breaking news
Mumbai Residents
-
ముంబై డాబాలపై సామూహిక ఇంటిపంటలు!
నగరాల్లో విస్తరిస్తున్న ఇంటిపంటల సంస్కృతి కొత్త పోకడలను సంతరించుకుంటోంది. ఇంటి పంటల సాగులో ముంబైవాసులు మరో అడుగు ముందుకేశారు. ఎవరింటిపై వారే సేంద్రియ ఇంటిపంటలను సాగు చేసే ధోరణికి భిన్నంగా.. ముంబై వాసులు తోటి వారితో కలిసి సామూహిక ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. ముంబైలోని అర్బన్ లీవ్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ నగరంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, సేవా సంస్థల భవనాలపైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొందరు ఔత్సాహికులు మాతుంగాలోని డాన్‌బాస్కో స్కూల్ భవనంపై గత రెండేళ్లుగా సామూహికంగా ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలు, ఔషధ మూలికలను సాగు చేస్తున్నారు. ప్రతి ఆదివారం సామూహిక ఇంటిపంటల క్షేత్రాల్లో అందరూ కూడి పనులు చేస్తారు. పిల్లలు, పెద్దలు వారాంతపు సెలవును ప్రకృతితో మమేకం అయ్యేందుకు ఉపయోగిస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో ఇంటిపంటలకు అవసరమైన సేంద్రియ ఎరువు అమృత్‌మట్టిని భవనాలపైన మడుల్లోనే తయారు చేసుకుంటారు. ఆ తర్వాత అదే మడుల్లో నవధాన్యాలతో పచ్చిరొట్ట పెంచి.. మొక్కలను కత్తిరించి తిరిగి మట్టిలో కలిపేస్తారు. తదనంతరం పంటల సాగు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో చెరకు పిప్పిని విరివిగా వినియోగిస్తారు. ఇటుకలను అందమైన వివిధ ఆకృతుల్లో పేర్చి సమృద్ధంగా ఇంటిపంటలు పండిస్తారు. కేవలం కూరగాయలు, పండ్ల సాగు కోసమే కాక.. సామూహిక ఇంటిపంటలు పక్షులకూ ఆవాసాన్ని కల్పిస్తుండటం విశేషం. సామూహిక ఇంటిపంటల సాగు ద్వారా రసాయన రహిత ఆహారాన్ని పండిస్తున్న అర్బన్ లీవ్స్ ఇండియా బృందం ముంబైని ఇతర నగరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది. -
పేలుళ్లతో మూడొంతులమేర మునిగిన ఐఎన్ఎస్ సింధురక్షక్
ముంబైలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో జరిగిన మూడు పేలుళ్లు అనంతరం సంభవించిన భారీ అగ్నిప్రమాదం ముంబై వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొంతసేపటివరకు ఏం జరిగిందో ఎవరికీ అంతుబట్టలేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అయితే ఉగ్రవాదుల దాడులపై ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఒకవైపు హెచ్చరికలు, స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఈ సంఘటన జరగడం నగరవాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక విద్రోహ చర్యా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయంలో ఉన్న నావల్ డాక్‌యార్డ్‌లో ఈ ఘటన జరగడం అందరిని నిశ్చేష్ఠులను చేసింది. విచారణకు ఆదేశించాం నౌకాదళానికి చెందిన జలాంతర్గామి అగ్నిప్రమాదంలో ముగ్గురు అధికారులతోపాటు మొత్తం 18 మంది మృతి చెందినట్లు అడ్మిరల్ డీకే జోషీ తెలిపారు. ప్రమాదానికి కారణాలేమిటనేది తెలియరాలేదని, విచారణకు ఆదేశించామని చెప్పారు. జలాంతర్గామిలో ఉన్న పేలుడు పదార్థాలు, ఇంధనం, ఆక్సిజన్ సిలిండర్ల వల్ల ఈ పేలుళ్లు సంభవించి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరమ్మతులే కారణమా... ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిని మరమ్మతుల కోసం 2010లో రష్యా పంపించారు. ఆ దేశానికి చెందిన ‘జ్వోదోచ్కా’ అనే కంపెనీ మరమ్మతులు చేపట్టి 2013 జనవరిలో తిరిగి భారత్‌కు అప్పగించింది. నిర్దేశిత లక్ష్యానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సింధురక్షక్లో ఆయుధ సామగ్రి భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. క్షిపణులు, నౌక విధ్వంసక శక్షిపణులు భారీ స్థాయిలో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరమ్మతుల అనం తరం మన దేశానికి వచ్చిన ఈ జలాంతర్గామిని అన్ని విధాలా పరీక్షించారు. సాంకేతికంగా ఎలాంటి దోషాలు లేవని స్పష్టం చేసుకున్నారు. అయితే ఈ సంఘటన అనంతరం మరమ్మతుల సమయంలో ఏవైనా లోపాలు ఏర్పడ్డాయా..? అలాంటి లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా... సింధురక్షక్ జలాంతర్గామి గతంలో కూడా ప్రమాదానికి గురైంది. విశాఖపట్టణంలో ఉండగా 2010లో అగ్నిప్రమాదం సంభవించింది. అప్పుడు నౌకదళానికి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. కాగా, 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం అనంతరం జరిగిన పెద్ద ప్రమాదం ఇదేనని చెబుతున్నారు. ‘ప్రకటన చేయాల్సిందే’ న్యూఢిల్లీ: ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గమిలో జరిగిన పేలుడు, అగ్నిప్రమాదంపై ప్రతిపక్ష బీజేపీ, శివసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై రాజ్యసభలో సర్కార్ నుంచి ప్రకటన చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ వెంటనే ప్రకటన చేయాలని, లేకపోతే గురువారం సభ కార్యకలాపాలు జరగనివ్వమని బీజేపీ సభ్యుడు చందన్ మిత్రా అన్నారు. అయితే ముంబైలో ఉన్న ఆంటోని తిరిగి వచ్చిన వెంటనే ప్రకటన చేయిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లా హామీ ఇచ్చారు.