breaking news
nobel winner
-
‘ఎల్ఈడీ’ చిక్కులకు చెక్
సాక్షి, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించిన ఎల్ఈడీ బల్బులు భవిష్యత్తులో దృష్టి లోపాలను సరిదిద్దేందుకూ ఉపయోగపడొచ్చని నీలిరంగు ఎల్ఈడీల సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ హిరోషీ అమానో తెలిపారు. మనం విరివిగా వాడుతున్న తెల్లని ఎల్ఈడీ బల్బుల వల్ల నిద్రలేమి వంటి సమస్యలొస్తాయన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎల్ఈడీల కాంతి మెలటోనిన్ అనే రసాయన ఉత్పత్తిని తగ్గిస్తున్న కారణంగా కొందరిలో నిద్రలేమి సమస్యలొస్తున్నాయని పేర్కొన్నారు. టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ల కాంతి తీవ్రతను తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు అధిగమించొచ్చని సూచించారు. 1,500 సార్లు విఫలం.. నీలిరంగు ఎల్ఈడీ సృష్టికి జరిగిన ప్రయత్నాలు, ప్రాముఖ్యం గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు. ‘విద్యతో మానవుడి కష్టాలు తీర్చాలి’ అన్న తన ప్రొఫెసర్ మాటలు ఎంతో ప్రభావితం చేశాయని హిరోషీ పేర్కొన్నారు. అప్పటివరకు చదువుపై పెద్దగా అంతగా శ్రద్ధ పెట్టలేదని, ఆ తర్వాతే ఏదైనా చేయాలనే తపనతో కృషి చేసినట్లు వివరించారు. నీలి రంగు ఎల్ఈడీలు చేసేందుకు ఒకే ప్రయోగాన్ని 1,500 సార్లు చేసి విఫలమయ్యానని, అయినా పట్టు వదలకుండా ప్రయత్నించినట్లు వివరించారు. చివరికి గాలియం నైట్రైట్ అనే పదార్థంతో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. నీలిరంగు ఎల్ఈడీ ఎంతో కీలకం.. ఎరుపు, పచ్చ రంగు ఎల్ఈడీలు దశాబ్దాల కిందే తయారైనా, విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు.. అందరికీ అనుకూలంగా ఉండే తెల్లటి బల్బుల కోసం నీలి రంగు ఎల్ఈడీలు తయారు చేసే సాంకేతికత ఎంతో కీలకమైందని చెప్పారు. నీలిరంగు బల్బులకు ప్రత్యేక పదార్థపు పొరను జోడించడంతో తెలుపు ఎల్ఈడీలు తయారయ్యాయని వివరించారు. సాధారణ బల్బుల కంటే ఎన్నో రెట్లు తక్కు విద్యుత్‌తో ఎక్కువ వెలుగునిచ్చే ఎల్ఈడీలు పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిందని, ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని వివరించారు. ఐఐసీటీతో కలసి పనిచేయాలని.. తెలుపు ఎల్ఈడీలతో వస్తున్న ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు 360 నానోమీటర్ల స్థాయి తరంగాలను వెదజల్లే డయోడ్లు పనికొస్తాయని హిరోషీ వివరించారు. ఈ రకమైన బల్బుల తయారీకి ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే చిన్న పిల్లల్లో కనిపించే హ్రస్వదృష్టిని సరిచేసేందుకు కూడా అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందని.. తాము మాత్రం ఇంటర్నెట్ ఆఫ్ ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. వైర్లెస్ పద్ధతిలో 120 మీటర్ల దూరానికి కూడా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఉపయోగపడే ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. 20 నుంచి 60 నిమిషాలు మాత్రమే గాల్లో ఎగరగల డ్రోన్లను ఇంటర్నెట్ ఆఫ్ ఎనర్జీ ద్వారా రోజంతా ఎగిరేలా చేయొచ్చని పేర్కొన్నారు. దీంతో రోడ్లపై వాహనరద్దీ తగ్గించే ఎయిర్ ట్యాక్సీలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఈ విషయంలో ఐఐసీటీలోని యువ శాస్త్రవేత్తలతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. -
చరిత్ర సారాంశంతో సంభాషణ
చరిత్ర గమనంలో ఎదురయ్యే ఘటనలలో మన మనసుకు నచ్చేవి ఉంటాయి. అనిష్టమైనవీ ఉంటాయి. కానీ రెంటినీ మానవాళే పోషిస్తూ ఉంటుంది. చాలా మలుపులలో వారి ఇష్టాయిష్టాలు అప్రస్తుతమైపోతాయి. భూగోళం మీద అణుబాంబు సృష్టించిన విధ్వంసాన్ని తొలిసారి చూసిన నేల నాగసాకిలో ఆయన పుట్టి పెరి గారు. ఈ సంవత్సరం నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ ఆయన తన రచనలలో అణుబాంబు విస్ఫోటనం గురించి చెప్పరు. బాహ్య ప్రపంచానికీ, దాని మీద అంతరంగంలో మనిషి చేసే ఆలోచనలకీ మధ్య ఉన్న అగాధాన్ని ఆవిష్కరిస్తారు. ఆయనే కజువో ఇషిగురో. పోటీలో ఉన్న గూగీ వా థియాంగ్ (‘మట్టికాళ్ల మహారాక్షసి’ నవలాకారుడు), మార్గరెట్ అట్వుడ్ (కెనడా రచయిత్రి), హరుకీ మురాకమి (జపాన్ కవి)లను కాదని ఈ ఏటి పురస్కారం ఇషిగురోను వరించింది. పాశ్చాత్య సాహితీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే మ్యాన్ బుకర్‌ను 4 సార్లు స్వీకరిం చారు ఇషిగురో. జేన్ ఆస్టిన్, ఫ్రాంజ్ కాఫ్కాల సృజన శైలులను కలిపి, దానికి మార్సెల్ ప్రాస్ట్ను అద్దితే అదే ఇషిగురో రచన అవుతుందని అంటారు. దోస్త్యేవ్స్కీ ప్రభావం కూడా ఆయన మీద ఉంది. ఇష్ ఉత్తమ పురుషలో నవల చెప్పడంలో అఖండుడని ఖ్యాతి. ‘ఏ పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’, ‘ది అన్‌కన్సోల్డ్’, ‘నెవర్ లెట్ మి గో’, ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్’, ‘వెన్ వియ్ వర్ ఆర్ఫన్స్’వంటి నవలలన్నింటిని ఆయన ఉత్తమ పురుషులోనే రాశారు. చివరి నవల ‘ది బరీడ్ జెయింట్’(2015) మాత్రం ఇందుకు భిన్నం. ‘ది ఫ్యామిలీ సప్పర్’, ‘ది సమ్మర్ ఆఫ్టర్ ది వార్’మొదలైన కథా సంపుటాలను ప్రచురించారు. ఆయన గీత రచయిత కూడా. ఉత్తమ పురుషలో నవలను అమోఘంగా నడిపించగల ఇషిగురో రాసినదే–‘ది రిమెయిన్స్ ఆఫ్ ది డే’. సమకాలీన సమాజంతో, దాని పోకడలతో మనసు చేసే పోరాటాన్నీ, వాటితో రాజీపడే తీరునీ ఇందులో ఎంతో సమర్థంగా అక్షరబద్ధం చేశారు ఇషిగురో. లార్డ్ డార్లింగ్టన్ హాలులో మూడున్నర దశాబ్దాల పాటు బట్లర్‌గా పనిచేసిన స్టీవెన్స్ అనుకోకుండా చేసిన ఆరురోజుల యాత్రలో తన అనుభవాలను గుర్తు చేసుకునే క్రమం ఈ నవలలో ఇతివృత్తం. 1950లలో జరిగే కథాకాలానికి ఆ హాలు డార్లింగ్టన్ అధీనంలో లేదు. ఫారడే అనే అమెరికన్ ధనవంతుడు దానిని కొనుగోలు చేశాడు. తన వైవాహిక జీవితం సజావుగా లేదంటూ మిస్ కెంటన్ రాసిన ఉత్తరం అందిన తరువాత ఆమె నివాసం ఉంటున్న కార్న్‌వాల్‌కు బయలుదేరతాడు స్టీవెన్స్. మిస్ కెంటన్ గతంలో డార్లింగ్టన్ హాలులోనే పనిచేసేది. స్టీవెన్స్ కలల రాణి. కానీ ఈ విషయం ఏనాడూ వ్యక్తం చేయకపోవడంతో ఆమె వేరే వివాహం చేసుకుని వెళ్లిపోయింది. స్టీవెన్స్ ఏదో ఆశించి వెళతాడు. ఆ ఉత్తరం అలాంటి ఆశలు రేపింది. కానీ నిరాశకు గురై తిరుగు ప్రయాణమవుతాడు. ఇదే ఇతివృత్తం. కానీ ఆ బట్లర్ జ్ఞాపకాలలో రెండు ప్రపంచ యుద్ధాల మధ్య చరిత్ర, ఇంగ్లిష్ సమాజంలోని వైరుధ్యాలు, అపోహలు, భ్రమలు, చారిత్రక తప్పిదాలు.. వంటింట్లో నుంచి పదార్థాల కంటే ముందే వచ్చే ఘాటు వాసనల్లా పాఠకులకు తగులుతూ ఉంటాయి. పాత యజమాని డార్లింగ్టన్కి, కొత్త యజమాని ఫారడేకి కూడా స్టీవెన్స్ మానసికంగా సుదూరంగా ఉండిపోయాడు. పాత యజమాని కాలంలో విన్స్టన్ చర్చిల్‌కి, జర్మనీ నుంచి వచ్చిన నాజీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి జాచిమ్ వాన్ రిబ్బెన్ట్రాప్కీ కూడా ఆ ఇంట్లో వడ్డించాడు. బ్రిటిష్ యూనియన్ ఆఫ్ ఫాసిస్ట్ బృందం నాయకుడు సర్ ఆస్వాల్డ్ మోస్లే (లేబర్ పార్టీ)కు కూడా వడ్డించాడు. డార్లింగ్టన్ ఫాసిజం మీద సానుభూతి కలిగి ఉండడం స్టీవెన్‌ను బాధిస్తూ ఉంటుంది. అయినా అదే వినయంతో సేవిస్తూ ఉంటాడు. కొత్త యజమాని వ్యంగ్యోక్తులు కూడా రుచించవు. అయినా స్టీవెన్స్ ఏనాడైనా తన ప్రాణం కంటే తన విధినే ఎక్కువ ప్రేమించాడు. నిజానికి మిస్ కెంటన్ మీద ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేయకపోవడానికి కారణం కూడా అదే. మిస్ కెంటన్ను కలుసుకున్నాక ఆమె, ‘నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం ఇంతకంటే ఎంతో బాగుండేది’ అని అంటుంది. కానీ తన భర్తను వదిలి రాదు. తీవ్ర నిరాశతో తిరుగు ప్రయాణమవుతాడు స్టీవెన్స్. అంతా నిర్వేదమే. మళ్లీ ఆ నిర్వేదం మధ్యలోనే కొత్త యజమానికి మరింత విశ్వాసంతో పని చేసి మెప్పు పొందాలని తీర్మానించుకుంటాడు. నిజమే, చరిత్ర గమనంలో మనకు ఎదురయ్యే ఘటనలలో మన మనసుకు నచ్చేవి ఉంటాయి. అనిష్టమైనవీ ఉంటాయి. కానీ రెంటినీ మానవాళే పోషిస్తూ ఉంటుంది. చాలా మలుపులలో వారి ఇష్టాయిష్టాలు అప్రస్తుతమైపోతాయి. ఇషిగురో ఐదో ఏటనే ఇంగ్లండ్ వచ్చాడు. అందుకే తన స్వదేశం అంటే అతడికి ఒక సుదూర జ్ఞాపకం. అయినా అతడు తుడిచిపెట్టలేదు. ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్’ నవల రెండో ప్రపంచ యుద్ధానంతరం జపాన్‌లో బతికిన ఒక కళాకారుడి మథనను చిత్రించింది. ‘ది బరీడ్ జెయింట్’ నవలలో ఒక వృద్ధజంట ప్రయాణంతో గతానుభవాలను వర్ణిస్తాడు. వర్తమానానికీ చరి త్రకీ మధ్య విడదీయలేని ఒక బంధం ఉందని ఆయన నిర్ధారిస్తారు. ఇషిగురో తన పాత్రలకు, నిజానికి నవలలకు కూడా ప్రత్యేకమైన ముగింపును ఇవ్వరు. జనం స్మృతిపథం నుంచి పోతున్న కొన్ని వాస్తవాలను చెప్పించడానికే ఆయన వాటిని సృష్టిస్తారని విశ్లేషకులు చెబుతారు. అందుకే ఆయన ప్రతి నవల చరిత్ర చెక్కిలి మీద కన్నీటి చారికను గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఆయన పూర్తిగా చరిత్రనే అంటిపెట్టుకోలేదు. ‘నెవర్ లెట్ మి గో’ నవల అందుకు సాక్ష్యం. శరీరాంగాలను తీసి అమ్మడానికి ఉద్దేశించిన పిల్లలను సృష్టించే ఒక రాక్షస యుగం వస్తుందని ఈ నవలలో చెబుతారు. ఇది సైన్స్ ఫిక్షన్. ఫ్యూచరిస్టిక్ శైలి కలిగినది కూడా. ‘ది రిమెయిన్స్ ఆఫ్ ది డే’ కంటే ఇదే గొప్ప నవలని చాలామంది భావిస్తారు. – సత్యగిరీశ్ గోపరాజు కజువో ఇషిగురో -
కేంద్ర పథకాలకు సత్యార్థి సహకారం
ప్రధాని మోదీతో భేటీ అయిన నోబెల్ విజేత న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి విజేత కైలాష్ సత్యార్థి కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాలకు తన సహకారం అందిస్తానని ఈ సందర్భంగా సత్యార్థి ఆసక్తి వ్యక్తం చేశారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు తాను సోషల్ మీడియా, ఇంటర్నెట్ను ఎలా వినియోగించుకున్నదీ ప్రధానికి వివరించారు. బాల కార్మికులు లేని దేశంగా భారత్‌ను మార్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. నోబెల్ అవార్డుకు ఎంపికైన సత్యార్థికి ప్రధాని ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆయన ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే, ప్రపంచంలో తొలి చిన్నారుల యూనివర్సిటీని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన జారీ చేసింది. వీరి భేటీ ఫొటోను మోదీ ట్విట్టర్ ఖాతాలోనూ ఉంచారు. నోబెల్ శాంతి పురస్కారానికి సత్యార్థి, మలాలా సంయుక్తంగా ఎంపికైన విషయం తెలిసిందే. సత్యార్థి నోబెల్ పురస్కారానికి ఎంపికవడం దేశానికి గర్వకారణంగా పేర్కొంటూ మోదీ శుక్రవారమే ట్విట్టర్ ద్వారా స్పందించారు.