breaking news
Nyutrisanist
-
ఉపవాసం.. ఉపయోగం...
నమశ్శివాయ! ఏడాదికి ఒక్కరోజైనా శరీర అంతర్గత అవయవాలకు విశ్రాంతినివ్వడం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రోజు శివరాత్రి. శివభక్తులు ఉపవాసన, జాగరణ చేస్తుంటారు. వారి దీక్ష మరింత మెరుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే... పండ్లు - పాలు చాలా మంది ఈ రోజు పండ్లు, పాలతో సరిపెట్టేస్తారు. ఇది చాలా మంచిది. పాలు సమతుల ఆహారం. పండ్లు పోషకాలను ఇవ్వడమే కాకుండా ఆకలి కానివ్వకుండా సాయపడతాయి. రోజులో కనీసం ఆరు సార్లు పండ్లు, పాలతో సరిపెట్టడం వల్ల శరీరంలోని విషపూరితాలు బయటకు వెళ్లిపోతాయి. సాధారణంగా ఈ పద్ధతి ప్రతి రోజూ జరుగుతుంది. ఈ పనంతా కాలేయం చేస్తుంది. రోజంతా పండ్లు, పాలు తీసుకోవడం వల్ల కాలేయానికి విశ్రాంతి లభించి, దాంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ♦ పండ్లలో ఉండే ఖనిజాలు, విటమిన్లు అందడం వల్ల పోషకాహార లోపం వంటివి ఉంటే ఈ రోజుతో భర్తీ అవుతాయి. పీచు పదార్థం వల్ల జీర్ణవ్యవస్థ అంతా శుభ్రపడుతుంది. ♦ ఈ కాలం ప్రకృతి నుంచి పండ్లు బాగా అందుతాయి. వచ్చే ఎండాకాలానికి సిద్ధపడటానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. ♦ రోజంతా తగినన్ని పండ్లు, పాలు తీసుకున్నవారు కేజీ నుంచి 2 కేజీల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇలా సరైనది కాదు... ♦ రోజంతా ఏమీ తినకుండా కేవలం టీ, కాఫీలతో సరిపెట్టేయడం మంచిది కాదు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఆకలి పుడుతున్నప్పుడు ఆహారం అందివ్వకపోతే పొట్టలో ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో అల్సర్ పెరిగి, మంట పుడుతుంది. తరచూ ఉపవాసాలు చేసేవారు ఇదే పద్ధతిని అనుసరిస్తే జీర్ణవ్యవస్థపై చెడుప్రభావం చూపి, అనారోగ్యం కలుగుతుంది. ♦ ఉపవాసం వల్ల నిన్నంతా ఏమీ తినలేదు కదా అని ఉపవాస దీక్ష వదిలే రోజు ఉదయాన్నే కావల్సినదానికన్నా అధికంగా ఆహారం తీసుకుంటుంటారు కొందరు. ఒకేసారి అలా తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఒంట్లో చేరుతాయి. పైగా రాత్రి జాగరణ చేయడం వల్ల మరుసటి రోజు భోజనం చేసి, నిద్రపోతారు. తిండి, నిద్ర వల్ల ఒంట్లో అదనపు కొవ్వు పెరుగుతుంది. ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక... ♦ రోజులో 6 సార్లు ఒక్కోసారి ఒక్కో సలాడ్ కప్పు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. ♦ పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. బొప్పాయిలో విటమిన్లు అధికం. అందుకని పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి. ♦ పచ్చికొబ్బరి కోరి సలాడ్‌లో కలిపి తీసుకోవచ్చు. వీటికి కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి యాడ్ చేసుకోవచ్చు. ♦ గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి. ♦ ఆరుసార్లు తీసుకుంటే మంచిది. ఆకలి వేస్తున్న ఇదీ ఉండదు. ఆరోగ్యంపై దెబ్బ పడదు. ♦ పాలు ఇష్టపడని వారు పలచటి మజ్జిగ తీసుకోవచ్చు. కండరాలు బలహీనం కాకుండా ఉంటాయి. ♦ జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది. ♦ పూజలలో పూర్తి శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. - డా.జానకి, న్యూట్రిషనిస్ట్, డైటా క్లినిక్ -
గర్భిణి బెండకాయ తింటే.. !
వెజ్ఫ్యాక్ట్స్ *బెండకాయలో... ఐరన్, క్యాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్, మెగ్నీషియం, సిలీనియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలతోపాటు సి,ఎ, ఇ,కె విటమిన్లు ఉంటాయి. జీర్ణవ్యవస్థకు దోహదం చేసే పీచు కూడా ఉంటుంది. * బెండకాయ తింటే అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. మధుమేహం ఉన్న వారు వారానికోసారయినా తింటే మంచిది. ఈ కూరగాయ... చర్మకాంతిని మెరుగుపరిచి, ఎముకలను శక్తిమంతం చేస్తుంది. * బెండకాయ కోలన్ క్యాన్సర్(పెద్దపేగు క్యాన్సర్), ఊపిరితిత్తుల క్యాన్సర్లను నివారిస్తుంది. దంత క్షయాన్ని కూడా నివారిస్తుంది. * గర్భవతిగా ఉన్నప్పుడు బెండకాయ తినడం వల్ల పిండం ఎదుగుదల బావుంటుంది. ఫోలేట్ అనే పోషకం సమృద్ధిగా అందడం వల్ల బిడ్డ మెదడు నిర్మాణం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ నాడీవ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుంది. గర్భధారణ జరిగిన నాలుగు నుంచి పన్నెండు వారాల లోపు ఈ పోషకాలు చాలా అవసరం. - ఉషశ్రీ, న్యూట్రిషనిస్ట్ -
ఉప్పు..! తగ్గితే తప్పు... పెరిగితే ముప్పు
ఉప్పు అన్నది కేవలం వంటల్లో వేసుకునే చిటికెడంత పదార్థం అనుకుంటే అది పొరబాటే. వాడుకోడానికి చిటికెడంత అయినా మన సంస్కృతిలో దాని స్థానం బోలెడంత. మన జాతీయాల్లో, నుడికారాల్లో అది కోరికలకూ, కృతజ్ఞతకూ ప్రతీక. ఒకనాటి కరెన్సీకి ప్రతిరూపం. వేతనానికి పర్యాయపదం. ఇలా సంస్కృతిలో దానిస్థానం ఎంత పదిలమో... ఆరోగ్యం విషయంలోనూ అంతే ప్రధానం. పుట్టబోయే బిడ్డ మేధోవికాసం సరిగా జరగాలంటే అయొడైజ్డ్ ఉప్పు వాడాలి. మన దేహంలో మెదడు నుంచి అన్ని అవయవాలకు అందాల్సిన అన్ని రకాల కమ్యూనికేషన్ సరిగా జరగాలంటే ఉప్పు కావాలి. అయితే ఈరోజుల్లో ఎవరి నోట విన్నా ఆహారంలో ఉప్పు తగ్గించాలనీ, ఉప్పు వాడకం పెరిగితే రక్తపోటు వచ్చి ప్రమాదకరమైన పరిణామాలెన్నో జరుగుతాయన్న మాటే. అది విని చాలామందిలో ఒక ఆందోళన. ఉప్పు నిజంగానే అంత ప్రమాదకరమా, ఆరోగ్యానికి చేటు కలగకుండా వాడుకోవాలంటే ఎంత పరిమాణంలో వాడాలి... లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మితిమీరిన ఉప్పు నిజంగానే ప్రమాదకరం. అందులో సందేహం లేదు. అయితే ఈ కారణం వల్ల నిజంగానే ఉప్పును పూర్తిగా పరిహరించాలా? ఈ ప్రశ్నకు సమాధానం కాదు అనే చెప్పాలి. ఎందుకంటే శరీరానికి అవసరమైన ప్రధానలవణాల్లో ఉప్పు ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే మితిమీరిన ఉప్పు రక్తాన్ని వేగంగా పరిగెత్తిస్తుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే రక్తనాళాల చివరల్లో అత్యంత సన్నగా ఉండే నాళాలూ ఉంటాయి. ఉదాహరణకు రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాలు వెంట్రుక కంటే సన్నగా ఉండటం వల్ల రక్తకేశనాళికలు (కేపిల్లరీస్) అంటారు. వీటి గోడలు చాలా పలుచగా ఉండటంతో రక్తపు అధిక ఒత్తిడికి అవి పగిలిపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినవచ్చు. అదే పరిణామం గుండె గోడల్లో జరగడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు జరిగితే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉప్పు మోతాదును తగ్గించాలని డాక్టర్లు మొదలుకొని, ఆహార నిపుణుల వరకు అందరూ సలహా ఇస్తుంటారు. రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నవారిని ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలంటూ సలహా ఇచ్చేది కూడా అందుకే! ఉప్పుతో ఉపయోగమే లేదా? మోతాదుకు మించిన ఉప్పు ప్రమాదకారే. కానీ మోతాదుకు మించని ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పైగా మెదడు నుంచి వచ్చే ఆదేశాలను అన్ని అవయవాలకు అందించడంతో పాటు చాలా రకాల కీలకమైన జీవక్రియలకు ఉప్పు అవసరం. అందుకే దాన్ని మోతాదుకు మించనివ్వద్దు తప్ప... .పూర్తిగా ఆపేయకూడదు. ఉప్పుతో ఉపయోగాలివి... ఉప్పులోని లవణగుణంలో ఉండే అయాన్ల సహాయంతోనే మన నాడీ వ్యవస్థలోని నరాల నుంచి వివిధ అవయవాలకు ఆదేశాలు అందుతుంటాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగానే మన వివిధ అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. అందుకే నరాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ఉప్పు కావాలి. కండరాల కదలికలకు (మజిల్ కంట్రాక్షన్ అనే ప్రక్రియ ద్వారా) ఉప్పు ఉపయోగపడుతుంది. మన కాళ్లూ చేతులు ఉప్పు వల్లనే కదులుతుంటాయి. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు లవణాలు అందకపోవడం వల్ల కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోతుంటాయి. దాంతో కండరాలు, పిక్కలు బలంగా పట్టేస్తుంటాయి. ఇది ఎంత బాధాకరమైన పరిణామమో మనలో అనుభవించిన చాలామందికి తెలిసిన విషయమే. అందుకే క్రికెట్ మొదలుకొని చాలామంది క్రీడాకారులు క్రాంప్స్ కారణంగా ఆటలాడలేని పరిస్థితి వస్తుంది. ఆడలేకపోవడం అటుంచి కాలు కదపడమే కష్టమైనంత బాధాకమైన పరిస్థితి వస్తుంది. వేసవిలో వడదెబ్బ తగిలిన వారు, నీళ్ల విరేచనాల వల్ల శరీరంలో ద్రవాలు కోల్పోయిన వారు... ఒక్కోసారి మరణించే పరిస్థితికి చేరువవుతారంటే అది కేవలం శరీరంలో నీళ్లు తగ్గడం వల్లనే కాదు. ఆ నీరు తగ్గినందువల్ల ప్రతి అవయవానికి అవసరమైన ఉప్పు అందకపోవడం వల్లనే. అందుకే వేసవిలో డీ-హైడ్రేషన్‌కు గురైన వారికి కేవలం నీళ్లు తాగించడం మాత్రమే గాక అందులో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార వేస్తారు. పై కండిషన్లో కొందరు లవణాలు పుష్కలంగా ఉండే కొబ్బరినీళ్లని తాగిస్తారు. ఇక ఇలాంటి వారికి ఇచ్చే చికిత్సలో భాగంగా రక్తనాళం నుంచి సెలైన్ ఎక్కించే ప్రక్రియలో ‘సెలైన్’లో ఉండే పోషకాల్లో నీరు, ఉప్పు అత్యంత ప్రధానమైనవి. ఉప్పులోని సోడియం శరీరంలోని నీటిపాళ్లను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కిడ్నీ చేసే మేలెంతో! ‘మరి ఉప్పుతో ఇన్ని ఉపయోగాలున్నప్పుడు కొందరు దాన్ని పూర్తిగా పరిహరిస్తారు. అది తీసుకుంటేనే ప్రమాదమంటూ దూరం పెడతారు. అలాంటివారికి ఎలాంటి ప్రమాదాలూ చోటుచేసుకోవడం లేదు కదా!’ అని కొందరిలో సందేహం ఉండవచ్చు. నిజానికి మన శరీరంలో ఉప్పు తగ్గినప్పుడు, ఆ పరిస్థితిని గుర్తించి చక్కబెట్టే బాధ్యత మూత్రపిండాలది. శరీరంలో ఉప్పు తగ్గినట్లుగా కిడ్నీలకు ‘ఉప్పందుతుంది’. దాంతో అవి తమ బాధ్యతను మొదలుపెడతాయి. శరీరంలోంచి మూత్రం ద్వారా ఉప్పు బయటికి పోకుండా అడ్డుకుంటాయి. అలా అవసరమైనదాని కంటే ఎక్కువగా ఉన్న ఉప్పును తమ వద్ద నిల్వ చేసి ఉంచి శరీరానికి అందిస్తుంటాయి. అదే శరీరంలో ఉప్పు పాళ్లు పెరగగానే మళ్లీ యథావిధిగా మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అందుకే చాలామందిలో ఉప్పు పాళ్లు తగ్గినా అప్పుడప్పుడూ పొరబాటునో, లేక వాళ్లు బయటతినే పదార్థాల్లో లభ్యమైన ఉప్పును జాగ్రత్త చేసి శరీరానికి అందిస్తూ ఆ కొరత తీరుస్తుంటాయన్నమాట. (కొన్ని పదార్థాలలో స్వాభావికంగానే ఉప్పు ఉంటుంది. అంటే మాంసంలో, కూరగాయల్లో, పాలకు సంబంధించిన పదార్థాలైన డెయిరీ ప్రాడక్ట్స్‌లో ఉప్పు ఉంటుంది. బ్రెడ్ పీసెస్ రెండింటిలో స్వాభావికంగానే 296 మి.గ్రా. ఉప్పు ఉంటుంది) అందుకే చాలామందిలో ఉప్పు అంతగా అందకపోయినా శరీరంలో ఉండే ఈ రక్షణ వ్యవస్థ వల్ల వారికి ప్రమాదం జరగదు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే కొందరిలో ‘సోడియమ్ సెన్సిటివిటీ’ అనే గుణం ఉంటుంది. ఆ గుణం ఉన్నవారు కొద్దిపాటి ఉప్పు తీసుకున్నా వారిలో రక్తపోటు పెరిగి అది గుండె జబ్బులకు, పక్షవాతానికి, కిడ్నీ సమస్యలకు, హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీయవచ్చు. ఎంత ఉప్పు వాడాలి? అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు ప్రకారం: ఉప్పు చాలా పరిమితంగా వాడాలన్న విషయం నిర్వివాదాంశమే అయినా నిర్దిష్టంగా ఒకరికి ఎంత ఉప్పు అవసరమన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి తనకు బ్లడ్‌ప్రెషర్, డయాబెటిస్, గుండెజబ్బుల వంటివి లేకపోయినా ప్రతిరోజూ 3.75 గ్రాములకు మించి వాడకూడదు. ఈ మోతాదులోనే ఉప్పు తీసుకోవడం వల్ల జీవక్రియలకు అవసరమైన 1.5 గ్రాముల సోడియమ్ అందుతుందన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కిడ్నీపై అదనపు భారం పడకుండా ఉండటం కోసం ఉప్పువాడకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ గరిష్టంగా 6 గ్రాములకు మించనివ్వకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు డబ్ల్యూహెచ్ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి రోజుకు కనీసం 1.5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకంటే తగ్గడం వల్ల అతడికి అవసరమైన సోడియమ్ పరిమాణానికి, జీవక్రియలకు విఘాతం కలగవచ్చు. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే వారి వయసును బట్టి వాళ్లకు అవసరమైన ఉప్పు వివరాలివి... 1 నుంచి 3 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 2 గ్రాముల ఉప్పు (అంటే 0.8 గ్రా. సోడియమ్ కోసం) 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో... రోజుకు 3 గ్రాముల ఉప్పు (అంటే 1.2 గ్రా. సోడియమ్ కోసం) 7 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో... రోజుకు 5 గ్రాముల ఉప్పు (అంటే 2 గ్రా. సోడియమ్ కోసం) 11 ఏళ్లు పైబడ్డ పిల్లలకు... రోజుకు 6 గ్రాముల ఉప్పు (అంటే 2.4 గ్రాముల సోడియమ్ కోసం) కావాలి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి తాము వాడాల్సిన ఉప్పును నిర్ణయించుకొని, దాన్ని అదే మోతాదులో పరిమితికి మించకుండా తీసుకుంటే ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుంది. స్వతహాగా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలివి... ఉప్పు పరిమితికి మించితే అది అనారోగ్య హేతువు అన్న విషయం తెలిసిందే. అందుకే రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు స్వతహాగా ఉప్పు ఎక్కువ పాళ్లలో ఉండే ఆహారాలను పరిహరించాలి. ఆ ఆహార పదార్థాల్లో కొన్ని... అప్పడాలు పచ్చళ్లు బేకరీ ఐటమ్స్ సాస్ నిల్వ ఉంచే ఫ్రోజెన్ ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్ స్మోక్డ్ మాంసాహారం చీజ్ సలాడ్స్ సాల్టెడ్ చిప్స్ వంటి నిల్వ ఉంచే చిరుతిండ్లు దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు వీలుగా (షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేలా) రూపొందించిన శ్నాక్స్. ఉప్పు విపరీతంగా తగ్గితే కనిపించే లక్షణాలు శరీరంలో ఉప్పు పెరిగితే అది ప్రమాదకరమన్న విషయం తెలిసిందే. అలాగే శరీరంలో ఉప్పు పాళ్లు విపరీతంగా తగ్గినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో సోడియమ్ పాళ్లు తగ్గడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తాయి. అవి... తీవ్రమైన అలసట (ఫెటీగ్) తలనొప్పి కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) హైపోనేట్రీమియా కండిషన్: ఆహారంలో ఉప్పు విపరీతంగా తగ్గడం వల్ల ఏర్పడే హైపోనేట్రీమియా అన్న కండిషన్ వల్ల ఒక్కోసారి ఐసీయూలో చేరి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఉప్పు ఎక్కువ కావడం వల్ల కనిపించే లక్షణాలు విపరీతమైన దాహం కిందినుంచి అపానవాయువు రూపంలో గ్యాస్ పోవడం (బ్లోటింగ్) పై అంశాలన్నింటినీ బట్టి ఆహారంలో ఉప్పును తగ్గనివ్వకూడదు, అలాగని మించనివ్వకూడదు అన్న విషయం గుర్తుంచుకోవాలి. -నిర్వహణ: యాసీన్ గర్భిణులూ జాగ్రత్త! కొందరు ఉప్పు తగ్గించి తినాలనే వారు చాలా పరిమితంగా ఉప్పు వాడుతుంటారు. అలాంటి కుటుంబంలో ఉండే గర్భవతులు ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మిగతావారి విషయం ఎలా ఉన్నా గర్భవతులు రోజుకు 2 నుంచి 8 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం కూడా ప్రమాదమే అని గుర్తుంచుకోవాలి. గర్భవతుల్లో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కడుపులోని బిడ్డ బరువు బాగా తగ్గి అండర్‌వెయిట్ బేబీగా పుట్టవచ్చు. తక్కువ బరువున్న పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పైగా గర్భిణులు 2 గ్రా. నుంచి 8 గ్రా. ఉప్పు కూడా తీసుకోకపోతే బిడ్డలో మానసిక వికాసం కూడా తగ్గవచ్చు. అందుకే ఇలా ఉప్పు బాగా తగ్గించి తీసుకునే కుటుంబాల్లోని గర్భవతులు తమ సోడియమ్ అవసరాల కోసం స్వాభావికంగా ఉప్పు లభ్యమయ్యే కూరగాయలు, తాజాపండ్లు, పండ్లరసాల వంటివి ఎక్కువ పరిమాణంలో తప్పక తీసుకోవాలి. సుజాత స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్ అవేర్ గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్