breaking news
money flow
-
అమ్మబోతే అడవి...
- పడకేసిన అపరాల వ్యాపారం - కొనుగోళ్లపై రుణమాఫీ ప్రభావం - రెతుల చేతుల్లో కాసులు లేకపోవడమే కారణం - మార్కెట్లో తగ్గిన ద్రవ్య చలామణి తాడేపల్లిగూడెం : కొత్త పప్పులు మార్కెట్లోకి వచ్చే ఫిబ్రవరి నెలలో అపరాల దుకాణాల వద్ద సందడి ఉంటుంది. కానీ.. అపరాలకు ప్రధాన మార్కెట్‌గా ఉన్న తాడేపల్లిగూడెంలో మూడు నెలలుగా మార్కెట్ మందకొడిగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. రోజుకు రూ.70 వేల నుంచి రూ.80 వేల మేరకు వ్యాపారం సాగించే దుకాణాల్లో సైతం ప్రస్తుతం రూ.30 వేలకు మించి విక్రయాలు జరగడం లేదని చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్, నిల్వలకు సరుకులు తీసుకెళ్లే సమయంలో బేరాలు ఊపందుకుంటాయని వ్యాపారులు భావించారు. కానీ.. ఆ పరిస్థితి మార్కెట్లో కనిపించడం లేదు. వివిధ కారణాల వల్ల ద్రవ్య చలామణి తగ్గడం ఒక కారణంగా చెబుతున్నప్పటికీ అసలు కారణాలను వ్యాపార వర్గాలు కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరిలో టర్నోవర్ పడిపోవడం ఇదే ప్రథమమని వాణిజ్య పన్నుల శాఖ అధికారి బి.వెంకటేశ్వరరావు అంటున్నారు. మార్కెట్లో ద్రవ్య చలామణి ఎందుకు తగ్గింది? కారణాలు ఏమిటనే విషయాలను మార్కెటింగ్ అవసరాల కోసం సరుకులను సరఫరా చేసే బడా వ్యాపారులు, దళారులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. అలాగని గత సీజన్ కంటే సరుకులను పెద్దమొత్తంలో నిల్వ చేసిందీ లేదు. ఉన్న కొద్దిపాటి నిల్వలకు ఆర్డర్లు రాని పరిస్థితి. ఇంతకుముందు తెచ్చుకున్న సరుకులు దుకాణాల నుంచి కదలని పరిస్థితులలో ఒక్కసారిగా పప్పుల వ్యాపారం పడకేసింది. అన్ని జిల్లాల్లోనూ ఒక్కసారిగా ఇలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమంగా వ్యాపారులు చెబుతున్నారు. అసలే బేరం లేదనుకుంటే విజిలెన్స్ దాడులు వ్యాపారులను తేరుకోకుండా చేస్తున్నాయి. మరోపక్క లెసైన్సింగ్, పన్నుల విధానంలో మార్పులు కూడా వ్యాపారాన్ని ముం దుకు సాగనివ్వడం లేదు. అమ్మకాలపై రుణమాఫీ ప్రభావం రుణమాఫీ రైతుల పాలిట శాపంగా మారింది. రెండో పంట వేసే సమయానికి రైతులు సహకార సంఘాలు, బ్యాంకులలో తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించి కొత్త అప్పులు తీసుకోవడం లేదా రుణాన్ని తిరగ రాసుకోవడం వంటివి చేస్తారు. అప్పులకు పోను, మిగిలిన సొమ్ములు నాలుగు రూపాయలు రైతుల చేతిలో ఆడుతూ ఉంటాయి. దమ్ములు, ఊడ్పులు వంటి వాటికి కొంత ఖర్చు చేసినా.. ఎరువులు, పురుగు మందులు చాలావరకు అరువు తెచ్చుకుంటారు. పంటలు చేతికి వచ్చాక తిరిగి చెల్లించే పరిస్థితి చాలా ప్రాంతాలలో ఉంటుంది. ఇలా మొదటి పంటకు సంబంధించి సొమ్ముతో ఇంట్లోకి కావలసిన అపరాలను నిల్వ కోసం రైతులంతా కొంటుంటారు. అనుకున్నట్టుగా రుణమాఫీ జరగకపోవడంతో తొలిసారిగా రైతులు ఉన్నదంతా ఊడ్చి, ఇంట్లోని నగానట్రా తాకట్టు పెట్టి వ్యవసాయ పనులు చేసుకోవలసిన దుస్థితి దాపురించింది. చేతిలో చిల్లిగవ్వ లేని ఈ పరిస్థితిలో రైతులు నిల్వ కోసం కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో ఒక్క సారిగా అపరాల వ్యాపారం కుదేలైంది. ధరలు స్థిరం మేలు రకం కందిపప్పు గుత్త మార్కెట్లో కిలో రూ.80 ఉంది. మినపప్పు రూ.70, శనగపప్పు రూ.50, పెసరపప్పు 6నెలలు గా కిలో రూ.110 వద్ద స్థిరంగా ఉన్నాయి. వేరుశనగ పంట దెబ్బతినడం వల్ల కిలో రూ.80 ఉంది. బన్సీ రవ్వ, మైదా రవ్వ, గోధుమ రవ్వ ధరలు కిలో రూ.27కు అటూ ఇటూగా ఉంటున్నాయి. పంచదార క్వింటాల్ రూ.2,900 ఉంది. వ్యాపారాలు మందగించాయి అపరాల వ్యాపారులు మూడు నెలలుగా సంతోషంగా లేరు. అమ్మకాలు దాదాపు 50 శాతం తగ్గాయి. ఇలాంటి పరిస్థితిని తొలిసారిగా ఎదుర్కొంటున్నారు. జనాల చేతిలో సొమ్ములాడక ఈ స్థితి వచ్చింది. - రామచంద్ర అగర్వాల్, అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్, తాడేపల్లిగూడెం పండగ లేదు.. పెళ్లిళ్ల బేరమూ లేదు పండగలు వస్తున్నాయంటే పరమానందంగా ఉండేది. అపరాల వ్యాపారం బాగా సాగేది. సంక్రాంతి అంటే నిజంగా మాకు పెద్ద పండగే. ఈ ఏడాది ఆ బేరమూ లేదు. పోనీ నిల్వల బేరం ఉంటుందని ఆశ పడ్డాం. అదీ లేకుండా పోయింది. రైతుల చేతిలో నాలుగు రూపాయలు ఆడితే బేరం ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి లేక అమ్మకాలు బాగా తగ్గాయి. - ఉంగరాల శ్రీనివాస్, అపరాల వర్తక సంఘ నాయకుడు, తాడేపల్లిగూడెం. -
నాలుగు కోట్లతో దొరికేసిన నాయకుడు!!
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు ఈసీ వర్గాలు, పోలీసులు కలిసి 10 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంటే, ఒకే ఒక్క సంఘటనలో మరో 4 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేస్తుండగా బీఎస్పీ నాయకుడు ఒకరి వద్ద 4 కోట్లు దొరికాయి. మీరట్ శాస్త్రినగర్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీఎస్పీ నాయకుడు నదీం, అతడి అనుచరుడు మెరాజ్ కలిసి ఘజియాబాద్ వెళ్తుండగా ఈసీ వర్గాలు ఆయన కారు తనిఖీ చేశాయి. ఆయన వద్ద 4 కోట్లున్నాయి. అంత పెద్ద మొత్తం ఎందుకు తీసుకెళ్తున్నారని అడగ్గా, ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆదాయపన్ను శాఖ అధికారులు నదీం ఇంట్లో సోదాలు చేసినా, ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల కోసమే ఈ సొమ్ము తీసుకెళ్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. -
వంద కోట్లు దాటిన పోలీసు కలెక్షన్లు
కట్టలు తెగుతున్నాయి.. దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని రీతిలో మన రాష్ట్రంలో డబ్బు మంచినీళ్లలా ప్రవహిస్తోంది. ఎన్నికల కాలం కావడంతో పంచడానికే తీసుకెళ్తున్నారో, ఇంకేం చేస్తున్నారో గానీ వంద కోట్లకు పైగా ఇప్పటికే పట్టుబడింది. దేశం మొత్తమ్మీద 195 కోట్ల రూపాయలు పట్టుబడితే, అందులో కేవలం మన రాష్ట్రం వాటా ఒక్కటే 118 కోట్ల రూపాయలు!! ఇదంతా చూసి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకుల సంపాదన చాలా ఎక్కువగా ఉన్నట్లుందని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 118 కోట్లు స్వాధీనం చేసుకోగా, తమిళనాడులో 18.31 కోట్లు, మహారాష్ట్రలో 14.40 కోట్లు, యూపీలో 10.46 కోట్లు, పంజాబ్‌లో 4 కోట్ల రూపాయలను మాత్రమే పట్టుకున్నారు. పాతబస్తీలోని చిన్న చిన్న సందుల్లో గాలించినప్పుడు కూడా కొన్ని వాహనాల్లోంచి ఏకంగా ఆరేసి కోట్ల రూపాయలు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. కిలోల కొద్దీ బంగారం, కట్టల కొద్దీ డబ్బులు ఎక్కడ పడితే అక్కడే పట్టుబడుతున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటుచేసి ఎక్కడికక్కడే డబ్బులు స్వాధీనం చేసుకుంటున్నారు. కేవలం కార్లనే కాక.. అన్ని రకాల వాహనాలనూ వదలకుండా తనిఖీ చేయడంతో వంద కోట్లకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అయితే, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు పోలీసులు ఎన్ని రకాలుగా డబ్బులు పట్టుకుంటున్నా, మరిన్ని మార్గాల్లో డబ్బు తరలిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సులు, చివరకు ఆటోల్లో కూడా డబ్బులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటినైతే పోలీసులు పెద్దగా పట్టించుకోవట్లేదన్న ఉద్దేశంతో ఇలా తరలిస్తున్నారని సమాచారం. గతంలో ఎన్నికల సందర్భంగా ఏకే మహంతి డీజీపీగా ఉన్న సమయంలో కార్లకు ఉండే స్టెఫినీ టైర్లలో దాచి తరలిస్తున్న సొమ్మును కూడా పట్టుకున్నారు. ఈసారి కూడా అంతే పటిష్ఠంగా నిఘా పెట్టి ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ప్రయత్నిస్తున్నా.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం డబ్బుల పంపిణీ యథేచ్ఛగా జరిగిపోయింది.