breaking news
Narmetta excavations
-
అబ్బుర పరిచిన ఆదిమానవుని ఆనవాళ్లు..
సాక్షి, నంగునూరు: ఆదిమానవుల ఆనవాళ్లు, అతిపురాతన వస్తువులు.. అబ్బుర పరిచే అవశేషాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్ గ్రామాల్లో బయటపడ్డాయి. ఆదిమానవుని సమాధి, వారు వాడుకున్న సామాగ్రీ వెలుగు చూశాయి. ఇవి సుమారు 3000 వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు వినియోగించినట్లు పురావస్తుశాఖ అధికారులు పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరి నుంచి మూడు నెలల పాటు నంగునూరు మండలంలోని నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్ గ్రామాల్లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అతి పురాతన వస్తువులు, ఆదిమానవుని ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ అవశేషాలను హైదరాబాద్లోని పురావస్తుశాలకు తరలించి భద్రపరిచారు. (చదవండి: హైదరాబాద్లో 6 రకాల బిర్యానీలు.. కచ్చీ, పక్కీ బిర్యానీ అంటే తెలుసా?) 1.క్యాప్స్టోన్గా అతిపెద్ద బండరాయి.. ఈ చిత్రంలో కనిపిస్తున్నపెద్ద బండరాయి ఆదిమానవుల సమాధిపై ఉన్న క్యాప్స్టోన్. ఇది సుమారుగా 3 వేల సంవత్సరాల కిందటిదిగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సమాధిపై కప్పిఉన్న బండరాయి (క్యాప్స్టోన్) 6.70 మీటర్ల పొడవు, 4 మీటర్లు వెడల్పు, 65 సెంటీమీటర్లు మందంతో 43 టన్నుల బరువు ఉంది. దీన్ని క్రేన్ సహాయంతో లేపేందుకు ప్రయత్నించగా దాని సామర్థ్యం సరిపోలేదు. దీంతో 80 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న క్రేన్ సహాయంతో 2 గంటల పాటు కష్టపడి బండను తొలగించారు. 2. సుద్ద ముక్కలు కావు శంఖాలు (కౌంచ్) సుద్దరాళ్లుగా కనిపిస్తున్న ఈ వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డ శంఖాలు. ప్రాచీన మానవుడు ప్రార్థన చేసేందుకు, వ్యక్తి చనిపోయిన తరువాత అంత్యక్రియల సమయంలో గౌరవ సూచకంగా వీటిని వాడేవారని పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కొన్ని తెగల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆనాటి కాలంలో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 3. కుండలు పెట్టుకునే రింగ్స్టాండ్ ఆదిమానవులు వంట పాత్రలను పెట్టుకునే స్టాండ్ ఇది. వంటలు చేయగానే కుండలు పడిపోకుండా, క్రిమికీటకాలు కుండల్లోకి పోకుండా ఇలాంటి ఎరుపు రంగు కల్గిన కుదర్లు (రింగ్స్టాండ్) వాడేవారు. చూడడానికి ఢమరుకం లాగ కనబడుతున్నా వాస్తవానికి మట్టికుండలు పెట్టుకునే ఉపయోగించే రింగ్స్టాండ్ ఇది. 4. నక్షత్ర సమూహాలను గుర్తించే కఫ్మాక్స్ నక్షత్ర సమూహాలు గుర్తించేందుకు ప్రాచీన మానవుడు బండరాళ్లపై కఫ్మాక్స్ లను చెక్కేవారు. ప్రస్తుతం నడుస్తున్న కాలం, తర్వాత వచ్చే సీజన్, ఋతువులను తెలుసుకునేందుకు ఇలాంటి గుర్తులను వారు నివసిస్తున్న ప్రాంతంలో రాతి బండ లపై చెక్కేవారు. (పురావస్తుశాఖ అధికారులు గుంతల్లో ఉప్పు పోయడంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి). 5. తవ్వకాల్లో బయటపడుతున్న మృణ్మయ పాత్రలు ఎరుపు, నలుపుతోపాటు రెండు రకాల రంగులు కల్గిన మిశ్రమ మృణ్మయ బయటపడ్డాయి. రెండు సమాదుల్లో తవ్వకాలు జరుపగా ప్రాచీన మానవులు వాడిన అనేక పాత్రలు, ఎంతో కీలకమై సమాచారం లభించింది. 6. అద్భుతమైన మట్టికుండ ప్రాచీన మానవుడు వాడిన ఎరుపు రంగు మట్టికుండ నర్మెటలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. వేల సంవత్సరాల కిందట తయారు చేసిన మట్టి కుండకు చుట్టు అలంకారంగా సర్కిళ్లు చెక్కగా ఇప్పటికి చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇంత పెద్దకుండను తాగునీటి కోసం ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: జొన్నలకు పులి కాపలా!) 7 ఫైర్స్టాండ్, మృణ్మయ పాత్రలు ధాన్యం, విలువైన వస్తువులు మట్టికుండల్లో దాచేవారు. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన పదార్థాలను కుండల్లో పెట్టి సమాధి చేసేవారు. అలాగే ఫైర్స్టాండ్ (కుంపటి) పై ఆహార పదార్థాలు వేడి చేసుకోవడమే కాకుండా ధూపం వేసుకునేందుకు వీటిని వాడినట్లు తెలుస్తోంది. 8. రాళ్లుకావు ప్రాచీన మానవుని సమాధి పాలమాకులలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అందంగా పేర్చినట్లు కనబడుతున్న బండ రాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. సుమారుగా 3 వేల సంవత్సరాల కిందట ఈప్రాంతంలో ఆదిమానవులు జీవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని సమాధి చేసి నాలుగు వైపుల బండలను (సిస్ట్) స్విస్తిక్ ఆకారంలో ఏర్పాటు చేసేవారు. దాని చట్టూ రెండు వరుసలుగా వృత్తాకారంలో బండరాళ్లను పేర్చారు. 9. గుంతలు కావు గ్రూవ్స్ మగ్దుంపూర్లో ఓరైతు వ్యవసాయ బావి వద్ద ప్రాచీన మానవుడు ఏర్పాటు చేసుకున్న 12 గ్రూవ్స్ గుర్తించారు. జంతువులను వేటాడేందుకు ఉపయోగించే రాతి ఆయుధాలను పదును పెట్టేందుకు వీటిని ఉపయోగించేవారు. 10. గిన్నెల తయారీ అద్భుతం ప్రాచీన మానవులు ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఎరుపు, నలుపు రంగు మట్టి గిన్నెలను ఉపయోగించేవారు. ఇవి ఇతర మట్టిపాత్రలకు భిన్నంగా రెండు రంగులు కల్గి ఉండగా ఇప్పటికి చెక్కుచెదరలేదు. మెన్హీర్ సమీపంలో ఉన్న రెండవ సమాధిలో ఇవి బయటపడ్డాయి. 11. చెక్కు చెదరని దంతాలు మెన్హీర్ వద్ద ఉన్న పెద్ద సమాధిలో జరుపుతున్న తవ్వకాల్లో తెగలోని పెద్ద మహిళదిగా బావిస్తున్న 60 సెంటీమీటర్ల కాలు ఎముక లభించింది. అలాగే 20 సెంటీమీటర్ల దంతంతో కూడిన దవడ భాగం బయటపడింది. దానికి ఉన్న దంతాలు ఇప్పటికి చెక్కుచెదరలేదు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు జరపనున్న పరిశోధనల్లో ఈ రెండు భాగాలు కీలకంగా మారనున్నాయి. 12. ఎముక ఆభరణాలు ఆదిమానవులు ఎముకలతో తయారు చేసిన అభరణాలు వాడినట్లు తెలుస్తోంది. సుమారుగా 20 వరకు డైమండ్ ఆకారంలో ఉన్న ఎముకతో తయారు చేసిన పూసలు మెన్హీర్ వద్ద పెద్ద సమాధిలో జరిపిన తవ్వకాల్లో బయపడ్డాయి. ఇలాంటి ఆకృతి మొదటిసారిగా ఈప్రాంతంలోనే బయట పడ్డట్లు అధికారులు తెలిపారు. (చదవండి: మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు) -
మన చరిత్రలో కీలక ‘పాత్ర’!
♦ పూర్వీకుల గుట్టువిప్పే ఆధారాలు ♦ పాల్మాకుల, నర్మెట్ట తవ్వకాల్లో కీలక అవశేషాలు ♦ మూడు వేల ఏళ్లకు పైవేనంటున్న పురావస్తు శాఖ సాక్షి, హైదరాబాద్ వేల ఏళ్ల క్రితమే మధ్య ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతానికి మానవుల వలస, అందులో కొన్ని తెగలు తిరిగి ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయిన దాఖలాలపై అస్పష్టమైన సమా చారం గతంలోనే బయటపడింది. ఇప్పుడు దాన్ని నిరూపించే విలువైన పరిశోధన అవశేషాలను తెలంగాణ పురావస్తు శాఖ గుర్తించింది. కొద్ది రోజుల క్రితం సిద్దిపేట జిల్లా నంగునూను ప్రాంతంలోని నర్మెట్ట, పాల్మాకుల గ్రామ శివార్లలో జరిపిన తవ్వకాల్లో లభించిన అవశేషాలను అత్యంత విలువైనవని పురావస్తు శాఖ గుర్తించింది. ఇక్కడ లభించిన ఆదిమానవుల సమాధు లను తవ్వి కచ్చితమైన సమాచారాన్ని అందించే అవశేషాలు, అత్యంత అరుదైన పనిముట్లు, వాడుక సామగ్రిని సేకరించింది. వీటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు... తెలంగాణ పూర్వ చరిత్రలో కొత్త విశేషాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. మధ్య ఆసియా నుంచి వలసలు..! గతంలో సిద్దిపేట సమీపంలోని పుల్లూరు శివారులో జరిపిన తవ్వకాల్లో లభించిన ఎముకల డీఎన్ఏలను సీసీఎంబీ విశ్లేషించి ఇటీవలే నివేదిక సమర్పించింది. ఆ డీఎన్ఏ మూలాలు ప్రస్తుత మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వ్యక్తుల డీఎన్ఏతో సరిపోలినట్టు తేల్చారు. అంటే మధ్య ఆసియా ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు తెలంగాణ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నట్టు దాని ఆధారంగా గుర్తించారు. కానీ ఇప్పుడు ఆ డీఎన్ఏ జాడ మళ్లీ ఇక్కడ గుర్తించలేదు. అంటే.. వలస వచ్చిన వారు తిరిగి వెళ్లిపోయారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా జరిపిన తవ్వకాల్లో అలాంటి వాటిని నివృత్తి చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తాజా తవ్వకాల్లో ఓ కుండలో మనిషికి సంబంధించి ఏమాత్రం చెక్కు చెదరని పుర్రె సహా ఇతర ప్రధాన ఎముకలు భద్రంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇన్ని అవశేషాలు ఎక్కడా దొరకలేదు. ఈ ఎముకల డీఎన్ఏలను తేల్చేందుకు త్వరలో సీసీఎంబీ రెండో విడత పరిశోధనలు ప్రారంభించనుంది. ఈ వస్తువులను గన్ఫౌండ్రిలోని పురావస్తు శాఖ సంచాలకుల కార్యాలయం ఆవరణలో ఉన్న శ్రీశైలం పెవిలియన్ మ్యూజియంలో వారం రోజుల పాటు ప్రజల సందర్శనకు ఉంచారు. గది.. అందులో మరో గది.. అవశేషాలు ఇక తవ్వకాల్లో వెలుగు చూసిన సమాధి నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉంది. తిరగేసిన స్వస్తిక్ ఆకృతిలో... గది, అందులో మరో గది నిర్మించి దానిలో అవశేషాలు భద్రపరిచి ఉన్నాయి. గతంలో ఈ తరహా నిర్మాణం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తొలిసారి కనుగొన్నారు. ‘ఓ మనిషికి చెందిన పూర్తి ఎముకల నిర్మాణం ఓ కుండలో భద్రంగా ఉంది. ఇప్పటి వరకు అలాంటి అవశేషాలు లభించలేదు. భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఎముకలతో చేసిన ఆభరణాలు కూడా తొలిసారిగా దొరికాయి’అని పురావస్తు శాఖ సంచాలకులు విశాలాచ్చి పేర్కొన్నారు.