కోహ్లికి ముందు ముగ్గురు!
ఇండోర్: పరుగుల యంత్రాన్ని తలపిస్తూ ఇప్పటికే పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శతకం సాధించిన కోహ్లి..భారత తరపున టెస్టుల్లో అత్యధికంగా సెంచరీలు చేసిన కెప్టెన్లలో నాల్గోవాడిగా నిలిచాడు. 191బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఇది కోహ్లి టెస్టు కెరీర్ లో 13 వ సెంచరీ కాగా, భారత కెప్టెన్ గా ఆరో సెంచరీ.
ఈ తాజా సెంచరీతో టైగర్ పటౌడీ ఐదు సెంచరీల కెప్టెన్సీ రికార్డు ను అధిగమించిన కోహ్లి.. మరో ఆరు సెంచరీలు చేస్తే సునీల్ గవాస్కర్ అత్యధిక సెంచరీల రికార్డును అధిగమిస్తాడు. ఇప్పటి వరకూ భారత తరపున కెప్టెన్లగా చేసిన వారిలో గవాస్కర్ 11 శతకాలతో తొలి స్థానంలో ఉండగా, ఆ తరువాత మహ్మద్ అజహరుద్దీన్ 9 సెంచరీలతో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లికి ముందు స్థానంలో సచిన్ టెండూల్కర్ 7 శతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ ముగ్గురు మాజీ కెప్టెన్లలో అధిగమించడానికి కోహ్లి మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చినా , వారి రికార్డును బద్దలు కొట్టడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.
గవాస్కర్ తన కెరీర్ లో 47 టెస్టు మ్యాచ్ లకు కెప్టెన్ గా చేయగా, 74 ఇన్నింగ్స్ ల్లో 11 శతకాలు సాధించాడు. అయితే మహ్మద్ అజహరుద్దీన్ 47 మ్యాచ్ ల్లో 68 ఇన్నింగ్స్ ల్లో 9 సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్ 25 టెస్టులకు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరించి 43 ఇన్నింగ్స్ ల్లో 7 శతకాలు సాధించాడు. ప్రస్తుతం 17వ టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ గా చేస్తున్న కోహ్లి.. 26 ఇన్నింగ్స్ ల్లో ఆరు సెంచరీలను నమోదు చేయడం విశేషం. ఇదిలా ఉండగా, భారత్ లో కెప్టెన్ గా కోహ్లికిదే తొలి సెంచరీ.
మరోవైపు న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో విరాట్ ఖాతాలోనే తొలి సెంచరీ చేరింది. అంతకుముందు ఈ సిరీస్ లో పూజారా చేసిన 87 పరుగులే కోహ్లి సెంచరీ కంటే ముందు అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లో భాగంగా ఆంటిగ్వా మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన కోహ్లి.. ఆ తరువాత మోస్తరుగా రాణించాడు. ఆ డబుల్ సెంచరీ తరువాత కోహ్లి ఏడు ఇన్నింగ్స్ లను పరిశీలిస్తే అతని స్కోర్లు 44,3, 4,9, 18, 9, 45గా ఉన్నాయి.