breaking news
Munnabhai SSC
-
మున్నాభాయ్ ఎస్సెస్సీ!
మున్నాభాయ్ ఎంబీబీయస్ సినిమాలో ఒక డైలాగు... ‘లైఫ్‌లో తక్కువ టైమ్ ఉంటే, డబుల్ డబుల్ జీవించు’ అని.సినిమాలోని మున్నాభాయ్‌కి డబుల్ జీవించడం అంటే జీవితాన్ని ఎంజాయ్ చేయడం కావచ్చునేమోగానీ... ముంబై మున్నాభాయ్‌కి మాత్రం ‘పరులకు సేవ చేయడం’. సేవలో వారం రోజులు జీవించినా సరే... సంవత్సరానికి సరిపడేంత తృప్తి దొరుకుతుంది కదా! ఓ సాధారణ ఆటోడ్రైవర్ అయిన సందీప్‌ను కింగ్ ఆఫ్ బాంద్రా, మున్నాభాయ్ ఎస్.ఎస్.సి. అని అందరూ పిలుచుకోవడానికి ఆయనలోని సేవాగుణమే కారణం. సందీప్ ఆటో చాలా స్పెషల్. అందులో టెలిఫోన్, వైఫై కనెక్షన్, న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్లు, ఎల్సీడీ స్క్రీన్, మంచినీళ్లు, టీ మొదలైనవన్నీ ఉంటాయి. అతని ఆటో కంటే సందీప్ ఇంకా ప్రత్యేకం. సందీప్ తల్లి క్యాన్సర్‌తో మరణించారు. ఆ బాధలో నుంచి బయటపడడానికి అతనికి చాలా కాలమే పట్టింది. పేద క్యాన్సర్ పేషెంట్లను చూసినప్పుడల్లా అతనికి తన తల్లే గుర్తుకు వచ్చేది. తల్లికి గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు చికిత్సకు అవసరమైన డబ్బులను సమకూర్చు కోవడానికి పడ్డ కష్టాలన్నీ కంటి ముందు కదలాడేవి. తనలాంటి పరిస్థితి ఎవరికీ ఎదురు కాకూడదనే సంకల్పంతో పేద క్యాన్సర్ పేషెంట్ల కోసం తన ఆటోలో ‘డొనేషన్ బాక్స్’ ఏర్పాటు చేశాడు. ఈ బాక్స్‌లోని మొత్తానికి రోజూ తన వంతుగా కొంత డబ్బును జమ చేయడం మొదలుపెట్టాడు. ఈ మొత్తాన్ని ప్రతినెలా టాటా మెమోరియల్ వంటి పలు హాస్పిటల్స్‌లోని పేద రోగులకు ఇచ్చేవాడు. ఆర్థిక సహాయం చేయడం మాత్రమే కాదు... పేషెంట్లకు ధైర్యం చెప్పి నవ్వించడం, భోజనం తినిపించడం, దుస్తులు కొనిపెట్టడం వంటి ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు సందీప్. ఆదివారం అందరూ విశ్రాంతి తీసుకుంటారు. కానీ సందీప్ చాలా బిజీగా ఉంటాడు. ఉదయం పేద రోగులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తాడు. తర్వాత ఇంటింటికీ వెళ్లి దుస్తులు, దుప్పట్లు సేకరించి పేదలకు పంచుతాడు.సందీప్ ఆటోలో ఎప్పుడూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. దారిలో వెళుతున్నప్పుడు గాయపడినవారు కనిపిస్తే వారికి ప్రాథమిక చికిత్స చేసి, దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకువెళతాడు. ఓ యువతికి రెండు కిడ్నీలూ పాడైపో యాయి. చికిత్సకు అవసరమైన ఆర్థికసాయాన్ని ఒక ట్రస్ట్ అందించినప్పటికీ, ఇంకా రూ. 35,000 వరకు అవసరమైంది. ఇది తెలుసుకున్న సందీప్ అక్కడా ఇక్కడా అడిగి సమకూర్చాడు. సందీప్ చేసిన సహాయాల్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.సందీప్ మంచితనం గురించి ఆ నోటా ఈ నోటా విన్నవాళ్లు కూడా తమవంతుగా చేయూత ఇస్తున్నారు. కష్టంలో ఉన్నవారికి సందీప్ ఫోన్ నంబర్ ఇవ్వడం మామూలైపోయింది. సందీప్ ఆటోపై - ‘ఎనీ ప్రాబ్లం, కాల్ మున్నాభాయ్ ఎస్.ఎస్.సి.’ అని రాసి ఉంటుంది. తన ఆటోలో ప్రయాణించే వికలాం గులు, గర్భిణి స్త్రీలు, వృద్ధులకు డిస్కౌంట్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద లను ఉచితంగానే తన ఆటోలో తీసుకువెళతాడు. తన సేవకు ట్విట్టర్, ఫేస్బుక్ వంటి మాధ్యమా లను కూడా ఉపయోగిస్తున్నాడు సందీప్. ‘‘ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి. నువ్వేమో వచ్చిన డబ్బును వచ్చినట్లే ఖర్చు చేస్తున్నావు. రేపటి గురించి ఆలోచించు’’ అని బంధువులు ఎప్పుడూ చెబుతుంటారు. ‘‘రేపటి గురించి మాత్రమే ఆలోచిస్తే ఈరోజు జీవించలేము’’ అంటాడు సందీప్. ఆయనకు జీవితం అంటే ‘పొదుపు’, ‘లగ్జరీ’ కాదు. ఎంతమందికి మేలు చేయగలిగామన్నదే జీవితం! పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగమేదో చేయాలనుకున్న సందీప్ పేదరికం కారణంగా పదవతరగతి వరకు మాత్రమే చదువుకో గలిగాడు. ‘‘పెద్ద చదువులు చదువుకోక పోతేనేం... నీది పెద్దమనసు’’ అనిపించుకునేలా ఎదిగాడు. ‘‘ఆటోడ్రైవింగ్ అనేది నా వృత్తి మాత్రమే కాదు... సేవ చేయడానికి ఒక మార్గం కూడా’’ అంటున్న సందీప్ భవిష్యత్‌లో తన సేవలను మరింత విస్తరించాలనుకుంటున్నాడు. ‘‘నా పెదవుల మీద నవ్వు కనిపించిందంటే, నా మనసులోని కోరిక నెరవేరనుందన్నమాట!’’ అనేది సందీప్ డైలాగ్. అదిగో... సందీప్ నవ్వుతున్నట్లుగానే ఉంది! - యాకూబ్ పాషా -
దటీజ్ మున్నాభాయ్ ఎస్సెస్సీ
ముంబై: సందీప్ బచ్చే. అలియాస్ మున్నాభాయ్ ఎస్సెస్సీ. ఆటోరిక్షా ఓనర్ కమ్ డ్రైవర్. ఆయన ఆటోరిక్షాలో టెలిఫోన్, వైఫై, ఎల్సీడీ స్క్రీన్, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్ స్టాండ్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరం తదితర సౌకర్యాలన్నీ ఉన్నాయి. అంతేకాదు, తన ఆటో ఎక్కేవారికి చల్లటి మంచినీళ్లు ఇవ్వడానికి వాటర్ బాటిళ్లు, వేడి వేడి ఛాయ్ సర్వ్ చేయడానికి ఫ్లాస్క్ ఉన్నాయి. ఆయన చొక్కాపై సందీప్ బచ్చే, మున్నాభాయ్ ఎస్సీస్సీ అనే నేమ్ ప్లేటు, ఆటో వెనకాల సెవెన్ స్టార్ సౌకర్యాలను సూచించే స్టిక్కర్ ఉంటాయి. ముంబైలో అతను కూల్ ఆటోడ్రైవర్‌గా సుపరిచితుడు. అంతకన్నా బంగారం లాంటి మనసున్న మనిషి. కేన్సర్ రోగుల చికిత్సకు రెగ్యులర్‌గా విరాళాలిస్తాడు. పండ్లు, ఫలహారాలు పంచుతాడు. వారికి అవసరమైన దుస్తులు పంపిణీ చేస్తాడు. అందుకోసం విరాళాలు సేకరించేందుకు తన ఆటో వెనకాల ఓ హుండీని ఏర్పాటు చేశాడు. తన ప్రతి ట్రిప్పులో ప్రయాణికుల నుంచి వచ్చే చార్జీలో తనవంతుగా రెండు రూపాయలను తీసి హుండీలో వేస్తాడు. ప్రయాణికుల విరాళాలను వారి చిత్తానికే వదిలేస్తాడు. అలా వచ్చిన సొమ్మును నెలకోసారి వెళ్లి ముంబైలోని టాటా మెమోరియల్ హోస్పిటల్కు, మౌంట్ మేరీ చర్చికి అందజేస్తాడు. ప్రతి ఆదివారం వివిధ ఆస్పత్రుల్లోని కేన్సర్, కిడ్నీ రోగులకు పండ్లు, ఫలహారాలు, దుస్తులు పంచుతూ కనిపిస్తాడు. ఆదివారం ఉదయం నుంచే రోగుల కోసం ఇంటింటికెళ్లి దుస్తులు సేకరిస్తాడు. తన తల్లి కేన్సర్ తో చనిపోవడంతో వేరెవరూ ఇలా ఇబ్బంది పడకూడదని ఇదంతా చేస్తున్నాడు. అంతేకాకుండా రోడ్డుపై తాను ఆటో నడుపుతుండగా కనిపించిన ప్రతి యాక్సిడెంట్ సీన్ వద్దకు వెళతాడు. ఆ యాక్సిడెంట్లో గాయపడ్డవాళ్లకు తన వద్దనున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అవసరమైన ప్రాథమిక చికిత్స చేస్తాడు. ఆ సమయంలో తన ఆటోలో ఎవరైనా ప్రయాణికులుంటే వారు చికాకు పడకుండా వేడివేడి ఛాయ్‌తో వాళ్లను కూల్ చేస్తాడు. దటీజ్ మున్నాభాయ్ ఎస్సెస్సీ.