కుప్పకూలిన భవనం ఇద్దరి మృతి
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో 50 ఏళ్ల క్రితం నిర్మించిన మూడంతస్తుల భవనం బుధవారం కుప్పకూలడంతో ఇద్దరు చనిపోయారు. సెంట్రల్ ఢిల్లీలోని సదర్ బజార్లో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. భవనం కూలినప్పుడు ఏదో ప్రకంపనం వచ్చినట్టుగా అనిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. శిథిలావస్థకు ఈ భవనం చేరుకుందని, స్థానికులను తరలించాలని కార్పొరేషన్ సిబ్బందికి తెలిపినా పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు.
‘ఈ భవనం తర్వాత ఓ ఇంటిని నిర్మిస్తున్నారు. ఆ ఇంటి పునాది కోసం భూమిని కాంట్రాక్టర్లు తవ్వారు. దీనివల్ల ఈ భవన పునాదిలో కదలిక వచ్చి కూలి ఉండొచ్చ’ని చెప్పారు. ఈ ప్రమాద సమయంలో నక్కి (60), ఆయన కుమారులు బంటీ (35), సల్మాన్ (28)లు భవనంలోనే ఉన్నారని తెలిపారు. బంటీ, సల్మాన్ భార్యలు ఏదో పనిమీద బయటకు వెళ్లడంతో వారికి ప్రాణాపాయం తప్పిందన్నారు. అయితే భవన శిథిలాల నుంచి బంటీ, సల్మాన్‌లను బయటకు తీసుకొచ్చిన సిబ్బంది సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించారు.
అయితే నక్కి అప్పటికే శిథిలాల కింద మరణించాడు. ఆస్పత్రికి తీసుకొచ్చిన తర్వాత బంటీ చికిత్స పొందుతూ మరణించాడు. సల్మాన్‌కు స్వల్ప గాయాలయ్యాయని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ వీకే సింగ్ తెలిపారు. సర్దార్ బజార్ మార్కెట్లో నక్కీ జ్యువెల్లరీ దుకాణం నడిపిస్తున్నాడు. ఈ శిథిలాల సహాయక చర్యల్లో ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ ప్రకృతి విపత్తు నిర్వహణ విభాగ అధికారులు పాల్గొన్నారు.