breaking news
Muhammadu Buhari
-
'నా భార్య వంటగదికి చెందింది'
అబూజ: తెలుగు టీవీ చానల్స్ లో భార్యాభర్తల పంచాయితీలు చూస్తున్నారుకదా.. ఆ రేంజ్ లో తిట్టుకోనప్పటికీ ప్రఖ్యాత బీబీసీ చానెల్ లోనూ అలాంటి ఓ భార్యాభర్తల పంచాయితీ ప్రసారం అయింది. అతను ఆఫ్రికాలోనే పెద్ద దేశం నైజీరియాకు అధ్యక్షుడు. ఆమె.. విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తిచేసింది. 'దేశపాలనలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది' అనడం 'కంటే అన్నీ తానై ఆయనను నడిపిస్తోంది' అనడం ఉత్తమం. అలాంటావిడను పట్టుకుని 'ఈమె వంట గదికి చెందింది'అని అధక్షుడు వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలింతకీ ఏం జరిగిందంటే.. శుక్రవారం ప్రసారమైన ఓ కార్యక్రమంలో నైజీరియా అధ్యక్షుడు మొహమ్మదు బుహారీ భార్య అయిషా బుహారీ నిజాలు మాట్లాడారు. 'నా భర్తకు స్వయంగా ఆయనే నియమించిన ఉన్నతాధికారులు ఎవరో కూడా గుర్తుండదు. అన్ని విషయాలు నేనే దగ్గరుండి చూసుకోవాలి. చాలా ఏళ్లుగా ఆ పని చేసి, చేసి అలసిపోయా. అందుకే 2019 ఎన్నికల్లో పోటీకి దిగొద్దని ఆయనకు అల్టిమేటం ఇచ్చా. నా మాట కాదని ఎన్నికల్లో పోటీ చేస్తే గనుక.. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేపడతా. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయనను ఓడించి తీరుతా' అని అయిషా అన్నారు. సంచలనం రేపిన అయిషా వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన మొహమ్మదు.. 'నా భార్య ఏ పార్టీకి చెందిందో చెప్పలేను. అయితే ఆమె నా వంటగదికి, ఇంకొన్ని కీలకమైన గదులకు చెందిందని మాత్రం చెప్పగలను' అని అన్నారు. నైజీరియాకు అతిథిగా వచ్చిన జర్మన్ చాన్సరల్ ఏంజిలా మోర్కెల్ పక్కనుండగానే ఆయనిలా మాట్లాడారు. అతిథిమర్యాద పాటిస్తూ ఏంజిలా చిన్నగా నవ్వి ఊరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం కష్టమేనని మొహమ్మదు తేల్చిచెప్పారు. దీంతో పంచాయితీ అపరిష్కృతంగా మిగిలిపోయింది. -
మూడు నెలల్లో బొకోహరాం కథ ముగించేస్తాం
అబుజా: పూర్తిస్థాయి ఇస్లామిక్ రాజ్య స్థాపనే థ్యేయమని చెప్పుకుంటూ 13 ఏళ్ల క్రితం పురుడుపోసుకుని.. ఆపై వేలాదిమంది అమాయకులను కర్కశంగా హతమార్చింది బొకోహరాం తీవ్రవాద సంస్థ. పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాను తన కీలక స్థావరంగా చేసుకున్న బొకోహరాం.. ఇప్పటివరకు 10 మందిని పొట్టనబెట్టుకుంది. లక్షలాదిమంది నీడలేకుండా చేసింది. ప్రస్తుతం ఐఎస్ఐఎస్ తో చేతులు కలిపి తన పరిధిని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో నరహంతక బొకోహరాంను సమూలంగా మట్టుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది నైజీరియా ప్రభుత్వం. ఈ మేరకు బొకోహరాంను అంతమొందించాలంటూ బుధవారం నైజీరియా సైన్యాన్ని ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ఆదేశించారు. ' బొకోహరాం కథను ముగించానే నిర్ణయానికి వచ్చాం. మూడు నెలల్లో బొకోహరాం అనే సంస్థను భూమ్మీద లేకుండా చేస్తాం' అని బుహారీ ప్రకటించారు. బోకోతో పోరు ఎలా కొనసాగించాలనేదానిపై జాతీయ భద్రతా సలహాదారు రిటైర్డ్ మేజర్ జనరల్ బబగానా ముంగునోతో ఆయన సమావేశమయ్యారు. ఈ పోరాటంలో సహకరించాలని పొరుగుదేశాలు చాద్, నైగర్, కామెరూన్ దేశాలకు విజ్ఙప్తి చేశారు.