breaking news
ndian team
-
‘శాస్త్రి’ వేసిన మంత్రమేంటి!
►భారత జట్టులో ఒక్కసారిగా మార్పు ►ఆటగాళ్లలో తిరుగులేని ఆత్మవిశ్వాసం ►వన్డేల్లో అద్భుత ప్రదర్శన ►టీమ్ డెరైక్టర్ నివేదిక ప్రభావమేనా! నాటింగ్‌హామ్‌లో రెండో వన్డే... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అండర్సన్ గార్డ్ తీసుకుంటుండగా మైదానంలో ఒక్కసారిగా ప్రేక్షకుల అరుపులు, హేళన... ఆ తర్వాత భారత్ జట్టు విజయం పూర్తయ్యాక నాటౌట్ బ్యాట్స్‌మన్ జడేజా పాటతో శృతి కలుపుతూ అభిమానుల ఆనందోత్సాహం... కొద్ది రోజుల క్రితం ఇదే మైదానంలో ఉన్న పరిస్థితికి, నేటికి ఒక్కసారిగా ఎంత మార్పు. టెస్టుల్లో ఘోర పరాజయం, అండర్సన్‌తో వివాదం వంటి పరిణామాలతో ధోని సేన ఎలా కనిపించింది? అదే ఇప్పుడు ఒకవైపు ఇంగ్లండ్ జట్టు ఓటమి భారంతో కుంగిపోయి నిర్వేదంగా ఉంటే మరోవైపు భారత ఆటగాళ్లలో మాత్రం అంతులేని ఆత్మవిశ్వాసం. టెస్టుల్లో ఓడిన జట్టు ఇదేనా అనిపించే విధంగా... వన్డేల్లో టీమిండియా విజయాలు సాధిస్తోంది. ఒక్కసారిగా ఈ మార్పుకు కారణమేంటి... ఆటగాళ్ల ప్రదర్శనపై ‘డెరైక్టర్’ ప్రభావమేంటి? సాక్షి క్రీడా విభాగం: టెస్టు సిరీస్‌తో పోలిస్తే భారత వన్డే జట్టులో ప్రధానంగా మూడు మార్పులు జరిగాయి. రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ జట్టులోకి వచ్చారు. మిగతా ఆటగాళ్లంతా వైఫల్యంలో భాగమైనవారే. కానీ వన్డేలకు వచ్చేసరికి ఇదే జట్టు తిరుగులేనిదిగా కనిపిస్తోంది. ముఖ్యంగా జడేజా, అశ్విన్‌లాంటి ఆటగాళ్లు తమ విలువేంటో చూపించారు. రహానే కూడా విరామం తర్వాత ఓపెనింగ్‌కు వచ్చినా ఎలాంటి తడబాటుకు లోను కాకుండా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించాడు. నాలుగు, ఐదు టెస్టుల్లో రహానే అవుటైన తీరుతో పోలిస్తే అతను తన బాధ్యతను గుర్తించినట్లు కనిపించింది. వన్డేల్లో తిరుగులేని ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లి కూడా రెండో వన్డేతో మళ్లీ ఆత్మవిశ్వాసం అందుకునే పనిలో పడ్డాడు. సహచరులతో స్ఫూర్తి పొందాడేమో... ఎంతో సంయమనంతో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రెండు మ్యాచుల్లోనూ జట్టులో సమష్టితత్వం కనిపించింది. ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడకుండా ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు. కీలక భాగస్వామ్యాలతో బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తే... బౌలర్లూ ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. ఇక వన్డేల్లో ధోని కెప్టెన్‌గా తన మార్క్‌ను మరోసారి చూపించాడు. ఇంగ్లండ్ బలహీనతపై దెబ్బ కొడుతూ సరైన సమయంలో స్పిన్నర్లను ఉపయోగించుకున్న తీరు అతనేమిటో చూపించింది. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ప్రధాన బౌలర్ మోహిత్ గాయపడినా ఆ ప్రభావమే కనపడనీయలేదు. చాన్స్ దక్కగానే... వన్డేల్లో రైనాకు ఎప్పటినుంచో గుర్తింపు ఉంది. కానీ గత మ్యాచ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం తెలుగు తేజం రాయుడు ప్రదర్శన గురించే. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే ఇంగ్లండ్ గడ్డపై అండర్-19 ఆటగాడిగా అంబటి రాయుడు 114 బంతుల్లోనే 177 పరుగులు చేసి తొలిసారి వెలుగులోకి వచ్చాడు. అదే మ్యాచ్‌లో రైనా 3 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు! కానీ పుష్కర కాలం తర్వాత కూడా రాయుడు భారత ప్రధాన జట్టులో చోటు దక్కించుకునేందుకు ఇంకా శ్రమిస్తున్నాడు. రెండో వన్డేకు ముందు 13 మ్యాచ్‌లు ఆడినా... ఇలాంటి కీలక ఇన్నింగ్స్ ఆడే అవకాశం అతనికి దక్కలేదు. కానీ ఇప్పుడు మిడిలార్డర్లో స్థానానికి తానూ రేస్‌లో ఉన్నానని ఈ మ్యాచ్‌తో అతను నిరూపించుకోవడం మంచి పరిణామం. ఇదే జట్టు కొనసాగుతుందా... ‘ఓవరాల్‌గా ఇది చాలా మంచి జట్టుగా కనిపిస్తోంది. ఒకసారి మన బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే అద్భుతంగా ఉంది. రోహిత్ కూడా ఫిట్‌గా ఉంటే ఇక తిరుగు లేదు. పరిస్థితులను బట్టి ఆటగాళ్ల ప్రదర్శనను బేరీజు వేయాలి. అలా చూస్తే అందరూ బాగా ఆడుతున్నారు’... రెండో వన్డే విజయం అనంతరం భారత కెప్టెన్ ధోని వ్యాఖ్య ఇది. వరుస ఓటముల తర్వాత వన్డేల్లో విజయాలతో సహచరులు తనలో ఆత్మవిశ్వాసం పెంచారన్నట్లు ధోని మాటల్లో వినిపించింది. ఇక మన జట్టు ఫీల్డింగ్ కూడా అత్యుత్తమ స్థాయిలో ఉంది. దీనిని కూడా ధోని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇప్పుడు ఉన్న ఆటగాళ్లలో ఒక్క ధావన్ మినహా అంతా గాడిలో పడటం చెప్పుకోదగ్గ పరిణామం. అయితే ఒక్క మంచి ఇన్నింగ్స్ అతడిని నిలబెడుతుందని కెప్టెన్ భావిస్తున్నాడు. అదే జరిగితే అది జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. నయానో... భయానో... టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి బస్సులో తనలో స్ఫూర్తి నింపడమే కారణమని రైనా చెబుతున్నాడు. మరోవైపు వన్డే సిరీస్‌కు ముందు డెరైక్టర్‌ను లెక్క చేయని కెప్టెన్, ఇప్పుడు మౌనం వహిస్తున్నాడు. ఇంతకీ రవిశాస్త్రి చేసిందేమిటి... ఆయన చేతిలోకి ఏ మంత్రదండం వచ్చేసింది? జట్టు, ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించడం, వారితో మాట్లాడటమే కాదు... మరో ప్రత్యేక పనిని కూడా శాస్త్రికి బోర్డు అప్పగించింది. ఆటగాళ్ల ప్రవర్తన, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, ఫ్లెచర్ పని తీరు, ధోని కెప్టెన్సీ... ఇలా ప్రతీ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను శాస్త్రి బీసీసీఐకి ఇవ్వనున్నారు. ‘సరిగ్గా చెప్పాలంటే ఈ నివేదికపైనే కొందరు యువ ఆటగాళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా ఆటగాళ్లపై ఎలాంటి వ్యక్తిగత అభిమానంలాంటివి లేకుండా పూర్తి పారదర్శకంగా దీనిని ఇవ్వాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నివేదిక అంశం ఆటగాళ్లను ఒక్కసారిగా ఉత్తేజితుల్ని చేసినట్లుంది. ఆడకపోతే ఇంతే సంగతులు అనే సందేశం కూడా వారికి వెళ్లింది. దాంతో టెస్టు వైఫల్యం అనంతరం అందరికీ తమ బాధ్యత గుర్తొచ్చింది. ఇకపై శాస్త్రి ‘మార్గదర్శనం’ ఇదే తరహాలో ఉంటే భారత జట్టు వరుస విజయాల జోరు సాగించడం ఖాయంగా కనిపిస్తోంది. -
విశ్వాసం పెరిగేలా...
వరుస ఓటములతో ఇంటా బయటా విమర్శల జడివానలో తడిసి ముద్దవుతున్న ధోని సేనకు కాస్త ఊరట.. విజయం కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూస్తున్న భారత ఆటగాళ్లకు కొంత ఉపశమనం.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం సన్నాహకంగా జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ సత్తా చూపింది. కీలకమైన పోరుకు ముందు ఈ మాత్రం ప్రదర్శనతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఫామ్ విషయంలో ఇబ్బందులెదుర్కొంటున్న విరాట్ కోహ్లితో పాటు తెలుగు తేజం అంబటి రాయుడు అదరగొట్టడం జట్టుకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ప్రాక్టీస్ వన్డేలో భారత్ ఘనవిజయం ►అదరగొట్టిన రాయుడు ►ఫామ్‌లోకొచ్చిన కోహ్లి ►బౌలర్ల సమష్టి రాణింపు లండన్: భారత జట్టు తరఫున తొలిసారి ఇంగ్లండ్‌లో ఆడుతున్న అంబటి తిరుపతి రాయుడు (82 బంతుల్లో 72 రిటైర్డ్ అవుట్; 8 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. వన్డే సిరీస్ కోసం వచ్చీ రాగానే సన్నాహక మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించి భరోసానిచ్చాడు. అలాగే సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో మన బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. ఫలితంగా లార్డ్స్ మైదానంలో శుక్రవారం మిడిలెసెక్స్‌తో జరిగిన వన్డేలో భారత్ 95 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 44.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. పూర్తి స్థాయి ఆటగాళ్లతోనే బరిలోకి దిగినా నిర్ణీత ఓవర్లు ఆడలేకపోయింది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (75 బంతుల్లో 71; 8 ఫోర్లు; 1 సిక్స్) తన పరుగుల దాహాన్ని తీర్చుకోగా మిగిలిన బ్యాట్స్‌మెన్ మాత్రం నిరాశపరిచారు. 52 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ కోహ్లికి రాయుడు అండగా నిలిచాడు. ఈ జోడి బౌండరీలతో విరుచుకుపడి స్కోరును పట్టాలెక్కించింది. 59 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ సాధించాడు. అయితే కుదురుగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను రవి పటేల్ దెబ్బతీశాడు. సింప్సన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. కొద్దిసేపటికే జడేజా (7) వెనుదిరిగాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రాయుడు 40వ ఓవర్లో రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఆఫ్ స్పిన్నర్ రేనర్ (4/32) ధాటికి 19 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిడిలెసెక్స్ను భారత బౌలర్లు కలిసికట్టుగా నిలువరించారు. వీరి కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా జట్టు 39.5 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటయ్యింది. హిగ్గిన్స్ (24 బంతుల్లో 20; 3 ఫోర్లు), హారిస్ (22 బంతుల్లో 20; 4 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ను కరణ్ శర్మ (3/14) వణికించాడు. భువనేశ్వర్, షమీ, మోహిత్, ఉమేశ్, కులకర్ణి, అశ్విన్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. స్కోరు బోర్డు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) సంధూ (బి) ఫిన్ 8; ధావన్ (సి) మలన్ (బి) సంధూ 10; కోహ్లి (సి) సింప్సన్ (బి) పటేల్ 71; రహానే (సి) ఫిన్ (బి) హారిస్ 14; రాయుడు (రిటైర్డ్ అవుట్) 72; జడేజా (సి) గుబ్బిన్స్ (బి) పటేల్ 7; అశ్విన్ ఎల్బీడబ్ల్యు (బి) రేనర్ 18; శామ్సన్ (సి అండ్ బి) రేనర్ 6; బిన్నీ (సి అండ్ బి) రేనర్ 0; కరణ్ శర్మ నాటౌట్ 8; రైనా (స్టంప్డ్) సింప్సన్ (బి) రేనర్ 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (44.2 ఓవర్లలో ఆలౌట్) 230. వికెట్ల పతనం: 1-19; 2-29; 3-52; 4-156; 5-174; 6-211; 7-211; 8-211; 9-224; 10-230. బౌలింగ్: ఫిన్ 6-0-20-1; సంధూ 9-1-65-1; హారిస్ 7-1-29-1; పొడ్మోర్ 4-0-26-0; పటేల్ 9-0-56-2; రేనర్ 9.2-1-32-4. మిడిలెసెక్స్ ఇన్నింగ్స్: మలన్ (బి) షమీ 5; గుబ్బిన్స్ (సి) శామ్సన్ (బి) భువనేశ్వర్ 2; స్టిర్లింగ్ (సి) శామ్సన్ (బి) ఉమేశ్ 17; మోర్గాన్ (సి) శామ్సన్ (బి) మోహిత్ 16; హిగ్గిన్స్ (సి) ధావన్ (బి) కులకర్ణి 20; సింప్సన్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 19; బల్బిర్నీ (బి) కరణ్ 19; రేనర్ (రనౌట్) 5; హారిస్ (స్టంప్డ్) శామ్సన్ (బి) కరణ్ 20; పొడ్మోర్ నాటౌట్ 4; సంధూ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (39.5 ఓవర్లలో ఆలౌట్) 135. వికెట్ల పతనం: 1-7; 2-11; 3-34; 4-64; 5-67; 6-101; 7-108; 8-114; 9-135; 10-135. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-7-1; షమీ 4-1-13-1; మోహిత్ 5-2-20-1; ఉమేశ్ 7-0-32-1; కులకర్ణి 4-0-13-1; అశ్విన్ 6-2-16-1; జడేజా 6-0-14-0; కరణ్ 4.5-1-14-3.