breaking news
Ninth Schedule
-
తొమ్మిదో షెడ్యూల్లోకి ఎస్సీ, ఎస్టీ చట్టం!
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి రాజ్యాంగరక్షణ కల్పిస్తూ దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసేలా చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ద్వారా న్యాయస్థానాల సమీక్షకు వీలు లేకుండా చేయాలని భావిస్తోంది. అయితే, దీనికి ముందుగా ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద సత్వర అరెస్టులను నిరోధిస్తూ మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలనే అంశంపై బిల్లు ప్రవేశపెట్టనుంది. తొమ్మిదో షెడ్యూల్లోని అంశాలపై సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు వీలుండదు. దీనికంటే ముందుగా ఆర్డినెన్స్ తేనుందని సమాచారం. తీర్పును సమీక్షించాలన్న ప్రభుత్వ పిటిషన్ ఈ నెల 16వ తేదీన విచారణకు రానుంది. సుప్రీం తీర్పు మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. -
ఇరు ప్రభుత్వాలకు అధికారం లేదు
9వ షెడ్యూల్లోని కార్పొరేషన్లపై తేల్చి చెప్పిన హైకోర్టు ఏపీఎస్ఐడీసీఎల్ చైర్మన్, డెరైక్టర్లను తొలగించిన ఏపీ ప్రభుత్వం జీవో అమలు నిలుపుదల.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న కంపెనీలు, కార్పొరేషన్ల విభజన జరగనంతవరకు వాటి పాలక మండళ్ల రద్దు అధికారం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తొమ్మిదో షెడ్యూల్లో ఉండి, ఇంకా ఉమ్మడిగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఐడీసీఎల్) చైర్మన్, డెరైక్టర్లను ఏపీ ప్రభుత్వం తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ నెల 1న జారీ చేసిన జీవో 58ను నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి రెండు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్రానికి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేశారు. ఏపీఎస్ఐడీసీఎల్ చైర్మన్, డెరైక్టర్లుగా ఉన్న తమను తొలగించడాన్ని సవాలు చేస్తూ గంటా మురళీ రామకృష్ణ, ఎస్.శివారెడ్డి, వై.నాగయ్య, కె.జి.గంగాధర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ల పదవీకాలం వచ్చే ఏడాది జూలై 3 వరకు ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం తరువాత కొన్ని కార్పొరేషన్లు, కంపెనీలను ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చిందని, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం వాటి ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ పూర్తయ్యేంతవరకు అవి ఉమ్మడిగానే ఉంటాయని వివరించారు. కాబట్టి చైర్మన్, డెరైక్టర్లను తొలగించే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని వివరించారు. ఈ వాదనలను తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి సమర్థించారు. కాగా, ఏపీ ఏజీ వేణుగోపాల్ మాత్రం తమ చర్యలను సమర్థించుకున్నారు. పిటిషనర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమితులయ్యారని, కాబట్టి అదే ఆదేశాల మేరకు పదవుల నుంచి తప్పుకోవాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి... తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు జీవో అమలును నిలుపుదల చేస్తున్నట్లు తన తీర్పులో పేర్కొన్నారు.