26/11 దాడుల్లో ‘దుబాయ్ వ్యక్తి’? : ఎన్ఐఏ ఆరా
న్యూఢిల్లీ: మహానగరం ముంబైలో చోటుచేసుకున్న 26/11 ఉగ్రదాడుల్లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana)ను అమెరికా నుంచి భారత్కు రప్పించాక, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అతనిని విచారిస్తోంది. ఈ నేపధ్యంలో ఆశ్చర్యకరమైన విషయమొకటి బయటపడింది. దుబాయ్లో ఉంటున్న ఒక వ్యక్తికి 2008 ముంబై దాడుల గురించి ముందే తెలిసి ఉండవచ్చుననే ఆధారాలు లభించాయి. అయితే ఈ వ్యక్తి గుర్తింపు ఇంకా స్పష్టం కాలేదు. కానీ రాణాతో అతనికున్న సంబంధం వెల్లడైతే దాడులకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. తహవ్వూర్ హుస్సేన్ రాణా విచారణ ముంబై దాడుల కుట్రను బయటపెట్టడంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిపుణులు చెబుతున్నారు.తహవ్వూర్ రాణా(64)కెనడియన్ పౌరుడు. పాకిస్తాన్ సైన్యంలో మాజీ క్యాడెట్. వైద్య నిపుణునిగానూ పనిచేశాడు. 26/11 ముంబై ఉగ్రదాడులలో కీలక సహకారిగా తహవ్వూర్ రాణా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈయన డేవిడ్ కోల్మన్ హెడ్లీ (దాడులలో మరో కీలక నిందితుడు)కి సన్నిహితుడు. రాణా..హెడ్లీకి ముంబైలో దాడుల ప్రాంతాలను సర్వే చేయడానికి సహకారించాడనే ఆరోపణలున్నాయి. రాణా 2009లో అమెరికాలో అరెస్టయ్యాడు. డానిష్ వార్తాపత్రికపై దాడి పథకం కేసులో అతని అరెస్టు జరిగింది. 2013లో అతను లష్కర్-ఎ-తొయిబా(Lashkar-e-Taiba) (ఎల్ఈటీ)కు మద్దతు ఇచ్చినందుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు.రాణాను అమెరికా నుంచి భారత్కు రప్పించిన తర్వాత, ఎన్ఐఏ అతనిని 18 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈ విచారణలో దుబాయ్లో నివసిస్తున్న ఒక వ్యక్తి గురించిన సమాచారం బయటపడింది. అతను 26/11 దాడుల గురించి ముందే తెలుసుకొని ఉండవచ్చని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ దుబాయ్ వ్యక్తికి ఎల్ఈటీ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉండవచ్చని, లేదా దాడులకు సంబంధించిన ఆర్థిక లేదా లాజిస్టికల్ సహాయం అందించి ఉండవచ్చని ఎన్ఐఏ అధికారులు(NIA officials) అనుమానిస్తున్నారు.ఎన్ఐఏ రాణాను పలు ప్రధాన అంశాలపై విచారిస్తోంది. ముంబై దాడులలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పాత్రను లోతుగా తవ్వితీసే ప్రయత్నం చేస్తోంది. అలాగే లష్కర్-ఎ-తొయిబాతో అతనికి గల సంబంధాల గురించి ఆరాతీస్తోంది. రాణా ఎల్ఈటీతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడు? దాడుల పథకంలో అతని నిర్దిష్ట పాత్ర ఏమిటనేదానిపై విచారణ కొనసాగిస్తోంది. ఇందుకోసం ఎన్ఐఏ అధికారులు రాణాను దేశంలోని వివిధ నగరాలకు తీసుకెళ్లి, ముంబై దాడుల తరహాలో ఇతర నగరాలలో కూడా ఉగ్రవాద దాడులకు సంబంధించిన పథకాలేమైనా రూపొందించారా అనేదానిపై విచారణ చేయనుంది.ఇది కూడా చదవండి: గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన