ఫిజియోథెరపీ కౌన్సెలింగ్
రెండు రోజుల క్రితం నేను మోటారు సైకిల్ కిక్ కొడుతుండగా కిక్రాడ్ వెనక్కి తన్నడంతో కాలి వెనక మడమపై భాగంలో తీవ్రంగా దెబ్బ తగిలింది. అది చాలా నొప్పిగా ఉంది. ఈ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?
- రాజు, చౌటుప్పల
ఇలాంటి దెబ్బ తగలగానే అది తగిలిన చోట ఐస్ పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది. దెబ్బ తగిలి ఇప్పటికే రెండు రోజులు అయ్యిందంటున్నారు కాబట్టి మీ కాలికి రెండు రకాల చికిత్స చేయవచ్చు. మొదటిది ఒక బకెట్లో కాస్త వేడి నీరు తీసుకొని నొప్పి ఉపశమించేలా కాలిని ముంచి పెట్టడం. ఇక రెండో పద్ధతిని కాంట్రాస్ట్ బాత్ ప్రక్రియ అంటారు. ఈ పద్ధతిలో ఒక వేడి నీళ్ల బకెట్నూ, మరో చల్లటి నీళ్ల బకెట్నూ తీసుకోవాలి. ఈ రెండు బకెట్లనూ పక్కపక్కనే పెట్టి వేడినీళ్ల బకెట్లో మూడు నిమిషాల పాటు కాలిని ఉంచి, ఆ వెంటనే తీసి చల్లటి నీళ్ల బకెట్లో ఒక నిమిషం సేపు ఉంచాలి. ఇలా (ఆల్టర్నేట్గా) బక్కెట్లను మారుస్తూ వేడినీటి బకెట్లో నాలుగుసార్లు (4 గీ 3 = 12 నిమిషాలు) చల్లటి నీళ్ల బక్కెట్లో మూడు సార్లు (3 గీ 1 = 3) మొత్తం 15 నిమిషాలు ఈ ప్రక్రియ కోసం వెచ్చిస్తే మీ నొప్పి తగ్గుతుంది.
నేను వీధిలో వెళ్తుండగా గల్లీ క్రికెట్ ఆడుతున్న పిల్లలు విసిరిన బంతి భుజానికి తగిలింది. దాంతో భుజం విపరీతంగా నొప్పిగా ఉంది. ఈ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?
- యాదగిరి, హైదరాబాద్
ఇప్పుడు మార్కెట్లో హాట్ ఫర్మెంటేషన్ కోసం వేడి నీళ్లు నింపే బ్యాగ్స్ లభ్యమవుతున్నాయి. వీటిని కొని ఆ బ్యాగ్లో వేడి నీరు నింపి 15 నిమిషాల పాటు కాపడం పెట్టాలి. ఈ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ ప్రక్రియ తర్వాత సున్నితంగా భుజాన్ని అన్నివైపులకూ తిప్పాలి. నొప్పిగా ఉంటే బలవంతంగా తిప్పకూడదు. నిద్రపోయే సమయంలో నొప్పిగా ఉన్న భుజం కింద తలగడ పెట్టుకోవాలి. ఒకవేళ దెబ్బ తగిలిన చోట ఎర్రబారడం, వాపు ఉంటే ఐస్ కాపడం పెట్టాలి.
ఎన్. మేరి,
ఫిజియోథెరపిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్