breaking news
Music director Sri
-
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి!
పాటతత్వం పాటంటే పెదాలపై ఆడేది మాత్రమే కాదు. చెప్పాలంటే... అదొక దారి దీపం. పాటలో ప్రతి పదం జీవనపథానికి దారి చూపే వెలుగు రేఖ అవుతుంది. ఈ వాస్తవాన్ని నేను స్వయంగా తెలుసుకున్నాను. ఒకరోజు సంగీత దర్శకుడు శ్రీ నాతో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారిలా మంచి పదాలు, వాక్యాలతో అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండేలా ఒక పాట రాయమని చెప్పారు. ఈ మాట వినగానే ‘నేనేంటి.. ఆయనలాగా పాట రాయడమేంటి?’ అని నన్ను నేనే ప్రశ్నించుకుని, నా వల్ల కాదంటూ వెళ్లిపోయాను. అంటే...యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించాను! అప్పుడు శ్రీ నా దగ్గరకు వచ్చి సిరివెన్నెల ‘పట్టుదల’ సినిమాలో రాసిన... ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి... విశ్రమించవద్దు ఏ క్షణం.. విస్మరించవద్దు నిర్ణయం... అప్పుడే నీ జయం నిశ్చయమ్మురా’ పాట వినిపించారు. ‘ప్రయత్నమన్నది చేయాలి... చేయకుంటే నీ ఓటమిని నువ్వే ఒప్పుకున్నట్లు’ అని చెప్పారు శ్రీ. ఈ పాట మళ్లీ మళ్లీ విన్నా. ఎక్కడికో దూరంగా వెళ్లిపోయిన ధైర్యం నాకు చాలా దగ్గరగా వచ్చింది. నాకు కొత్త శక్తిని ఇచ్చింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ‘త్రివిక్రమా పరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా’ అని నాలో నేను పాడుకున్నాను. నన్ను నేనే పదాలతో ఉత్తేజపరుచుకున్నాను. ఈ పాట ఇచ్చిన స్ఫూర్తితో, ధైర్యంతో ‘కోయిలమ్మ’ ఆల్బమ్‌లో మొత్త పాటలన్నీ నేనే రాశాను. ‘‘చాలా బాగా రాశావు’’ అని శ్రీ మెచ్చుకున్నారు. ‘నేను చేయలేనేమో’ అనుకున్నప్పుడల్లా నిరాశ ముందుకు వచ్చి ‘నీలో ఉన్నదంతా ఆశక్తతే’ అని ఢంకా బజాయించి చెబుతుంది. నిజమే...అనుకుంటే అది శిలాశాసనమై పోతుంది. మనలోని బలాలన్నీ ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి బలహీనతలే కళ్ల ముందు కదలాడుతాయి. ‘అసలు నేను ఎంతటి వాడిని? నా దగ్గర ఏముంది?’ అనే అంతర్మథనం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక్కసారి... ‘వేగముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా... ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్ష కన్నా సారథెవరురా... నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా’ ‘నా దగ్గర ఏముంది? నాకు అండగా ఎవరు ఉన్నారు?’ అనుకునే వాళ్లకు ఈ చరణాలే సమాధానం చెబుతాయి. సాధించాలనే తపన, పట్టుదల ఉంటే శరీరమే శతకోటి సైనికుల బలమవుతుంది! శ్వాస శస్త్రమైనట్లు! ఆశకు దగ్గరైతేనే కదా నిరాశ అనేది పారిపోయేది. నిరాశ చెందడం విశేషం కాదు...నిరాశనే నిరాశ చెందేలా చేయడమే విశేషం. దీనికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అక్కర్లేదు. అంత కంటే గొప్ప శక్తి... నెత్తురులో సత్తువ. ఆశ అనే అస్త్రం. ప్రతి దాన్ని పోల్చి చూసుకోవడం, ఫలితాల గురించి అతిగా ఆలోచించడం అనేది పైకి ‘విశ్లేషణ’లా కనిపించినా...ఒక విధంగా చెప్పాలంటే...ఇది నిరాశను నింపుతుంది. పిడికిలి బిగించి ముందుకు కదలడం కంటే, తేలిగ్గా చేతులెత్తేయడం క్షేమం అనిపిస్తుంది. ఆకాశం అంత పెద్దదని గువ్వ పిల్ల ఎగరకుండా ఉంటుందా? అంత పెద్ద ఆకాశమైనా దాని రెక్క ముందు తక్కువే కదా! ఎంత పెద్ద సముద్రమైనా ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదే కదా!! అందుకే... ‘పిడుగు వంటి పిడికిలెత్తి.... ఉరుము వలె హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా...ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి...అవధులన్నీ అధిగమించరా’ ‘ప్రతి మనిషిలో దృక్పథాలుంటాయి. అయితే, వాటిలో తేడాలుంటాయంతే.. మనుషులందరిలో ఉండే ముఖ్యమైన దృక్పథాల్లో ఆశావహ దృక్పథం చాలా ముఖ్యమైంది. ఇది లేనివారంటూ ఉండరు. ఇది ఉండాలి కూడా. జీవితం అనేది ప్రతిక్షణం పోరాటమే’ అంటారు సిరివెన్నెల సీతారామశాస్త్రి్త్ర. ఆయన చెప్పిన భావం అక్షరాల ఈ పాటలో కనిపిస్తుంది. ఆరోజు నుంచి ఈరోజు వరకూ ఎప్పుడైనా ‘నేను ఓడిపోతున్నాను’ అనిపించినప్పుడల్లా నాకు ఈ పాట గుర్తుకొస్తుంది. దాంతో మళ్లీ కొత్త ఉత్సాహంతో పనిచేస్తాను. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ... నాకు ఆ పాటే ప్రేరణ. సంభాషణ: డేరంగుల జగన్మోహన్ - వసంత్, సంగీత దర్శకుడు -
సంగీత దర్శకుడు శ్రీ కన్నుమూత
-
'శ్రీ'కి స్వరనీరాజనం
-
'జగమంత కుటుంబం' పాటను ’శ్రీ’నే పాడారు.
-
అణిముత్యాలాంటి పాటలకు మ్యూజిక్
-
సంగీత దర్శకుడు శ్రీ కన్నుమూత
-
సంగీత దర్శకుడు శ్రీ కన్నుమూత
హైదరాబాద్: సంగీత దర్శకుడు శ్రీ ఈ సాయంత్రం కొండాపూర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తి కుమారుడైన శ్రీ అసలు పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన శ్రీ గత కొద్ది కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీ పోలీస్ బ్రదర్స్, గాయం, సింధూరం, అనగనగా ఒక రోజు, ఆడుమగాడ్రా బుజ్జీ, అమ్మోరు, మనీ, నీకే మనసిచ్చా, ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, కాశీ, సాహసం తదితర 20 చిత్రాలకు సంగీతం అందించారు. రామ్ గోపాల్ వర్మ, కృష్ణ వంశీలతో ఆయన ఎక్కువ చిత్రాలకు పని చేశారు. శ్రీ కేవలం సంగీత దర్శకుడే కాదు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. 2005లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందిన చక్రం చిత్రంలోని 'జగమంత కుటుంబం' పాటను ఆయనే పాడారు. ఆయన స్వరాలు అందించిన చివరి చిత్రం 'అప్పూ..ది క్రేజీ బోయ్' ఇది బాలల చిత్రం. ఇది విడుదల కావలసి ఉంది. శ్రీకి భార్య అరుణ, కుమారుడు రాజేష్ చక్రవర్తి ఉన్నారు. -
ఇండస్ట్రీ నన్ను అర్థం చేసుకోలేదు! - శ్రీ
ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ కొన్నేళ్ళ క్రితం మాట్లాడుతూ, తన జీవిత విశేషాలనూ, సినీ ప్రస్థానాన్నీ పంచుకున్నారు. అప్పటి ఆ అముద్రిత ఇంటర్వ్యూ నుంచి.. కొన్ని ముచ్చట్లు ఆయన మాటల్లోనే... ♦ నేను పుట్టింది 1966 సెప్టెంబర్ 13న. మేం మొత్తం నలుగురు అన్నదమ్ములం. నేను రెండోవాణ్ణి. మాకో చెల్లెలు కూడా ఉంది. కర్ణాటకలోని మణిపాల్‌లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఇంజనీరింగ్ చదివాను. ♦ నా భార్య పేరు అరుణ. తనది మా పక్క ఇల్లే. పదో తరగతి నుంచే ఆమెను ప్రేమించాను. ఇంజినీరింగ్ వరకూ ఈ ప్రేమ కంటిన్యూ అయ్యింది. కులాలు వేరు కావడంతో మా పెళ్లికి నాన్న ఒప్పుకోలేదు. దాంతో ఇంట్లోంచి వచ్చేసి పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టాను. ఇంజినీర్ డిగ్రీతో ఓ కంపెనీలో సేల్స్ రిప్రజెంటెటివ్‌గా చేశా. ఈలోగా పెద్దన్నయ్య చనిపోయాడు. దాంతో ఇంటికొచ్చేశాను. తర్వాత మా చెల్లెకి ఉబ్బసం వచ్చింది. అరుణ చాలా సేవలు చేసింది. దాంతో నాన్న మనసు కరిగింది. అప్పటి నుంచీ మా ప్రేమను అంగీకరించారు. ♦1989లో నాన్న దగ్గర అసిస్టెంట్‌గా చేరా. రోజుకు 50 రూపాయలు పారితోషికం. నాన్న మాత్రం ‘‘నేనే సినిమా ఫీల్డ్‌కొచ్చి తప్పు చేశాననుకుంటే, నువ్వెందుకురా ఇక్కడకు’’ అనేవారు. తొలిసారిగా బాలకృష్ణ ‘లారీ డ్రైవర్’ సినిమాకు నన్నే రీ-రికార్డింగ్ చేయమన్నారు నాన్న. అవుట్‌పుట్ చూసి నాన్న నాకు మంచి పారితోషికం ఇచ్చారు. ఆ ఎమౌంట్ చూసి నేను షాకయ్యా. నేను ఇంత సంపాదించగలనా? అనిపించింది. తొలి సినిమా అవకాశం ♦ నాన్న దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలోనే దర్శకుడు మోహన్‌గాంధీ నన్ను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తానన్నారు. నేను ఒప్పుకోలేదు. కొన్నాళ్ల తర్వాత ఆయనే రెండోసారి కూడా ఆఫర్ ఇచ్చారు. అలా ‘పోలీస్ బ్రదర్స్’తో నా ప్రస్థానం మొదలైంది. ♦ ‘పోలీస్ బ్రదర్స్’కి నేను చేసిన పాటల గురించి రామ్‌గోపాల్‌వర్మ విన్నారు. అప్పుడాయన ‘అంతం’ సినిమా చేస్తున్నారు. ఓ రీలు వేసి రీ-రికార్డింగ్ చేసి చూపించమన్నారు. నేను వెంటనే చేసేశాను. అది ఆయనకు నచ్చేసింది. అలా ఆయన నెక్ట్స్ సినిమా ‘గాయం’కు అవకాశం వచ్చింది. ♦ ‘గాయం’ మ్యూజిక్ విని మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కూడా మెచ్చుకున్నారు. అదే టైమ్‌లో ‘రోజా’ రీ-రికార్డింగ్ జరుగుతోంది. నేను ‘గాయం’కు నాలుగు రోజుల్లో రీ-రికార్డింగ్ చేశానని తెలిసి ఏఆర్ రెహమాన్ ముగ్ధుడైపోయారు. ‘అలుపన్నది ఉందా..’ పాట విని మణిరత్నం ‘‘వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్’’ అని మెచ్చుకున్నారు. ♦ చాలామంది ‘మనీ’కి నేనే సంగీత దర్శకుణ్ణనుకుంటారు. శ్రీనివాసమూర్తి దానికి మ్యూజిక్ చేసింది. ‘మనీ... మనీ’కి మాత్రం నేను చేశాను. నిజానికి, ‘మనీ’కి మొదట నేనే సంగీత దర్శకుణ్ణి. వర్మ, అప్పటికే శ్రీనివాసమూర్తికి హామీ ఇవ్వడంతో తప్పుకున్నా. కానీ సూపర్వైజింగ్ నేనే చేశా. ♦ ‘అనగనగా ఒక రోజు’లో సూపర్‌హిట్టయిన ‘ఓ చెలీ క్షమించమన్నానుగా...’ పాటకి నాలుగు రోజులు తీసుకున్నా. దాంతో వర్మ నన్ను తీసేసి వేరేవాళ్లను పెట్టాలనుకున్నారు. ‘రంగీలా’ కోసం ‘తన్హా...’ పాట తీస్తుంటే నేను వెళ్లి కలిశా. కావాలనే మొదట ఓ చెత్త ట్యూన్ వినిపించా. రెండోది కూడా ఓ మోస్తరుదే వినిపించా. ఫైనల్‌గా నేను ఓకే అనుకున్నది వినిపించా. వర్మ వెంటనే ‘సూపర్బ్’ అన్నారు. హీరోగా అవకాశం వచ్చినా... వద్దన్నా..! ♦ ‘సిందూరం’ సినిమా వర్క్ జరుగుతున్న సమయంలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఫోన్ చేసి వెంటనే దర్శకుడు రవిరాజా పినిశెట్టిని కలవమని చెప్పారు. నేను వెళ్లి కలిశాను. ‘అంత్యాక్షరి’ ప్రోగ్రామ్ యాంకరింగ్ చూసి, ఆయనకు నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలన్న ఆలోచన వచ్చిందట. అందుకే పిలిపించారు. ‘‘మ్యూజిక్ అయితే చేస్తాను, యాక్టింగ్ నా వల్ల కాదు’’ అని చెప్పేశాను. దాంతో నన్ను మ్యూజిక్ డెరైక్టర్‌గా తీసుకున్నారు. ఆ సినిమాకు నేను చేసిన మూడు పాటలు ఓకే చేశారు. ఆ తర్వాత ‘సిందూరం’ కోసం రంపచోడవరం వెళ్లి 15 రోజులు ఉండిపోయా. అదే సమయంలో రవిరాజా రాజమండ్రి వచ్చి ఫోన్ చేశారు. నేను కలవలేకపోయా. కట్ చేస్తే... వినీత్ హీరోగా రవిరాజా ఓ సినిమా అనౌన్స్ చేశారు. దానికి నేను మ్యూజిక్ డెరైక్టర్‌ను కాదు. విద్యాసాగర్‌ని పెట్టుకున్నారు అదే ‘రుక్మిణి’. ♦ ‘అమ్మోరు’కి నేనే సంగీత దర్శకుణ్ణి. నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి నా మీద విపరీతమైన నమ్మకం. అందుకే పాటలు నాన్న చేస్తే, నేను రీ-రికార్డింగ్ చేశా. జాతరలో డప్పులు వాయించేవాళ్లని రాజమండ్రి నుంచి 15 మందిని పిలిపించి, ప్రయోగం చేశా. చిరంజీవి ‘అంజి’ చిత్రానికి ఒక పాట స్వరపరిచా.రమేశ్ అరవింద్ (లిటిల్ సోల్జర్స్), ఆకాశ్ (ఆనందం), సాయిరామ్ శంకర్ (143)లకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గాత్రం అందించా. అమ్మతోనే పోయిన... జీవితం ♦ అమ్మా నాన్నలకు నేనంటే ప్రాణం. నాన్న ఎప్పుడూ బయటపడేవారు కాదు. నాన్నా, నేను ఎక్కువ మాట్లాడుకునేవాళ్లం కూడా కాదు. నాపై నాన్న ముద్ర లేదు. నాకంటూ ప్రత్యేక మార్గం ఎంచుకున్నా. నా పాటలపై నా సంతకమే ఉంటుంది. నేను చక్రవర్తి సంగీతాన్ని నిలబెట్టలేకపోయుండొచ్చు కానీ, ఆయన పేరు మాత్రం ఎప్పుడూ చెడగొట్టలేదు. ♦ నాకు మా అమ్మంటే చాలా స్పెషల్. నాన్న బిజీగా ఉండటంతో అన్నీ అమ్మతోనే షేర్ చేసుకునేవాణ్ణి. తిట్టినా, కొట్టినా, లాలించినా అన్నీ అమ్మే. నా ప్రాణానికి ప్రాణం పోయింది. దాంతో మూర్ఖుడిలా బిహేవ్ చేశా. అమ్మ పోయాక... ఆరు నెలలు నేను భోజనం కూడా మానేశా. ♦1998 జూలైలో అమ్మ చనిపోయింది. అప్పటినుంచీ నా మనసు మనసులో లేదు. నా ప్రవర్తన, మాట తీరు, అప్రోచ్ అన్నీ మారిపోయాయి. ఎవర్నీ లెక్క చేసేవాణ్ణి కాదు. నాలో నిర్లక్ష్యం చూసి అందరూ ‘వీడు... ఇలా తయారవుతున్నాడేంటి?’ అని జాలిపడేవారు, బాధపడేవారు. పెద్ద పెద్దవాళ్లు వచ్చి పద్ధతి మార్చుకోమన్నా కూడా నేను పట్టించుకోలేదు. ‘శ్రీకి మెంటల్’ అని, డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడని కొంతమంది పుకార్లు పుట్టించారు. నేను పాపులర్ కాబట్టే అలా మాట్లాడుకుంటున్నారనుకుని క్రేజీగా ఫీలయ్యేవాణ్ణి. ♦ తర్వాతర్వాత నాక్కూడా వాస్తవం తెలిసొచ్చింది. నేనిలా ఉండడం వల్ల అమ్మ పేరు చెడగొడుతున్నానని అర్థమైంది. నేను మంచి స్థాయికి వెళ్లి, అమ్మ పేరు నిలబెట్టాలని నిశ్చయించుకున్నా. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అంతా నా స్వయంకృతాపరాధమే. నా జీవితానికి నేనే ద్రోహం చేసుకున్నా. నా కేరెక్టర్ని ఇండస్ట్రీనే అర్థం చేసుకోలేకపోయింది. - పులగం చిన్నారాయణ