గాల్లో కలిసిన రూ. 13కోట్లు !
ఏడాదిన్నరలో సీఎం హెలికాప్టర్ల పర్యటనలకు వెచ్చించిన ఖర్చు
సమాచార హక్కు ద్వారా వెల్లడైన విషయాలు
బెంగళూరు: అధికారిక పర్యటనల కోసమంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒకటిన్నర ఏడాదిలో హెలికాప్టర్ అద్దె కోసం చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.13కోట్లు, 2013 ఏడాదిలో మే 13న ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి 2014 నవంబర్ 31 వరకు సిద్ధరామయ్య పర్యటనల కోసం వినియోగించిన హెలికాఫ్టర్‌కు చెల్లించిన మొత్తం రూ.13 కోట్లంటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి పొదుపు మంత్రాన్ని జపిస్తూ వస్తున్న సిద్ధు తన పర్యటనల కోసం మాత్రం ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని ఎలా ఖర్చుచేశారో తెలియడం లేదని నగరానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త టి.నరసింహమూర్తి పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఆర్టీఐ కార్యకర్త టి.నరసింహమూర్తి శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా టి. నరసింహమూర్తి మాట్లాడుతూ....13.05. 2013 నుంచి 31.11.2014 వరకు ముఖ్యమంత్రి పర్యటనల కోసం హెలికాఫ్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,07,41,884ను అ ద్దెగా చెల్లించిందని తెలిపారు. ఢిల్లీకి చెందిన చాప్సన్ ఏవియేషన్, ఓఎస్ఎస్ ఎయిర్ మేనేజ్మెంట్, హర్యాణాకు చెందిన స్పైస్ జెట్ తదితర సంస్థ నుంచి వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి పర్యటనకు హెలికాఫ్టర్లను అద్దెకు తీసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వివిధ సందర్భాల్లో హెలికాఫ్టర్‌ను వినియోగించాల్సి ఉంటుందని, అయితే హెలికాఫ్టర్లను అద్దెకు తీసుకోవడం కంటే రాష్ట్ర ప్రభుత్వమే ఓ హెలికాఫ్టర్‌ను కొనుగోలు చేస్తే ప్రజాధనం వృధా కాకుండా అడ్డుకోవచ్చని నరసింహమూర్తి అభిప్రాయపడ్డారు.