breaking news
Nursing Yadav
-
ఆసియా సీనియర్ రెజ్లింగ్: భారత్‌కు ఐదు పతకాలు
అల్మాటీ (కజకిస్తాన్): మరోసారి తమ ఆధిపత్యం చాటుకుంటూ ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు అదరగొట్టారు. శనివారం బరిలోకి దిగిన ఐదు వెయిట్ కేటగిరీల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చాయి. రవి కుమార్ దహియా (57 కేజీలు) తన టైటిల్‌ను నిలబెట్టుకోగా... బజరంగ్ పూనియా (65) రజతం సాధించాడు. కరణ్ (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (79 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చిన రవి కుమార్ ఆసియా చాంపియన్‌షిప్‌లో తన జోరు కనబరిచాడు. అలీరెజా (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో ఢిల్లీకి చెందిన రవి కుమార్ 9–4తో గెలిచాడు. సెమీఫైనల్లో రవి 11–0తో అబురుమైలా (పాలస్తీనా)పై, క్వార్టర్ ఫైనల్లో 9–2తో సఫరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రవి కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. బజరంగ్‌కు గాయం ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడో స్వర్ణం సాధించాలని ఆశించిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు నిరాశ ఎదురైంది. జపాన్ రెజ్లర్ టకుటో ఒటుగురోతో ఫైనల్ తలపడాల్సిన బజరంగ్ మోచేతి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో బజరంగ్‌కు రజతం... ఒటుగురోకు స్వర్ణం దక్కాయి. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కిది ఏడో పతకం. ఇందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 3–0తో జియోంగ్ యోంగ్‌సియోక్ (కొరియా)పై, సెమీఫైనల్లో 7–0తో బిల్‌గున్ సర్‌మన్‌డక్ (మంగోలియా)పై గెలిచాడు. కాంస్య పతక బౌట్లలో కరణ్ 3–1తో సీంగ్‌బోంగ్ లీ (కొరియా)పై, నర్సింగ్ యాదవ్ 8–2తో అహ్మద్ మోసిన్ (ఇరాక్)పై, సత్యవర్త్ 5–2తో మిన్‌వన్ సియో (కొరియా)పై విజయం సాధించారు. -
సీబీఐ విచారణలో నిజాలు తెలుస్తాయి
రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆశాభావం ముంబై: సీబీఐ విచారణలో తాను నిష్కళంకుడిగా తేలతానని డోపింగ్ కారణంగా నాలుగేళ్ల నిషేధం ఎదుర్కొంటున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. త్వరలోనే అసలు విషయం తెలుస్తుంది. న్యాయం నా పక్షానే ఉంటుందని నమ్ముతున్నాను. రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటే పతకం సాధించేవాణ్ణి. ఎందుకంటే ఆ గేమ్స్ విజేతను నేను గతంలోనే ఓడించాను. ప్రస్తుతం నా ప్రాక్టీస్‌ను ఆపలేదు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఉన్నాను’ అని 28 ఏళ్ల నర్సింగ్ యాదవ్ తెలిపాడు. ఎవరో కావాలని తన శాంపిల్‌ను టాంపరింగ్ చేశారని, అందుకే ఫలితం పాజిటివ్‌గా వచ్చిందని నర్సింగ్ అప్పట్లో ఆరోపించాడు. దీంతో అసలు విషయం తేల్చేందుకు సీబీఐ నడుం బిగించింది.