మహిళా కౌన్సిలర్‌ను కొట్టి, జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ నిషాసింగ్‌ను పోలీసులు దారుణంగా కొట్టి జుట్టుపట్టి ఈడ్చికొచ్చి మరీ అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్ పోలీసు స్టేషన్లో శనివారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. హర్యానా అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ (హుడా) ఆధ్వర్యంలో జరిగిన కూల్చివేతలకు నిరసనగా జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనలో గాయపడిన నిషా చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ హింసకు బాధ్యులుగా ఆరోపిస్తూ ఆప్ నేతను అదుపులోకి తీసుకున్నారు. నిషాతో మరో 9 మంది మహిలలపై హత్యాయత్నం తదితర కేసులను నమోదు చేసినట్టు సమాచారం. మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన అనంతరం వారిని జైలు తరలించినట్టు తెలుస్తోంది.
అయితే ఆప్ దీనిపై మండిపడుతోంది. దీని వెనుక సీనియర్ కాంగ్రెస్ నేత హస్తం ఉందని ఆరోపిస్తోంది. నిషా కేవలం అక్కడ జరుగుతున్న ఆందోళనను తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తూండగా దాడిచేశారని ఆరోపిస్తోంది. కాగా లండన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన నిషా.. గత సంవత్సరమే రాజకీయాల్లోకి వచ్చారు. గూగుల్ సంస్థలో ఉద్యోగాన్ని విడిచిపెట్టి గత సంవత్సరం ఆప్‌లో చేరారు.