breaking news
Namaphalakam
-
పరిషత్‌లో నామఫలకం రగడ
సాక్షి, బెంగళూరు : పరిషత్‌లో సోమవారం ‘నామఫలకం’ రగడ తీవ్ర గందరగోళానికి దారితీసింది. బెల్గాం జిల్లా యళ్లూరులో మరాఠీలో రాసిన ఓ నామఫలకాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తొలగించారు. అప్పటి నుంచి స్థానికులు, మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంపై సోమవారం పరిషత్ నామఫలకం రగడ రగులుకుంది. అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను నడపడం వీలుకాకపోవడంతో సభాపతి శంకరమూర్తి మూడు గంటలపాటు సభను వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన వెంటనే విపక్షనేత కే.ఎస్ ఈశ్వరప్ప యళ్లూరు ఘటనలో ప్రభుత్వ చర్యలు ఏమిటని నిలదీశారు. ఈ విషయలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలో తరుచూ శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఫ్లోర్‌లీడర్ బసవరాజ్‌హొరట్టి మాట్లాడుతూ...బెల్గాం జిల్లాల్లో కన్నడిగులకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ విషయంపై చర్చిద్దామని శంకరమూర్తి విపక్షాలకు సర్దిచెప్పడానికి యత్నించినా వారు వినిపించుకోలేదు. పరిషత్ నాయకుడు ఎస్.ఆర్ పాటిల్ జోక్యం చేసుకుని బెల్గాం జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, రాద్ధాంతం చే యొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. విపక్షాల తీరు వల్ల సభా కార్యక్రమాలకు తరుచూ ఆటంకం కలుగుతోందని అనటంతో సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో ఎవరూ ఏమీ మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సభాపతి సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తరువాత కూడా బీజేపీ నాయకులు వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ చర్చకు పట్టుబట్టారు. విపక్షాల నిరసనల మధ్యనే ముసాయిదా బిల్లులకు మండలి ఆమోదం లభించింది. -
కొనసాగుతున్న ఉద్రిక్తతలు
బెల్గాం జిల్లా యళ్లూరులో భారీ బందోబస్తు వ్యాపించిన ‘నామఫలకం’ రగడ సాక్షి, బెంగళూరు : నామఫలకం ఏర్పాటు విషయంపై బెల్గాం జిల్లా యళ్లూరులో ఏర్పడిన ఘర్షణలు సోమవారం చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించాయి. దీంతో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన యళ్లూరులో మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) ఏర్పాటు చేసిన ‘ఇది మహారాష్ట్ర ప్రాంతం’ అనే అర్థం వచ్చే నామఫలకాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తొలగించడంతో అక్కడ ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెల్సిందే. సోమవారం కూడా ఎంఈఎస్ కార్యకర్తలు కొంతమంది కర్ణాటక విరుద్ధంగా యళ్లూరుతో పాటు చుట్టుపక్కల ఉన్న దేసూరు, వడగాంవ, కిణై్మ, గుల్బగుంజి తదితర గ్రామాల్లో కరపత్రాలను పంచారు. ఈ కరపత్రాల్లో ‘బస్స్టేషన్లలో ఇది మహారాష్ట్ర అన్న నామఫలకాలను ఏర్పాటు చేద్దాం.. ఒకరికి మరొకరు ఎదురుపడ్డప్పుడు జై మహారాష్ట్ర అని పలకరించుకుందా.. వంటి నినాదాలు రాసి ఉన్న కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పోలీసులు అకారణంగా తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంఈఎస్ కార్యకర్తలు ఇచ్చిన బంద్‌కు సరైన స్పందన లభించలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా చేతుల్లో కర్రలను పట్టుకుని వీధుల్లో తిరుగుతున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధానసౌధ ముట్టడికి యత్నం బెల్గాం జిల్లాలో కన్నడిగులు, పాత్రికేయులపై ఎంఈఎస్ కార్యకర్తలు జరపుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ పలు కన్నడ సంరక్షణ సంఘాల కార్యకర్తలు విధానసౌధ ముట్టడికి సోమవారం ప్రయత్నించారు. ఈ సందర్భంగా కన్నడ చలువళి పార్టీ నాయకుడు వాటాళ్‌నాగరాజు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలపై అకారణంగా తరుచుగా దాడులు చేస్తూ శాంతిభద్రతల సమస్యలకు కారణమవుతున్న ఎంఈఎస్ కార్యకర్తలపై గూండాయాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విధానసౌధ ముట్టడికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత వదిలిపెట్టారు. పరిస్థితి అదుపులోకి : యళ్లూరుతోపాటు చుట్టపక్కల ఉన్న గ్రామాల్లో సోమవారం సాయంత్రానికి అన్ని ప్రాంతాలు అదపులోకి వచ్చాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియా ప్రకటనలో తెలిపారు.