దాడి జరిగింది.. కాని చెప్పుతో కాదు !
కనగానపల్లి : సామాజిక పింఛన్ల జాబితా విషయంలో కానగానపల్లి ఎంపీడీఓ కార్యాలయ టైపిస్టుపై ఎంపీపీ భర్త ముకుందనాయుడు దాడి చేసిన మాట వాస్తవమేనని, కానీ చెప్పుతో కొట్టలేదని ఎంపీడీఓ జలజాక్షితోపాటు మండల టీడీపీ నాయకులు తెలిపారు. ఎంపీపీ పద్మగీత భర్త ముకుందనాయుడు టైపిస్టు మూర్తిపై మంగళవారం దాడి చేసిన ఘటనపై బుధవారం ‘సాక్షి’లో ‘పరిటాల ఇలాకాలో అరాచకం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత స్పందించారు.
ఆమె ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నాయకులు బుధవారం సాయంత్రం బాధితుడు టైపిస్టు మూర్తి, ఎంపీడీఓను కార్యాలయానికి పిలిపించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముత్తువకుంట్ల పింఛన్ల జాబితా విషయంలో టైపిస్టుకు, ముకుందనాయుడుకు వాదన జరిగి, అతనిపై దాడికి యత్నించిన మాట వాస్తవమేనన్నారు. అయితే పత్రికలు, టీవీలో వచ్చినట్లు చెప్పుతో మాత్రం దాడి చేయలేదన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులంతా కలిసి మెలసి పనిచేసేందుకు కృషి చేస్తామని ఎంపీపీ పద్మగీత తెలిపారు. సమావేశంలో మండల పరిషత్ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాసులు, శర్మ, మురళీ, టీడీపీ మండల ఇన్చార్జ్ నెట్టం వెంకటేశులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.