయ స్థానంలో; 44.66 సెకన్లలో చేరుకున్న ఏడిదసావరానికి చెందిన టేకిమూడి సత్యనారాయణ ఎడ్లు తృతీయస్థానంలో నిలిచాయి. కడియపుసావరానికి చెందిన ఆర్.రజనికి సాకుతున్న పుంగనూరు గిత్త ప్రత్యేకాకర్షణగా నిలిచింది. విజేతలకు ఆలయ కమిటీ, మురమండ గ్రామ పెద్దలు నగదు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. ఏటా పోటీల నిర్వహణ చేపడుతున్న మొగలపు చిన్నను పలువురు అభినందించారు. కడియం మండలంలోని గ్రామాల నుంచే కాక ఆలమూరు మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు నందన్నబాబు ఆలయం వద్దకు చేరుకుని ఉత్కంఠభరితంగా సాగిన పోటీలను తిలకించారు. -
హోరాహోరీగా ఎడ్ల పోటీలు
* సబ్ జూనియర్స్ ప్రదర్శనలో పాల్గొన్న మూడు జిల్లాల ఎడ్ల జతలు * ఉత్కంఠభరితంగా సాగుతున్న పందేలు ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శనలు ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి. కాకాని వెంకట్రామయ్య క్రీడా ప్రాంగణంలో నందమూరి తారక రామారావు మెమోరియల్ ఒంగోలు జాతి గిత్తల రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు జరుగుతున్నాయి. గురువారం సబ్ జూనియర్స్ విభాగంలో ప్రదర్శనలు జరిగాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన ఏడు ఎడ్ల జతలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. విజేతలను శుక్రవారం ప్రకటించనున్నారు. శుక్రవారం సీనియర్స్ విభాగంలో పోటీలు జరగనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వ్యవసాయ విభాగంలో సత్తా చాటిన కానూరు ఎడ్లు.. ఒంగోలు గిత్తల బండలాగుడు పోటీల్లో భాగంగా బుధవారం నిర్వహించిన వ్యవసాయ విభాగంలో కృష్ణా జిల్లా ఎడ్లు సత్తా చాటాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నల్గొండ, కర్నూలు జిల్లాలకు చెందిన పదమూడు జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. వాటిలో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన డీవీఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు ఎడ్ల జత 20 నిమిషాల్లో 3,868.6 అడుగులు లాగి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన కాకాని శ్రీహరిరావు జత 3,637.4 అడుగులు లాగి ద్వితీయ స్థానం, కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామానికి చెందిన కోయ జగన్మోహన్రావు జత 3,600 అడుగులు లాగి తృతీయ, కర్నూలు జిల్లా పాండ్యం మండలం ఎస్.కొత్తూరుకు చెందిన బీఎస్ఎస్ రెడ్డి, బీఆర్కే రెడ్డి (ఒక గిత్త), కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరుకు చెందిన కట్టుగోలు రవీంద్రారెడ్డి (ఒక గిత్త) జత 3348.2 అడుగులు లాగి నాల్గవ స్థానం, గుంటూరు జిల్లా బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పమిడిబోయిన వెంకటేశ్వరరావు జత 3,330 అడుగుల లాగి ఐదో స్థానంలో నిలిచాయి. విజేతలకు నాగార్జునసాగర్ కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుంటుపల్లి వీరభుజంగరాయలు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు డి.భాగ్యారావు, సొసైటీ అధ్యక్షుడు కాకాని సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా నూతలపాటి సుబ్బారావు, సూరపనేని రాధాకృష్ణ, గోగినేని శివశంకరరావు, దుర్గి శ్రీను వ్యవహరించారు.