breaking news
Mohamed bin Salman
-
ఉగ్రవాదం ఉమ్మడి సమస్య
న్యూఢిల్లీ: ఉగ్రవాదం, తీవ్రవాదం అనేవి భారత్, సౌదీ అరేబియాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సమస్యలని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ బుధవారం పేర్కొన్నారు. ఈ సమస్యలపై పోరాటానికి భారత్‌తోపాటు ఇతర పొరుగు దేశాలకు కూడా తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో బుధవారం విస్తృత చర్చలు జరిపిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత గురువారం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై భారీ ఉగ్రవాద దాడి జరిగిన కారణంగా భారత్, పాకిస్తాన్ల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొనడం తెలిసిందే. అటు సల్మాన్ ముందుగా పాకిస్తాన్లో సోమ, మంగళవారాల్లో పర్యటించి, పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడి భారత్‌కు రావడం గమనార్హం. మోదీతో చర్చల అనంతరం సల్మాన్ విలేకరులతో మాట్లాడుతూ ‘రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం భారత్, సౌదీ అరేబియాలు కలిసి పనిచేస్తాయి. ఉగ్రవాదం, తీవ్ర వాదాలు భారత్, సౌదీలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సమస్యలు. వీటిపై పోరాటంలో భారత్‌తోపాటు ఇతర పొరుగు దేశాలకు కూడా మేం సహకారం అందిస్తామని నేను చెప్పదలుచుకున్నాను’ అని తెలిపారు. అయితే సల్మాన్ పుల్వామా ఉగ్రవాద దాడి గురించి తన మాటల్లో కనీసం ప్రస్తావించలేదు. ఉగ్రవాదానికి క్రూర చిహ్నం: మోదీ పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి ఉగ్రవాదానికి క్రూర చిహ్నమని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న వారికి శిక్ష పడాలని కోరారు. ‘గతవారం పుల్వామాలో జరిగిన ఆటవిక దాడి ప్రపంచ ఎదుర్కొంటున్న అమానవీయ ప్రమాదానికి ఓ సూచిక. ఈ ఆపదను ఎదిరించేందుకు ఉగ్రవాదానికి మద్దతుగా ఉంటున్న దేశాలపై ఒత్తిడి పెంచాలని మేం నిర్ణయించాం’ అని సల్మాన్‌తో చర్చల అనంతరం మోదీ తెలిపారు. వ్యూహాత్మకానికి సమయమిదే.. సౌదీ అరేబియాతో భారత్‌కు ఉన్న ఇంధన బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చేందుకు ఇదే సరైన సమయమని మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని అంశాలపై తాను, సల్మాన్ విస్తృత చర్చలు జరిపామనీ, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని తాము నిర్ణయించామన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు సహా వివిధ రంగాల్లో సహకార విస్తృతి కోసం ఐదు ఒప్పందాలపై మోదీ, సల్మాన్‌లు సంతకాలు చేశారు. ద్వై వార్షిక సదస్సును, వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పాటు చేయాలని కూడా ఇరు దేశాలు నిర్ణయించాయని మోదీ చెప్పారు. సౌదీ అరేబియా నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో సంస్థాగత పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అగీకారం కుదిరిందన్నారు. అమరవీరుల స్మరణ ఇదేనా? పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడి, ఆ దేశం లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చిన సౌదీ యువరాజుకు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికిన తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పుల్వామా దాడి బాధితులను మోదీ గుర్తుంచుకునేది ఇలాగేనా అని ప్రశ్నించింది. విమానాశ్రయంలో సల్మాన్‌ను మోదీ కౌగిలించుకుని స్వాగతం చెబుతున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. హజ్ కోటా పెంపు ముస్లింలకు పవిత్రమైన హజ్ యాత్రకు భారత కోటాను సౌదీ అరేబియా పెంచింది. మోదీ, సల్మాన్ల భేటీ అనంతరం భారత విదేశాంగ శాఖ ఈ విషయం వెల్లడించింది. మూడేళ్లలో భారత హజ్ కోటా పెరగడం ఇది మూడోసారి. ప్రస్తుతం భారత్ నుంచి హజ్ యాత్రకు గరిష్టంగా 1,75,025 మందిని అనుమతిస్తుండగా తాజాగా ఆ పరిమితిని మరో 25 వేలు పెంచారు. దీంతో హజ్ యాత్రకు భారత్ నుంచి రెండు లక్షల మంది ముస్లింలు వెళ్లే అవకాశం కలిగింది. ఈ సంవత్సరం నుంచే ఇది అమల్లోకి వస్తుందని మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పగా, విదేశాంగ శాఖలో కార్యదర్శిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి మాత్రం వివిధ ఇతర అంశాలపై దీని అమలు ఆధారపడి ఉందన్నారు. -
సౌదీ వారసుడు మారాడు
క్రౌన్ ప్రిన్స్‌గా బిన్ సల్మాన్ రియాద్: సౌదీ అరేబియా రాచరిక వారసత్వ పరంపరలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. రాజు సల్మాన్ తన కొడుకు, డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ అయిన మహ్మద్ బిన్ సల్మాన్(31)ను యువరాజు(క్రౌన్ ప్రిన్స్)గా నియమించారు. దీంతో తన తరువాత సింహాసనాన్ని చేపట్టే అవకాశాన్ని కొడుకుకు కల్పించినట్లయింది. ఇప్పటిదాకా యువరాజు స్థానంలో ఉన్న సోదరుడి కుమారుడు మహ్మద్ బిన్ నయేఫ్(51)ను తప్పించడంతో పాటు ఆయన్ని డిప్యూటీ ప్రధాని, అంతర్గత భద్రత మంత్రిగా కూడా తొలగించారు. యువరాజుగా ఎంపికైన మహ్మద్ బిన్ సల్మాన్ ఇప్పటికే రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక మండలి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. బిన్ సల్మాన్ పదవీచ్యుతుడైన సోదరుడు నయేఫ్ చేతిని ముద్దాడుతూ ఆయన ముందు మోకారిల్లడం టీవీ చానెళ్లలో కనిపించింది. బదులుగా నయేఫ్, యువరాజు భుజం తడుతూ శుభాకాంక్షలు చెప్పారు. ఇక తాను విశ్రాంతి తీసుకుంటానని నయేఫ్ అన్నారు. దీనికి బిన్ సల్మాన్ స్పందిస్తూ... ఆయన సలహాల్లేకుండా తానేం చేయలేనన్నారు. కాగా, బిన్ సల్మాన్ అమెరికాలో పర్యటించడం ట్రంప్ సౌదీలో తన తొలి విదేశీ పర్యటన జరపడానికి మార్గం సుగమం చేసిందని భావిస్తున్నారు.