breaking news
Nandyal division
-
నంద్యాల డివిజన్ అటవీ శాఖ స్థాయి పెంపు
కొత్త జిల్లాలవారీగా అటవీ శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చే నల్లమల అటవీ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు జిల్లా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో 1.90 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులతో వెలసిన నల్లమలో పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులు, దుప్పులు, కర్తెలు, అడవి కుక్కలు, ఇతర వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వాటిని అనుక్షణం కాపాడేందుకు అటవీ ప్రాంతం చుట్టూ పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆళ్లగడ్డ: బ్రిటీష్ కాలం నుంచి కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లుగా ఉండేవి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నంద్యాల జిల్లా అటవీ శాఖగా ప్రభుత్వం గుర్తించింది. ఇంతవరకు ఉన్న నంద్యాల డివిజన్ కార్యాలయాన్ని జిల్లా అటవీ కార్యాలయంగా మార్చారు. కర్నూలు డివిజన్ పరిధిలోని డోన్ అటవీ రేంజ్‌ను నంద్యాల జిల్లా పరిధిలో కలిపారు. కొత్తగా రెండు రేంజ్‌లు ఇప్పటి వరకు నంద్యాల పరిధిలో రుద్రవరం, చలిమ, నంద్యాల, బండిఆత్మకూరు, ఆత్మకూరు రేంజ్‌లు ఉండగా కర్నూలు డివిజన్ నుంచి డోన్ రేంజ్‌ను నంద్యాల జిల్లాలో చేర్చడంతో మొత్తం ఆరు రేంజ్‌లు అయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం పాణ్యం, బనగానపల్లె సెక్షన్లను అటవీ రేంజ్‌లుగా స్థాయి పెంచారు. దీంతో ఇప్పుడు జిల్లా పరిధిలో రేంజ్‌ల సంఖ్య 8 పెరిగింది. ఒకే పరిపాలన కిందకు టెరిటోరియల్, లాగింగ్ గతంలో టెరిటోరియల్ ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్ డివిజన్లు విడివిడిగా ఉండేవి. కొత్త డివిజన్లు చిన్నవి కావడంతో ఈ రెండింటిని కలిపి ఒకటిగా చేశారు. దీంతో రుద్రవరం, గాజులపల్లె, పచ్చర్ల లాగింగ్ డివిజన్లు రద్దయ్యాయి. డివిజన్ల పరిధి, కలప తగ్గడంతో వీటిని మూసివేశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దానికి పరిహారంగా అడవిని పెంచడానికి ఏర్పాటైన టీజీపీ డివిజన్‌ను కూడా రద్దు చేశారు. వైల్డ్‌లైఫ్ విభాగాలు ప్రత్యేకం వన్యప్రాణి విభాగం (వైల్డ్ లైఫ్) డివిజన్లను గతంలో మాదిరిగా ప్రత్యేకంగా ఉంచారు. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్డ్ పరిధిలోని కర్నూలు, ఆత్మకూరు, గిద్దలూరు, డివిజన్లను అలాగే ఉంచారు. వీటికి టెరిటోరియల్, వైల్డ్ లైఫ్ పరిధి రెండూ ఉంటాయి. నల్లమలలో 73 పెద్ద పులులు దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టులో 73 పెద్ద పులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2018లో 47, 2020లో 63 ఉన్న పులుల సంఖ్య ప్రస్తుతానికి 73కు పెరగడానికి అటవీ శాఖ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలే కారణం. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో గడ్డి పొదలు ఏర్పడి దుప్పులు, జింకలు పెరిగాయి. దీంతో పులులకు సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నల్లమల అటవీ 300 చిరుతలు, 400 ఎలుగుబంట్లు, వేల సంఖ్యలో జింకలు, దుప్పులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. పెరిగిన సిబ్బంది నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో సిబ్బంది సంఖ్య పెరిగింది. జిల్లా పరిధిలో కొత్తగా 9 సెక్షన్లు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు సెక్షన్ల సంఖ్య 25 పెరిగింది. 45 బేస్ క్యాంపులు ఉన్నాయి. 25 మంది సెక్షన్ అధికారులతో పాటు ఒక్కో బేస్ క్యాంపులో ఐదుగురు చొప్పున మొత్తం 225 మంది సిబ్బంది ఉన్నారు. పులులు, వన్యప్రాణుల సంఖ్య పెరగడంతో మరో 100 మందిని నియమించనున్నారు. పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి ఒకవైపు వన్యప్రాణులను, మరో వైపు విలువైన అటవీ సంపదను వేటగాళ్ల బారినుంచి కాపాడేందుకు పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. పెద్ద పులులు, చిరుతల సంరక్షణకు సుశిక్షితులైన సిబ్బందిని తయారు చేసేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందు కోసం సబ్ డీఎఫ్ఓ, రేంజర్, డీఆర్వో, బీట్ అఫీసర్ తదితర స్థాయిలో ఉన్న సుమారు 50 మంది అధికారులకు, సిబ్బందికి షార్ట్ వెపన్లు అయిన ఫిస్టల్, రివాల్వర్లు అందించనున్నారు. త్వరలో వీరికి తిరుపతి పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో గన్ షూటింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వీరిని పెద్దపులు, చిరుతలు సంచరించే బేస్‌క్యాంపుల్లో నియమించనున్నారు. పర్యవేక్షణ సులభం జిల్లా కేంద్రంలో నూతనంగా జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఏర్పాటు కావడంతో పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ భూముల అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షణ పెరుగుతుంది. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. – వినీత్‌కుమార్, జిల్లా అటవీ అధికారి అడవులతోనే సమృద్ధిగా వర్షాలు అడవులు విస్తారంగా పెరిగితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో మూడేళ్లుగా అడవులు విస్తారంగా పెరిగాయి. అందులో వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. – విశ్వనాథరెడ్డి, ఓబులంపల్లె అటవీ సంరక్షణ అందరి బాధ్యత అడవుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. అన్నిరకాల వృక్షాలు, వన్యప్రాణులు ఉంటేనే అడవులు అంతరించి పోకుండా ఉంటాయి. అడవులు అంతరించిపోకుండా ఉంటేనే పర్యావరణ సాధ్యమవుతుంది. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. – బోరు రమణ, చాగలమర్రి -
దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ
ఆదోని, న్యూస్‌లైన్ : బీజేపీతో టీడీపీ జట్టు కట్టడంతో తెలుగుతమ్ముళ్లపై ఆ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కర్నూలు, నంద్యాల డివిజన్లలో ఆదివారం ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదోని డివిజన్లో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదరడం.. ఈ రెండు పార్టీల తీరుపై మైనార్టీ ఓటర్లు భగ్గుమంటుండటంతో టీడీపీ శ్రేణులు డీలాపడ్డాయి. ఇదే సమయంలో మున్సిపల్, తొలి విడత ప్రాదేశిక పోరు ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుండటం టీడీపీ అభ్యర్థులను కలవరపరుస్తోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నాయి. డివిజన్లో మొత్తం 17 మండలాలు ఉండగా.. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, గుమ్మనూరు జయరాం, వై.బాలనాగిరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు.. అభివృద్ధితో పాటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరిస్తుండటంతో మంచి స్పందన లభిస్తోంది. ఆదోనిలో వై.సాయిప్రసాద్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్‌లు సోమవారం ఉదయం కడితోట, జి.హొసళ్లి, ఇస్వి గ్రామాల్లో.. సాయంత్రం బసాపురంలో ప్రచారం చేపట్టగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాంలు ఎమ్మెల్యే నీరజారెడ్డి స్వగ్రామం తెర్నేకల్లులో ప్రచారం చేపట్టగా విశేష స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీ మద్దతుతో బరిలో నిలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపును భుజానికెత్తుకున్న మంత్రాలయం నియోజకవర్గ సమన్వయకర్త సొంత మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజనకు కారణమైన బీజేపీతో టీడీపీ దోస్తీ చేయడం.. ఆ రెండు పార్టీలు ఇప్పటికీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఈ పార్టీల నాయకులు ఆశించిన స్థాయిలో దూసుకుపోలేకపోతున్నారు. నాయకుల మాటకు కట్టుబడి పోటీకి సిద్ధమైన అభ్యర్థులు ఇప్పుడు వారే ముఖం చాటేస్తుండటంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిలాఉండగా రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీ పోటీలో నామమాత్రమని ఇప్పటికే తేలిపోయింది. ఏదేమైనా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆపసోపాలు పడుతోంది. -
నేడే పోలింగ్
తొలివిడత ప్రాదేశిక సమరానికి సర్వం సిద్ధం కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం తొలి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 36 జెడ్పీటీసీ స్థానాలు, 496 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కర్నూలు డివిజన్లోని 19 జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది.. నంద్యాల డివిజన్లోని 17 జెడ్పీటీసీ స్థానాలకు 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండు డివిజన్లలోని 496 ఎంపీటీసీ స్థానాలకు 1,311 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 1,575 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,451 మంది సిబ్బంది ఎన్నికల విధులకు గాను శనివారం ఆయా గ్రామాలకు తరలివెళ్లారు.169 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 400 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 400 మంది సూక్ష్మ పరిశీలకులను కూడా నియమించారు. ఎన్నికలు జరుగుతున్న మండలాలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను తరలించారు. మండలాల్లోని ఆర్ఓ, ఏఆర్ఓలు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేసి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సూచనలు, సలహాలను మరోసారి వివరించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం సిబ్బంది తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేందుకు.. బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేశారు. కర్నూలు డివిజన్‌కు సంబంధించి 57 జోన్లు.. 111 రూట్లను ఏర్పాటు చేయగా.. 76 జీపులు, 118 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను వినియోగిస్తున్నారు. నంద్యాల డివిజన్లోని 49 జోన్లు, 94 రూట్లకు 67 జీపులు, 97 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేశారు.