breaking news
Mumbai - Pune
-
ఘనంగా ‘క్వీన్’ జన్మదినోత్సవం
సాక్షి, ముంబై: పర్యాటకులు ఎంతగానో ఇష్టపడే ముంబై-పుణే ‘డెక్కన్ క్వీన్’ రైలు 85వ పుట్టిన రోజు వేడుకలను శనివారం ఘనంగా నిృ్వహించారు. ప్రయాణికులు ఏటా క్రమం తప్పకుండా ఈ రైలుకు జన్మదినోత్సవం నిర్వహించడంవల్ల డెక్కన్క్వీన్కు ఆదరణ పెరుగుతూనే ఉంది. దీని పుట్టిన రోజు సందర్భంగా బోగీలను రంగురంగుల కాగితాలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. శనివారం ఈ రైలు విధులు నిర్వహించిన మోటార్‌మన్ (డ్రైవర్) గార్డుకు పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల వ్యయాన్ని రైలులో శనివారం రాకపోకలు సాగించిన ఉద్యోగులే భరించారు. 1930 నుంచీ సేవలు.. బ్రిటిష్‌పాలనలో ముంబై-పుణే నగరాల మధ్య మొట్టమొదటిసారిగా 1930 జూన్ ఒకటిన డెక్కన్ క్వీన్ అనే పేరుతో ఈ రైలును ప్రారంభించారు. అప్పట్లో బ్రిటిష్ రాణులు, వారి బంధువులు ఇందులో రాకపోకలు సాగించేవారిని చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా ఈ రెండు నగరాల మధ్య ఉద్యోగులు, వ్యాపారుల రాకపోకలు పెరిగిపోవడంతో అందరూ ఈ రైలునే ఆశ్రయించడం మొదలయింది. అతి తక్కువ సమయంలోనే దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలకు ఈ రైలు అనువుగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఉదయం ముంబైకి రావడం, సాయంత్రం పుణేకు ఇది తిరుగు ప్రయాణ మవుతుంది. ఇందులో తరచూ ప్రయాణించే వాళ్లంతా కుటుంబ సభ్యుల్లా కలసిమెలసి ఉంటారు. పుణే-ముంబై మధ్య ప్రత్యేకంగా ప్రతీరోజు డెక్కన్ క్వీన్, ప్రగతి ఎక్స్‌ప్రెస్, సింహగఢ్, ఇంటర్సిటీ ఇలా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుగుతాయి. ఇవన్నీ ఉదయం ముంబై వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడతాయి. ఉద్యోగులకు డెక్కన్ క్వీన్ రైలు టైం టేబుల్ అనుకూలంగా ఉండడం వల్ల అత్యధికులు దీనినే ఆశ్రయిస్తారు. డెక్కన్ క్వీన్ ఇంజన్ మొదలుకుని బోగీలు సైతం నీలం రంగులో ఉంటాయి. కిటికీలపైన తెల్లని రంగుతో పట్టీ కనిపిస్తుంది. ఎంతో ప్రజాదరణ పొందిన దేశభక్తి గీతం ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ అనే పాటలో ఒక చోట నీలం రంగుతో కనిపిస్తున్న రైలు కూడా ఇదే కావడం విశేషం. ఈ 85 ఏళ్లలో డెక్కన్ క్వీన్‌ను నిత్యం వినియోగించుకున్న ఎందరో ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. భారత రైల్వే చరిత్రలో ఒకప్పుడు రైళ్లకు వేర్వేరు రంగులు ఉండేవి. అన్నీ ఒకేవిధంగా కనిపించాలనే ఉద్దేశంతో (ఇటీవల వచ్చిన దురంతో రైళ్లు మినహా) రైళ్లన్నింటికీ ఒకే రంగు వేశారు. డెక్కన్ క్వీన్ రైలు రంగు మాత్రం అలాగే ఉంది. దీని ఇంజన్ కూడా నీలం రంగులోనే ఉంటుంది. ఈ రైలుకు ఐదు ఏసీ చైర్‌కార్ బోగీలతోపాటు సీజన్పాస్ హోల్డర్ల కోసం ప్రత్యేకంగా బోగీలు కేటాయించారు. డైనింగ్ కార్ బోగీ కూడా ఉంది. ఇందులో ఒకసారి 32 మంది ప్రయాణికులు కూర్చుని అల్పాహారం, టీ, శీతల పానియాలు సేవించవ చ్చు. -
ప్రయాణం మరింత భారం
సాక్షి, ముంబై: ముంబై నుంచి పుణే వరకు శివ నేరి వోల్వో బస్సుల్లో రాకపోకలు సాగించేవారికి ఇకనుంచి ప్రయాణం మరింత భారం కానుంది. శీతల బస్సుల చార్జీలను ఎంఎస్ఆర్టీసీ 2.54 శాతం మేర పెంచింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే పెరిగిన చార్జీల భారం మోయలేక సతమతమవుతున్న నగరవాసుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. పెంచిన చార్జీలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ముంబై నుంచి పుణే వరకు ప్రయాణ చార్జీని రూ.15 మేర పెంచారు. దీంతో దాదర్-పుణే ఏసీ బస్సు టికెట్ చార్జీ రూ.390 నుంచి 405కు చేరుకుంది. అదేవిధంగా బోరివలి-పుణే ఏసీ బస్సు చార్జీని రూ.465 నుంచి 480కి పెంచారు. ఇంధన ధరలు తరచూ మారుతున్న కారణంగా శివనేరి ఏసీ బస్సులతోపాటు సాధారణ, సెమీ లగ్జరీ బస్సుల చార్జీలను పెంచాల్సిన పరిస్థితి తలెత్తిందని ఎమ్మెస్సార్టీసీ ప్రజాసంబంధాల అధికారి ముకుంద్ వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ప్రయాణం కోసం ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న వారు కూడా ప్రయాణ సమయంలోనే ఈ పెరిగిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.