పాతనోట్ల కలకలం: నటి జీవిత స్పందన
హైదరాబాద్: నగరంలో గురువారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పాతనోట్లు పట్టుబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అరెస్టయిన శ్రీనివాసరావు తమకు సన్నిహితుడంటూ వచ్చిన వార్తలపై నటి జీవిత స్పందించారు. పాత నోట్లతో దొరికిపోయిన శ్రీనివాసరావు తన కార్యాలయంతోపాటు ఇతరుల వద్ద కూడా పనిచేస్తున్నారని, ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె మీడియాకు తెలిపారు.
ఫిలింనగర్‌లోని శ్రీనివాస ప్రొడక్షన్ కార్యాలయంలో రూ. 7 కోట్ల విలువైన పాత నోట్లు దొరికాయి. ఈ వ్యవహారంలో శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ శ్రీనివాసరావు తన తమ్ముడని మీడియాలో వచ్చిన కథనాలను ఆమె ఖండించారు. శ్రీనివాసరావు తన తమ్ముడు కాదని, తన తమ్ముడు మురళీ శ్రీనివాస్ నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె తెలిపారు.
అరెస్టైన శ్రీనివాసరావు తమ ఆఫీసులో మేనేజర్‌గా పనిచేస్తున్న మాట వాస్తవమేనని, అయితే, అతను తమ ఆఫీసుతోపాటు మరో నాలుగైదు ఆఫీసులలోనూ పనిచేస్తున్నాడని, తన వద్ద అతనితోపాటు మరో నలుగురు మేనేజర్లు పనిచేస్తున్నారని చెప్పారు. తమ కార్యాలయం ఉన్న భవనంలోనే శ్రీనివాసరావు ఆఫీసు ఉందని, అయితే, తమ కార్యాలయం పేరు జోత్స్న ప్రొడక్షన్ అని, ప్రస్తుతం ‘గరుడవేగ’ సినిమాను ఈ ప్రొడక్షనే తీస్తున్నదని చెప్పారు. పాతనోట్ల వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తనకు పోలీసుల నుంచి ఎలాంటి కాల్ రాలేదని చెప్పారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం ఉందని ఎవరు చెప్పారో చెప్పాలని ఆమె మీడియాను ప్రశ్నించారు. అరెస్టయిన శ్రీనివాసరావుతో తన తమ్ముడికి కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.