breaking news
MR vaccine
-
77 లక్షల మందికి ఎంఆర్ టీకా
సాక్షి, హైదరాబాద్: తట్టు(మీజిల్స్), రుబెల్లా వ్యాధుల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఎంఆర్ టీకా కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 86 శాతం మంది పిల్లలకు టీకాలు వేశారు. ఎంఆర్ టీకా కార్యక్రమం ఆగస్టు 17న మొదలైంది. తొమ్మిది నెలలు నిండిన, 15 ఏళ్లలోపు ఉన్న పిల్లలందరికీ ఈ టీకాలు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 90,01,117 మంది టీకా వేయాల్సిన పిల్లలు ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది. సెప్టెంబర్ 12 వరకు రాష్ట్రంలోని 77,21,477 మంది పిల్లలకు టీకాలు వేయడం పూర్తయింది. ఈ నెల 25 వరకు ఎంఆర్ టీకా వేసే కార్యక్రమం అమలు కానుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంఆర్ టీకా కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరితో గ్రేటర్ హైదరాబాద్‌లో తొలుత ఈ కార్యక్రమం సక్రమంగా సాగలేదు. అనంతరం వైద్య శాఖ చేపట్టిన చర్యలతో పురోగతి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 72 శాతం మంది పిల్లలకు ఎంఆర్ టీకా వేసినట్లు ఆరోగ్య శాఖ తాజా నివేదిక పేర్కొంది. ఎంఆర్ టీకా అమలులో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. -
పిల్లల ఆరోగ్యం పట్టదా!
ఎంఆర్ టీకాపై గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్లక్ష్యం - వైద్యశాఖను అనుమతించని ప్రైవేటు స్కూళ్లు సాక్షి, హైదరాబాద్: పిల్లలకు పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న తట్టు (మీజిల్స్), రుబెల్లా వ్యాధుల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఆగస్టు 17న ఎంఆర్ టీకా కార్యక్రమాన్ని చేపట్టాయి. తొమ్మిది నెలలు నిండిన, 15 ఏళ్లలోపు ఉన్న అందరికీ ఈ టీకాలు వేయాల్సి ఉంటుంది. తెలంగాణలో 90,00,117 మంది పిల్లలు ఉన్నారని, వీరందరికీ ఎంఆర్ టీకా వేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోనూ ఎంఆర్ టీకా కార్యక్రమం మొదలైంది. కాగా, విద్యాధికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ టీకా వేసే ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంఆర్ టీకా అమలు తీరు సంతృప్తికరంగా లేదు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు టీకా వేయించే విషయంలో చివరి స్థానాల్లో ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల తీరుతోనే ఇలాంటి పరిస్థితి వస్తోందని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రసిద్ధ విద్యా సంస్థలు సైతం పిల్లలకు టీకాలు ఇప్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 33,85,260 మంది పిల్లలకు టీకా వేశారు. సెప్టెంబరు 25 వరకు టీకాలు వేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ దవాఖానాల్లో ఈ టీకాలు వేయనున్నారు. బడి బయట ఉన్న పిల్లలకు సైతం టీకా వేసేందుకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. అయితే కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల తీరుతో భవిష్యత్తు తరానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తోంది. -
వికటించిన ఎంఆర్ వ్యాక్సిన్
- ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఎంఆర్ వ్యాక్సిన్ వికటించింది. స్థానికంగా ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. రూబెల్లా వాక్సిన్ను విద్యార్థులకు ఇవ్వగానే వారికి తీవ్రమైన వాంతులు అయ్యాయి. కొందరు కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో విద్యార్థులను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. వాక్సిన్ను సరైన విధంగా ఇప్పించటంలో యాజమాన్యం విఫలం అయిందని విద్యార్థి సంఘాల నాయకులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు. -
చిన్నారులందరికీ ఎంఆర్ టీకా తప్పనిసరి
అనంతపురం మెడికల్: జిల్లా వ్యాప్తంగా 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులందరికీ మీజిల్స్, రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్ వేయించాలని జాయింట్ కలెక్టర్ రమామణి తెలిపారు. ఎంఆర్ క్యాంపెయిన్‌కు సంబంధించి లయన్స్ క్లబ్ అందజేసిన ప్రచార సామగ్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సెప్టెంబర్ 8వ తేదీ వరకు పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, ఇతరత్రా ప్రాంతాల్లో టీకాలు వేయనున్నట్లు చెప్పారు. వంద శాతం లక్ష్యం సాధించాలన్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలన్నారు. ఆశకార్యకర్తలకు జూన్,జూలై ఇన్సెంటివ్ను త్వరగా విడుదల చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీఐఓ పురుషోత్తం, డీపీఎంఓ డాక్టర్ అనిల్‌కుమార్, పీఓడీటీ సుజాత, యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్స్ దిలీప్‌కుమార్, రితీశ్ బజాజ్, డెమో ఉమాపతి, డిప్యూటీ డెమో నాగరాజు, గంగాధర్, హెచ్ఈఓ సత్యనారాయణ, డీపీహెచ్ఎన్ రాణి, హెచ్‌ఈఈఓ లక్ష్మినరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తల్లులూ మరవొద్దు..
– ఎంఆర్ టీకాతో తట్టు, పొంగు నివారణ – ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్రత్యేక డ్రైవ్ – 10.69 లక్షల మందికి లబ్ధి – జిల్లాకు చేరుకున్న వ్యాక్సిన్ – ఏర్పాట్లను పూర్తి చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ 49,200 : దేశంలో ఏటా మీజిల్స్ (తట్టు)తో మరణిస్తున్న చిన్నారులు 10,69,345 : ఎంఆర్ టీకా వేయించేందుకు జిల్లాలో గుర్తించిన పిల్లలు 5,00,000 : జిల్లాకు తొలి విడతగా చేరిన వ్యాక్సిన్ డోస్‌లు 5009 : స్కూల్ సెషన్లు 4127 : ఔట్రీచ్ సెషన్లు 80 : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 15 : సామాజిక ఆరోగ్య కేంద్రాలు 2 : ఏరియా ఆస్పత్రులు 1 : హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి 1 : అనంతపురం సర్వజనాస్పత్రి 19 : ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు 586 : ఆరోగ్య ఉప కేంద్రాలు మీజిల్స్ (తట్టు), రుబెల్లా (పొంగు).. వైరస్ కారణంగా వచ్చే ఈ భయంకర వ్యాధులు.. ఎంతో మంది చిన్నారులను బలిగొంటున్నాయి. ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సులువుగా వ్యాపిస్తుంది. గర్భిణులకు రుబెల్లా వైరస్ సోకితే పుట్టబోయే బిడ్డకు అంధత్వం, అంగ వైకల్యంతో పాటు మానసిక ఎదుగుదల ఉండదు. ఒకప్పుడు పోలియో మహమ్మారి చిన్నారులను చిదిమేసింది. ఇప్పుడు మీజిల్స్, రుబెల్లా దాని స్థానాన్ని ఆక్రమిస్తోంది. చిన్నారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధుల బారి నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనంతపురం మెడికల్/ఆత్మకూరు: దేశ వ్యాప్తంగా తట్టు, పొంగు వైరస్ వల్ల ప్రతి 15 వేల మంది చిన్నారుల్లో ఒకరు మృత్యువాత పడుతున్నారు. దీనిపై సమరభేరి మోగించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మహమ్మారిని 2020 సంవత్సరానికి అంతం చేయాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లక్ష్యం మేరకు ఈ వ్యాధులను నివారించేందుకు ‘ఎంఆర్ వ్యాక్సిన్’ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. యునిసెఫ్ సహకారంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి ఎంఆర్ (మీజిల్స్, రుబెల్లా) క్యాంపెయిన్ చేపట్టడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులు, బాలబాలికలకు టీకా ఇచ్చేందుకు కార్యచరణ రూపొందించారు. మీజిల్స్ మీజిల్స్ (తట్టు) అనేది ప్రాణాంతక అంటువ్యాధి. చిన్నారుల్లో వైకల్యం/మరణాలకు ప్రధాన కారణాల్లో ఇదొకటి. ఈ వ్యాధి సోకిన వారు దగ్గడం, తుమ్మడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. న్యుమోనియా, డయేరియా (అతిసారం), మెదడు çసంబంధిత ప్రాణాంతక రోగాలతో పిల్లలు బాధపడుతుంటారు. ఎక్కువ జ్వరంతో కూడిన ఎర్రటి దద్దుర్లు, దగ్గు, ముక్కు కారడం (జలుబు), కళ్లు ఎర్రబడడం ‘మీజిల్స్’ లక్షణాలు. రుబెల్లా గర్భం దాల్చిన తొలి దశలో రుబెల్లా ఇన్ఫెక్షన్తో కంజెనైటల్ (పుట్టకతో సంక్రమించే) రుబెల్లా సిండ్రోమ్ (సీఆర్ఎస్) కలుగుతుంది. అది గర్భస్థ, నవజాత శిశువులపై అతి తీవ్రమైన, ప్రాణాంతకమైన పరిణామాలను చూపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన గర్భిణులకు పుట్టిన చిన్నారుల్లో కళ్లు (నీటి కాసులు, శుక్లం), చెవులు, మెదడు (చిన్న తల, బుద్ధిమాంద్యం), గుండె సంబంధిత లోపాలు ఎక్కువగా ఉంటాయి. రుబెల్లా సోకిన గర్భిణులకు గర్భస్రావం, గర్భవాతం, మృత శిశువు జన్మించడం వంటివీ కలగవచ్చు. ఎంఆర్ క్యాంపెయిన్ ఇలా మీజిల్స్ రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఆరు వారాల పాటు చేపడతారు. ఇప్పటికే టీకాలు వేయాల్సిన పిల్లల వివరాలను సేకరించారు. ప్రతి బృందంలో ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశ కార్యకర్తలు, ఒక అంగన్వాడీ కార్యకర్త ఉంటారు. తొలి రెండు వారాలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, ఆ తర్వాత రెండు వారాలు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో టీకాలు వేస్తారు. ఐదో వారంలో అర్బన్ ప్రాంతాల్లో, చివరి వారంలో టీకా వేయించుకోని వారిని గుర్తించి వేస్తారు. జిల్లాకు చేరుకున్న 5 లక్షల డోస్‌లు జిల్లాలో 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు బాలబాలికలు 10,69,345 ఉన్నట్లు గుర్తించారు. 11,86,973 డోస్‌ల వ్యాక్సిన్ అవసరమని ఇండెట్ పెట్టారు. తొలి విడతగా 5 లక్షల డోస్‌లు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని డీఎంహెచ్ఓ కార్యాలయంలోని వ్యాక్సిన్ సెంటర్ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రతి పది మందికి ఒక వైల్ : ఎంఆర్ టీకా ఉన్న ఒక వైల్తో పది మందికి టీకాలు వేయొచ్చు. ఇందుకు ప్రత్యేకంగా తయారు చేసిన సిరంజీలు వాడుతున్నారు. ఒకరికి వాడిన సిరంజి మరొకరికి వినియోగించకుండా టీకా మందు నింపగానే నిర్దేశిత పరిమాణం వల్ల లాక్ అయ్యేలా ఈ సిరంజిలను తయారు చేశారు. నాలుగు రకాల టీకా కేంద్రాలు ఎంఆర్ వ్యాక్సినేషన్ జరిగే సమయంలో నాలుగు రకాల టీకా కేంద్రాలను ఆరోగ్యశాఖ ఏర్పాటు చేయనుంది. – విద్యా సంస్థల వద్ద టీకా కేంద్రాలు: 200 మంది చిన్నారులకు ఒక సెషన్ చొప్పున 5,009 సెషన్స్ చేపట్టనున్నారు. – ఔట్ రీచ్ టీకా కేంద్రాలు: సాధారణ టీకా కార్యక్రమం జరిగే క్రమవారీ అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాలు/పట్టణ ప్రాంతాల్లో అదనపు కేంద్రాలు ఉంటాయి. ఇలాంటివి 4,127 గుర్తించారు. 150 మంది చిన్నారులకు ఒక సెషన్ నిర్వహిస్తారు. – సంచార టీకా కేంద్రాలు: ఊరూరా తిరిగి పని చేసుకునే వాళ్లను, తాత్కాలిక సెటిల్మెంట్లను కవర్ చేయడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. జిల్లాలో ఇలాంటి 329 ప్రాంతాలను గుర్తించారు. – ఆస్పత్రి ఆధారిత కేంద్రాలు: పీహెచ్సీ, సీహెచ్‌సీ, ప్రైవేట్ క్లినిక్‌లు. ప్రస్తుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి బుధ, శనివారం వ్యాక్సినేషన్ ఉంటుంది. ఇప్పుడు సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో పీహెచ్‌సీల్లో ఎంఆర్ వ్యాక్సిన్ వేస్తారు. టీకాల పట్టికలోకి ‘ఎంఆర్’ వ్యాక్సిన్: చిన్న పిల్లలకు వేసే టీకాల పట్టికలోకి త్వరలో కొత్త వ్యాక్సిన్ చేరుతోంది. ఇప్పటి వరకు 9 నెలల నుంచి 12 నెలల వయసున్న చిన్నారులకు మీజిల్స్ నివారణ కోసం డోస్–1 వేసేవారు.16 నెలల నుంచి 24 నెలల మధ్యలో డోస్–2 వేసే వారు. రుబెల్లాకు మాత్రం మందులేదు. కొద్ది మంది మాత్రమే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేయించుకునే వారు. ప్రస్తుతం రెండింటికీ కలిపి ఒకే టీకా మందులు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టీకాల కార్యక్రమంలో ఆగస్టు తర్వాత ‘ఎంఆర్’ను చేర్చనున్నారు. ఇలా ఉంటే ‘టీకా’ వేయించొద్దు ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. గతంలో మీజిల్స్ టీకా వేయించి ఉన్నా ఇప్పుడు తప్పనిసరిగా ఈ టీకా వేయించాలి. అధిక జ్వరం, ఇతర తీవ్రమైన వ్యాధులు (స్పృహలో లేకపోవడం, అపస్మారక స్థితిలో ఉండడం), ఆస్పత్రుల్లో చేరిన చిన్నారులు, గతంలో మీజిల్స్, రుబెల్లా టీకా వల్ల తీవ్రమైన అలర్జీ, రియాక్షన్‌కు గురైన వారికి వేయించొద్దు. ఎంఆర్ వ్యాక్సిన్‌పై ఎలాంటి సందేహాలు ఉన్నా ఆరోగ్య సిబ్బంది, వైద్యాధికారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. అందరి సహకారం తీసుకుంటున్నాం ప్రభుత్వం ఎంఆర్ టీకాలు ఉచితంగా అందజేస్తోంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌లో పిల్లలకు వచ్చే ఈ వ్యాధుల నుంచి కాపాడుకోవాలి. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆరు వారాల పాటు ఈ క్యాంపెయిన్ ఉంటుంది. దీనిపై ఇప్పటికే వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాం. అన్ని శాఖల సహకారం తీసుకుని ముందుకెళ్తున్నాం. - డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ పకడ్బందీగా ఏర్పాట్లు ఎంఆర్ వ్యాక్సిన్లను ఇప్పటికే అన్ని ప్రాంతాలకూ పంపించాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నాం. ఎంఆర్ క్యాంపెయిన్ ముగిసిన తర్వాత చిన్నారులకు ఇచ్చే రెగ్యులర్ టీకాల పట్టికలో ఈ వ్యాక్సిన్‌ను చేర్చబోతున్నాం. కోల్డ్ చెయిన్ స్టోరేజ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, టీకా వేసిన తర్వాత ఇబ్బందులు వస్తే ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాం. - డాక్టర్ పురుషోత్తం, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి తప్పనిసరిగా ‘ఎంఆర్’ వేయించండి పోలియోను నిర్మూలించిన తరహాలోనే మీజిల్స్ రుబెల్లాపై ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తోంది. ఈ వ్యాధులు సోకితే చిన్న పిల్లల్లో రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది. తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు. ఎంఆర్ క్యాంపెయిన్ చేపట్టి అందరికీ ఒకేసారి వేయడం వల్ల అందరికీ రక్షణ ఉంటుంది. రుబెల్లా మీజిల్స్ వ్యాధి వల్ల దృష్టిలోపం, మెదడువాపు, అతిసారం, జ్వరం వంటి రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించండి. - డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్, చిన్న పిల్లల వైద్యుడు, సర్వజనాస్పత్రి -
మీజిల్స్, రుబెల్లా నివారణకు టీకాలు
- దేశ వ్యాప్తంగా ఎంఆర్ టీకా కార్యక్రమం - రాష్ట్రంలో ఆగస్టు 17 నుంచి మొదలు - తొమ్మిది నెలలు నిండిన పిల్లలు... 15 ఏళ్లలోపు బాలలకు టీకాలు సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన మీజిల్స్(తట్టు), రుబెల్లా వ్యాధులను ఒకే టీకా (ఎంఆర్)తో నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), యునిసెఫ్ సహకారంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సామూహిక టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో ఆగస్టు 17 నుంచి ఎంఆర్ టీకా వేసే ప్రక్రియ మొదలు కానుంది. వివిధ దశల్లో దేశవ్యాప్తంగా ఈ టీకాలను వేయనున్నారు. రాష్ట్రంలో సుమారు 90 లక్షల మంది పిల్లలకు ఈ టీకాలు వేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అన్ని రకాల ప్రభుత్వ ఆస్పత్రులలో ఎంఆర్ టీకాలు ఇస్తారు. తొమ్మిది నెలలు నిండిన, 15 ఏళ్లలోపు ఉన్న అందరు పిల్లలకు ఎంఆర్ టీకా ఇప్పించాల్సి ఉంటుంది. ఇతర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వారు, గతంలో మీజిల్స్, రుబెల్లా నివారణకు టీకాలు వేయిస్తే అలర్జీకి గురవైన వారు ఎంఆర్ టీకాను వేయించుకోకూడదు. మీజిల్స్ లక్షణాలు: మీజిల్స్ వైరస్ ద్వారా సోకుతుంది. ప్రమాదకరమైన అంటు వ్యాధి. తీవ్ర జ్వరంతో ఎర్రటి దద్దుర్లు, దగ్గు, ముక్కు కారడం(జలుబు), కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు ఉంటాయి. ప్రధానంగా దగ్గడం, తుమ్మడం వల్ల వచ్చే తుంపర్లతో ఒకరి నుంచి మరొకరిని సోకుతుంది. అతిసారం, న్యుమోనియా, నోటి పూత, చెవి ఇన్ఫెక్షన్, కళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. రుబెల్లా: నవజాత శిశువుల్లో అంధత్వం, వినికిడిలోపం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. రెబెల్లా వచ్చిన వారికి ఒళ్లంతా దద్దుర్లు కనిపిస్తాయి. ఒకసారి రుబెల్లా సోకిన వారికి గరిష్టంగా ఏడు రోజుల వరకు వైరస్ శరీరం మొత్తం ఉంటుంది. దీన్ని అంతా ఎంతో ముఖ్యమైన చర్యగా భావించి టీకాను శ్రద్ధగా వేయించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ చిన్న పిల్లల తల్లిదండ్రులను కోరారు.