జీహెచ్ఎంసీ అప్రమత్తం ! ఎం.టి. కృష్ణబాబు
సాక్షి, సిటీబ్యూరో : తుపాను హెచ్చరికలు.. వరుస సెలవుల నేపథ్యంలో అనుకోకుండా నగరంపై తుపాను ప్రభావం చూపినా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. వాతావరణ శాఖ సమాచారం మేరకు నగరంపై తుపాను ప్రభావం ఉండనప్పటికీ అప్రమత్తంగా ఉన్నామన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బహుశా 13, 14 తేదీల్లో వర్ష ప్రభావం ఉంటే ఉండవచ్చునన్నారు.
వరుస సెలవులు, ముఖ్యమైన పండుగ అయినందున ఉద్యోగులందరూ ఊళ్లకు వెళ్లే అవకాశం ఉన్నందున, సెలవుల్ని రద్దు చేశామన్నారు. ఇప్పటికే సెలవు మంజూరైన వారు సైతం ఉపసంహరించుకొని నగరంలో అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. వర్షవిపత్తుల్లో సహాయక చర్యలు నిర్వర్తించే విపత్తునివారణ, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, తదితర విభాగాల్లోని వారికి ఇవి వర్తిస్తాయన్నారు. వర్ష ప్రభావాన్ని తట్టుకునేందుకు చేసిన ఏర్పాట్ల గురించి వెల్లడించారు.
20 కారిడార్ల అభివృద్ధి
గుర్తించిన 20 కారిడార్లలో రహదారులను పూర్తిస్తాయిలో అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. ఇందుకు దాదాపు రూ. 125 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేసినట్లు తెలిపారు. డిసెంబర్ ఒకటి నుంచి ఆ పనులు ప్రారంభిస్తామని, ఈలోగా టెండర్ల ప్రక్రియ తదితరమైనవి పూర్తిచేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఈఎన్సీ ధన్సింగ్ పాల్గొన్నారు.
రహదారుల మరమ్మతుల తీరిదీ...
ఇప్పటి వరకు రూ. 14.54 కోట్లతో 238 రహదారి మరమ్మతు పనులు చేపట్టామని కృష్ణబాబు తెలిపారు. వాటిల్లో 172 పనులు పూర్తికాగా, మరో 15 పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. మరో రూ. 3.7 కోట్ల మేర పనులు జరగాల్సి ఉందన్నారు. దక్షిణ మండలంలోని ఈ పనులు చేసే కాంట్రాక్టరు ఎక్కువ పనులు తీసుకొని పనులు చేయలేదన్నారు. సదరు కాంట్రాక్టును రద్దుచేసి, తిరిగి టెండరు పిలుస్తున్నామని తెలిపారు. ఇవన్నీ జీహెచ్ంఎసీ పరిధిలోవని చెప్పారు. ఆర్అండ్బీ, జాతీయ రహదారుల మార్గాల్లోని రహదారులకు ఆయా విభాగాలే మరమ్మతులు చేస్తాయని చెప్పారు.