breaking news
ostracised
-
దారుణం : కులానికి మచ్చ తెచ్చారని..
మల్కాన్గిరి(భువనేశ్వర్) : ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా రెండు రోజులపాటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. క్షత్రియ కులానికి చెందిన ఓ వ్యక్తి సఫాయి పని చేసి, గ్రామానికి మచ్చ తెచ్చాడని అతడి కుటుంబాన్ని గ్రామస్తులు వెలేశారు. అంతేకాకుండా సదరు వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి కుటుంబసభ్యులను ఆ గ్రామం వెలేసింది. ఈ సంఘటన మల్కాన్ గిరి జిల్లా నువాగూడా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. క్షత్రియ కుటుంబంలో జన్మించినా బతుకుదెరువు కోసం కమలా చితాల్(75) కుమారుడు లక్ష్మణ్ డ్రైనేజీ శుద్ధి చేయడం, స్మశాన వాటికలో పనిచేయడం చేశాడు. దీంతో క్షత్రియ కులాన్ని అవమాన పరిచాడంటూ గ్రామస్తులు ఆగ్రహం చెంది వారి కుటుంబాన్ని ఏడేళ్ల కిందట వెలేశారు. అయితే లక్ష్మణ్ కొన్నేళ్ల కిందటే మృతిచెందినా వారి కుటుంబంపై మాత్రం గ్రామస్తులు వేసిన శిక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. అనారోగ్యంతో కమలా చితాల్ మృతిచెందడంతో ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకు వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. కమలా చితాల్ కోడలు, ఆమె మనవడు రబింద్ర చితాల్లు అంత్య క్రియలకు సహకరించాలని గ్రామస్తులను ప్రాధేయపడ్డారు. వాళ్లు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయం మహాప్రసాదానికి రూ. 1000, వారి వంశాన్నితిరిగి గ్రామంలోకి అనుమతించినందుకు మరో రూ.3000 కట్టమన్నారని మధ్యవర్తిత్వం వహించిన గ్రామ వార్డు మెంబర్ సుబ్రాన్సు పరిచా తెలిపారు. దీంతో డబ్బు చెల్లించడంతో శుక్రవారం సాయంత్రం గ్రామస్తులు అంత్యక్రియలకు అనుమతిచ్చారు. కాగా, ఈ సంఘటనపై మల్కాన్ గిరి జిల్లా కలెక్టర్ కే సుదర్శన్ విచారణకు ఆదేశించారు. -
కుల బహిష్కరణతో మహిళ ఆత్మహత్య
మధ్యప్రదేశ్ః నిమ్న కులస్థుడ్ని ప్రేమించడమే ఆమె ప్రాణం తీసింది. తక్కువ కులానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ఊరు... పంచాయితీ పెట్టింది. ఆమెను, ఆమె కుటుంబాన్నీ ఊరునుంచి వెలి వేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో జరిగిన ఘటనకు అవమానంగా భావించిన ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది. మధ్యప్రదేశ్ తికామ్ ఘర్ కు చెందిన 25 ఏళ్ళ సాకీ పాల్ ఉదయం ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తికామ్ ఘర్ కు 12 కిలోమీటర్ల దూరంలోని కరిబజారువా లోని స్వంత ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్యకు తగ్గ కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని, తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించడంతో సాకీని, ఆమె కుటుంబాన్ని సంఘం వెలివేసిందని, దీంతో అవమాన భారాన్ని తట్టుకోలేకపోయిన ఆమె... ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోందని సబ్ ఇనస్పెక్టర్ బీ ఎస్ రాథోర్ చెప్పారు. నాయకుడు థానీ రామ్ గత నెల్లో కుల పంచాయితీ నిర్వహించారని, తక్కువ కులస్థుడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆమెను, ఆమె కుటుంబాన్ని ఊరు వెలి వేసినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అయితే తన ప్రవర్తన అటువంటిది కాదంటూ సాకీ పంచాయితీకి మొరపెట్టుకుందని, గ్రామంనుంచీ వెలి వేయడం అన్యాయం అంటూ వేడుకుందని గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది. దీంతో చివరికి ఆమెపై వెలి నిర్ణయాన్ని ఎత్తివేసేందుకు అంగీకరించిన ఊరి పెద్దలు కొన్ని నిబంధనలు విధించారు. మత సంప్రదాయంలో భాగంగా గ్రామం మొత్తానికి సాకీ కుటుంబం రెండు పూటల భోజనాలు పెట్టించాలని షరతులు విధించారు. షరతులకు సైతం సాకీ కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే చివరికి ఏమైందో ఏమో సాకీ ఆత్మహత్యకు పాల్పడిందని, ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసు అధికారి రాథోర్ చెప్పారు.