breaking news
New Section
-
కొత్త విభాగాల్లోకి తత్వ హెల్త్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న తత్వ హెల్త్ అండ్ వెల్నెస్ కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ఇటీవలే కేసరి బ్రాండ్ పేరుతో కుంకుమ పువ్వు అమ్మకాలను ప్రారంభించిన ఈ సంస్థ త్వరలో డ్రై ఫ్రూట్స్ విపణిలోకి ప్రవేశిస్తోంది. వివిధ దేశాల నుంచి నాణ్యమైన రకాలను సేకరించి ఇక్కడ విక్రయిస్తామని తత్వ హెల్త్ ఎండీ సచిన్ జైన్ తెలిపారు. సాఫ్రాన్ టీ, మిల్క్‌ను సైతం ప్రవేశపెడతామని చెప్పారు. హైదరాబాద్ మార్కెట్లో కేసరి బ్రాండ్ ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా నేషనల్ సేల్స్ మేనేజర్ కె.గురుప్రసాద్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కుంకుమ పువ్వు అత్యధికంగా పండే ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయిస్తున్నట్టు తెలిపారు. దక్షిణాదిన కుంకుమ పువ్వును తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారని వివరించారు. భారత్‌లో సాఫ్రాన్ అమ్మకాల్లో 70-80 శాతం నకిలీదేనని అన్నారు. కశ్మీర్లో ఈ ఉత్పాదన సాగు పెంచేందుకు స్పైస్ బోర్డ్‌కు ప్రతిపాదన చేశామన్నారు. -
భూ బిల్లులో కొత్త సెక్షన్!
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే లక్ష్యంతో బిల్లులో మరికొన్ని సవరణలు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పుడు.. ‘రైతుల ఆమోదం’, ‘సామాజిక ప్రభావ అంచనా’లను భూసేకరణ ప్రక్రియలో పొందుపర్చే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకు కల్పించే ప్రతిపాదనతో ఒక కొత్త సెక్షన్‌ను బిల్లు లో చేర్చాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భూసేకరణ బిల్లు లో ఈ రెండు అంశాలపైననే విపక్షాలు పట్టుబడ్తున్న నేపథ్యంలో.. ఈ ప్రతిపాదనతో వాటిని చల్లబర్చొచ్చని కేంద్రం భావిస్తోందని తెలిపాయి. భూ సేకరణ బిల్లుపై మంగళవారంరాత్రి కేంద్ర కేబినెట్ చర్చ జరిపిందని, ఆ భేటీలో ఈ ప్రతిపాదన సహా మరికొన్ని ప్రతిపాదనలపై చర్చించారని వెల్లడించాయి. భూ బిల్లు ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం.. రెండూ కొంత దిగి రావాలంటూ అఖిలపక్ష భేటీలో ఎస్పీ నేత ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ చేసిన సూచనను ప్రధాని సమర్ధించిన నేపథ్యంలో కేబి నెట్ భేటీ జరిగింది. భూ సేకరణ బిల్లుపై ఏర్పాటైన జేపీసీకి వివిధ వర్గాల నుంచి 672 వినతిపత్రాలు రాగా, అందులో 670 మోదీ సర్కారు తీసుకురాదలచిన సవరణలను వ్యతిరేకించినవే కావడం విశేషం. భూ బిల్లుపై నివేదికను జేపీసీ పార్లమెంటుకు సమర్పించే గడవును ఆగస్ట్ 3 వరకు పొడిగించారు. ఈ మేరకు జేపీసీ చైర్మన్ అహ్లూవాలియా చేసిన తీర్మానానికి బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది.