ఏపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది
విద్యుత్ అంశంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు
విద్యుత్‌తోపాటు హైకోర్టు విభజన, ఐటీ హబ్‌పై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు
సాక్షి, న్యూఢిల్లీ: పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం తమకు రావాల్సిన విద్యుత్ కేటాయింపుల విషయంలో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కేంద్రం దృష్టికి తెచ్చింది. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలపై పరిష్కారానికి నియమించిన నీరజా మాథుర్ కమిటీకి సైతం త్వరగా నివేదికను సమర్పించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు డా.వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రు, టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో పాటు కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శి, నీరజా మాథుర్ కమిటీతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారికి అంశాల వారీగా వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో పంటలు ఎండిపోతున్నా విభజన చట్టంలో పేర్కొన్న వాటా ప్రకారం విద్యుత్ పంపిణీ చేయకుండా.. ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్కే సిన్హాకు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. పీపీఏలను రద్దు చేయడంతోపాటు కృష్ణపట్నం ప్లాంట్ నుంచి తెలంగాణకు విద్యుత్ రాకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని, తెలంగాణ రైతులకు కేసీఆర్‌పై వ్యతిరే కత తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చామని వారు పేర్కొన్నారు. తర్వాత నీరజా మాథుర్‌ను కలసి త్వరగా నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.
ఈ నివేదిక వస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి అంశంలో ఏదోఒకటి అడ్డు చెబుతూ మాథుర్ కమిటీ నివేదిక రాకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రామచంద్రు ఆరోపించారు. నివేదిక ఇవ్వడానికి డిసెంబర్ 30 వరకు సమయం ఉందని, త్వరలోనే రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని నీరజామాథుర్ చెప్పినట్టు వెల్లడించారు.
అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అంశాన్ని త్వరగా తేల్చాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడకు విజ్ఞప్తి చేసినట్టు ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడతానని.. పది రోజుల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఇక హైదరాబాద్ పరిసరాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలను కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దృష్టికి తెచ్చామని తెలిపారు.