breaking news
no free
-
ఎవరైనా చార్జీలు చెల్లించాల్సిందే
పనామా సిటీ: పనామా కాలువ నుంచి అమెరికా యుద్ధనౌకలు ఉచితంగా రాకపోకలు సాగించేలా ఒప్పందం ఏదీ కుదరలేదని పనామా అధ్యక్షుడు జోస్రాల్ ములినో గురువారం స్పష్టంచేశారు. తమ యుద్ధ నౌకల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పనామాతో ఒప్పందం కుదిరిందంటూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. పనామా కాలువ గుండా రాకపోకలు సాగించే నౌకలకు రుసుము ఖరారు చేయడం గానీ, మినహాయింపు ఇవ్వడం గానీ తాను చేయలేనని పేర్కొన్నారు. అమెరికా నౌకలకు ప్రత్యేక వెసులుబాటు లేదని వివరించారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అన్ని దేశాల నౌకలు రుసుము చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సెత్కు తెలియజేశానని చెప్పారు. అయితే, పనామా అధ్యక్షుడు జోస్రాల్ ములినో అమెరికా సర్కారు ఇంకా స్పందించలేదు. ‘‘అమెరికా ప్రభుత్వ నౌకలు ఇకపై పనామా కాలువలో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చు. దీనివల్ల మనకు మిలియన్ డాలర్ల ఆదా అవుతుంది’’అని అమెరికా బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. -
విద్య, వైద్యంపై ఖర్చు ‘ఉచితాలు’ కావు.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
చెన్నై: ఆరోగ్యం, విద్యారంగాలపై ప్రభుత్వాలు చేసే వ్యయం ఉచితాలు కిందికి రాదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ రెండింటిపై చేసే పథకాలు పేదలకు ఎంతో మేలు చేసేవేనన్నారు. ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రతిబంధకాలంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం, దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. శనివారం కొలత్తూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో స్టాలిన్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉచితాలు, సంక్షేమ పథకాలు వేర్వేరని అంటూ ఆయన..ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుందని పేర్కొన్నారు. ‘విద్య, వైద్యంపై చేసే వ్యయం ఉచితాల కిందికి రాదు. ఎందుకంటే విద్య జ్ఞానసముపార్జనకు, వైద్యం ఆరోగ్యానికి సంబంధించినది. మా ప్రభుత్వం ఈ రెండు రంగాల్లో సంక్షేమ పథకాలను అమలు చేయాలనుకుంటోంది. ఇవి ఉచితాలు కావు. సంక్షేమ పథకాలు. ఉచితాలు ఉండకూడదంటూ ఇటీవల కొందరు కొత్తగా సలహాలిస్తున్నారు. దాన్ని మేం పట్టించుకోం. కానీ, ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుంది. కాబట్టి, దీనిపై మరింతగా మాట్లాడదలుచుకోలేదు’అంటూ ముగించారు. -
కంట్లో ఇసుక కొట్టి..
పొరుగు రాష్ట్రాలకూ విచ్చలవిడిగా తరలింపు! టన్నుకు రూ.600 చొప్పున వసూలు తెలుగు తమ్ముళ్ల ఇసుక దందా తీరిది.. పట్టించుకోని అధికార యంత్రాంగం సూక్ష్మమైనా సరే మాకు ‘మోక్షం’ ఉండాల్సిందేనన్నది తెలుగు తమ్ముళ్ల లక్ష్యం. ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. అందులో కూడా ‘తమ్ముళ్లు’ లాభాల వేట సాగిస్తున్నారు. తెలంగాణ సహా సుదూర ప్రాంతాలకు అధిక ధరకు ఇసుక ఎగుమతులు భారీగా దండుకుంటున్నారు. ఇందుకు కడియం మండలంలోని వేమగిరి ఇసుక ర్యాంపు వేదికగా నిలుస్తోంది. – ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం) జిల్లాలో ప్రధాన ర్యాంపులన్నీ దాదాపు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో హైవేకు అతి సమీపంలో ఉన్న వేమగిరి ర్యాంపు నుంచి తెలుగు తమ్ముళ్ల ఇసుక దందా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి చిన్న లారీల్లో ఇసుకను తరలించి, ఖాళీ ప్రదేశాల్లో పెద్ద లారీల్లోకి లోడింగ్ చేస్తున్నారు. ఇందుకు విస్తృత నెట్వర్క్నూ ఏర్పాటు చేసుకున్నారు. దోపిడీ విధానం ఇదీ.. వేమగిరి ఇసుక ర్యాంపులో చిన్న లారీల్లో ఇసుకను ఎగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని బొమ్మూరు, హుకుంపేట తదితర గ్రామాలకు సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశానికి తరలిస్తున్నారు. పొక్లెయిన్ల ద్వారా ఇసుకను పెద్ద లారీల్లోకి లోడింగ్ చేసి, తెలంగాణలోని హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రెండు యూనిట్ల లారీని వేమగిరి ర్యాంపులో రూ.2,500కు కొనుగోలు చేస్తున్నట్లు అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఇది సుమారు 8 నుంచి 11 టన్నుల వరకుంటుంది. హైదరాబాద్కు తీసుకువెళ్లే లారీలకు ఇదే ఇసుకను టన్ను రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 8 టన్నులకు రూ.4,800లు, 11 టన్నులకు రూ.6,600లు లభిస్తాయి. కొనుగోలు ఖర్చు రూ.2,500 పోను మిగిలిన మొత్తం అక్రమార్కుల జేబుల్లోకి చేరుతోంది. రోజుకు 30 వరకు పెద్ద లారీలను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన ఈ అక్రమ దందాలో రోజుకు రూ.2 లక్షల వరకు మిగులుతోందని అంచనా. పేదలకేనని ప్రకటించినా.. కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని ఇసుకను ఉచితంగా ఇస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతోంది. ఉచిత ఇసుక పేరిట సవాలక్ష ఆంక్షలు పెట్టి, పెత్తనాన్ని అధికారులకు అప్పగించింది. ఈ ఉచిత ఇసుక పేదలకు అందకుండా, అక్రమ రవాణాతో ‘పెద్దల’ జేబుల్లోకి చేరుతోంది. ఇసుకను నిల్వ చేసినా నేరమంటూ చెప్పే అధికారులు.. ఈ అక్రమ దోపిడీని మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాకు ఉద్దేశించిన లారీలే ర్యాంపుల్లో నిత్యం వరుసలు కట్టి కనిపిస్తున్నాయి. అధికారుల ప్రేక్షకపాత్ర ఇసుక ర్యాంపులో లోడు చేస్తున్నప్పుడు కానీ, ర్యాంపుతో సంబంధం లేకుండా ఒకేచోటికి లారీలు వెళుతున్నప్పుడు కానీ రెవెన్యూ అధికారులకు కనీసం సందేహం రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని అనేకచోట్ల ఇసుక లారీలు వరుసగా నిలిపిఉంచడం, పొక్లెయిన్లను వినియోగించి లారీల్లోకి లోడు చేస్తున్నప్పటికీ అధికారుల నుంచి అభ్యంతరాలు రాకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. దీనిపై వివరణకు అధికారుల కోసం ప్రయత్నించగా, అందుబాటులో లేరు.