breaking news
natham viswanathan
-
ఐటీ కొరడా
మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్, చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరైస్వామి ఇళ్లు, కాలేజీలు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖాధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అలాగే నగరంలోని ఓ జ్యువెలరీలో కూడా తనిఖీలు నిర్వహించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై మేయర్ సైదై దొరస్వామి ఇల్లు సీఐటీ నగర్లోనూ, ఆయన కుమారుని ఇల్లు సేలయ్యూర్ మాడపాక్కలో ఉంది. ఈ ఇళ్లతోపాటూ వీరికి సొంతమైన కార్యాలయాల్లోకి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఆకస్మికంగా ప్రవేశించారు. మేయర్ సెల్‌ఫోన్, ల్యాండ్ ఫోన్లలో మాట్లాడకుండా కట్టడి చేశారు. ఇంటి బయట సాయుధ పోలీసులను బందోబస్తు పెట్టి లోనికి ఎవ్వరినీ అనుమతించలేదు. ఆ తరువాత ఇంటిలోని అన్ని గదులు, నలుమూలలా తనిఖీలు ప్రారంభించారు. సేలయ్యూర్లోని మేయర్ కుమారుడి ఫాంహౌస్‌పై కూడా అదే సమయంలో దాడులు జరిపారు. అలాగే చెన్నై టీనగర్ చిన్నయ్యాపిళై్ల వీధిలోని మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్ ఇల్లు, దిండుగల్లు జిల్లా వేంపార్పట్టియల్లోని అతని కుమారుడు అమర్నాథ్, బావమరిది కన్నన్ నివసించే ఇల్లు, ఉలపక్కుడిలోని ఎన్పీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఒకేసారి దాడులు నిర్వహించారు. ఎన్పీఆర్ కళాశాలలో ఆదివారం వరకు టీఎన్పీఎస్ క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు జరపడం గమనార్హం. జ్యువెలరీపై దాడి అలాగే కోయంబత్తూరు కేంద్రంగా చెన్నై, దిండుగల్లులో బంగారు నగల వ్యాపారాలు నిర్వహిస్తున్న జ్యువెలరీలపైనా, యజమానుల ఇళ్లపై ఐటీ దాడులు జరిపారు. కోవై గ్రేస్రోడ్డు, రాజావీధి, ఆర్ఎస్పురంలలో కాళిదాస్ నగల దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ బంగారు, డైమం డ్స్ నగల తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల యాజమాన్యాల ఇళ్లు కోవై ఆర్ఎస్పురంలో ఉన్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు చెన్నైకి చెందిన ఆదాయపు పన్నుశాఖాధికారుల నాలుగు బృందాలు వేర్వేరుగా రెండు దుకాణాలు, ఇళ్లపైనా దాడులకు దిగాయి. అలాగే మధురైలోని మీనాక్షి వైద్యశాలపై కూడా ఆకస్మిక దాడులు జరిపారు. ఇలా తమిళనాడు మొత్తం మీద ఏకకాలంలో 40 చోట్ల దాడులు ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు, నగలు, డాక్యుమెంట్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఐటీ దాడులు సోమవారం రాత్రి వరకు కొనసాగాయి. నత్తంపై పార్టీ వేటు ఐటీ దాడుల నేపథ్యంలో మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్‌పై అన్నాడీఎంకే వేటు వేసింది. పార్టీ నిర్వాహక కార్యదర్శి, కార్యవర్గ కమిటీ కార్యదర్శి పదవుల నుంచి తొలగిస్తున్నట్లుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత సోమవారం ఆదేశాలు జారీచేశారు. -
టాస్మాక్ రాబడి రూ.21వేల కోట్లు
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మద్యాన్ని నేరుగా ప్రభుత్వమే విక్రయిస్తోంది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నేతృత్వంలో టాస్మాక్ పేరిట మద్యం దుకాణాలను నెలకొల్పింది. ఐదారేళ్లుగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరందుకుంటున్నాయి. వేలల్లో ఆదాయం వస్తుండడంతో సరికొత్త తరహా బ్రాండ్లను ఈ దుకాణాల్లో అందుబాటులోకి తెచ్చారు. అలాగే, అతి పెద్ద మాల్స్‌లో ఎలైట్ పేరిట వైన్స్ ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ శాఖ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 6800 టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి. 4371 టాస్మాక్ బార్లు, ఏడు వేల 39 చిల్లర విక్రయాల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల క్రితం వరకు ఏడాదికి రూ. ఐదు వేల కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే, ఇటీవల కాలంగా వేలల్లో విక్రయాలు సాగుతున్నాయి. 2011-12లో 18 వేల కోట్లు ఆదాయం రాగా, 2012-13లో ఇరవై వేల కోట్లు దాటింది. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో విక్రయాలు సాగడంతో 21,680 కోట్ల రాబడి ప్రభుత్వానికి వచ్చింది. ఏడాదికా ఏడాది విక్రయాలు పెరగడం బట్టి చూస్తే, రాష్ట్రంలో మందుబాబుల సంఖ్య ఏ మేరకు ఉన్నదో, ఏ మేరకు తాగి తగలేస్తున్నారో అన్నది స్పష్టం కాక తప్పదు. దీంతో రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం నినాదాన్ని అనేక పార్టీలు అందుకున్నాయి. మద్య నిషేధం లక్ష్యంగా ఉద్యమాలతో ముందుకు సాగుతున్నాయి. తగ్గిన రాబడి ఇన్నాళ్లు ఆదాయం పైపైకి వెళుతుంటే, ఈ సారి కాస్త తగ్గుముఖం పట్టడం గమనించాల్సిందే. 2013-14లో 21,640 కోట్లు రాబడి వచ్చింది. 2012-13తో పోల్చితే 40 కోట్ల వరకు తక్కువగా ఉండడం గమనార్హం. ఇదే విషయాన్ని ఆ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం టాస్మాక్ మద్యం దుకాణాలు మాత్రమేనని, తమిళనాడులో ఎలా మద్య నిషేధం అమలు చేయగలమని మంత్రి ప్రశ్నించడం గమనార్హం. ఇక, ఈ ఏడాది రూ.40 కోట్ల వరకు రాబడి తగ్గడానికి మందుబాబుల సంఖ్య తగ్గినట్టు భావించడం తప్పులో కాలేసినట్టే. టాస్మాక్ ఉద్యోగుల డిమాండ్ల మేరకు ప్రభుత్వ సెలవు దినాలు 2013లో పెరిగాయి. అలాగే, లోక్ సభ ఎన్నికలు, ఫలితాల లెక్కింపు కాస్త ఈ దుకాణాలకు తాళం వేయించడం, అలాగే, టాస్మాక్ వేళల తగ్గింపుతో ఈ స్వల్ప తగ్గుదల చోటు చేసుకుందంటూ మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.