కోతుల బెడద: మహిళ బలవన్మరణం
వెల్లరాడ: కోతుల బెడదతో విసిగి వేసారిన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా కొండప్రాంతమైన వెల్లరాడలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన పుష్పలత(52)కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం భర్త చనిపోగా ఆమె కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. కాగా, గత కొంతకాలంగా ఈ కుటుంబం వానరాల దాడులకు గురవుతోంది. ఇంటి పక్కనే ఉన్న రబ్బరు చెట్లపైకెక్కి ఇంటిపై దూకుతూ.. పైకప్పు రేగులను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి. దాంతో ఆగకుండా వారు వండుకున్న ఆహారాన్ని తినడం, ఇంట్లోని వస్తువులను, ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి.
ఇప్పటికే పలుమార్లు కోతులబారిన పడి తీవ్రంగా గాయపడ్డారు కూడా. అంతేకాక కోతి మూక బెడద తాళలేక చుట్టుపక్కల వారు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. కాగా గత కొన్ని రోజులుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వాటి చేష్టలు మితిమీరిపోయాయి. దీంతో విసిగిపోయిన పుష్పలత రెండు రోజుల క్రితం యాసిడ్ తాగి మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.