breaking news
Model schools in the district
-
‘ఆదర్శ’ ప్రవేశాలకు మంచి తరుణం
సాక్షి,బోథ్: గ్రామీణప్రాంతంలోని విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఆంగ్ల విద్య అందించేందుకు ప్రభుత్వం మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసింది. అన్ని సౌకర్యాలతో భవనాలు నిర్మించింది. 2019–20 విద్యా సంవత్సరానికిగాను ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు ఇంటర్నెట్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగిన ప్రక్రియను ఈనెల 8వ తేదీ వరకు పొడిగించారు. దీంతో విద్యార్థులకు మరో ఆరురోజులపాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఆంగ్ల మాధ్యమం వైపు విద్యార్థుల చూపు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం వైపు విద్యార్థులు అధిక సంఖ్యలో మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో ఆంగ్లబోధన బోధిస్తున్నారు. దీంతో ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చేరేందుకు మరింత ముందుకు వస్తున్నారు. దూరప్రాంత విద్యార్థులకు పాఠశాలలోనే ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉండి చదువుకునేందుకు ప్రభుత్వం సదుపాయం కల్పిస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో మరింత ఉత్సాహం చూపుతున్నారు. ప్రవేశాలకు జోరుగా ప్రచారం.. అనూహ్య స్పందన.. ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు, ఉచిత పుస్తకాలు, ఆంగ్లంలో నాణ్యమైన విద్య అందిస్తామని చెబుతున్నారు. వసతిగృహంలో ఉండి చదువుకునే విద్యార్థినులకు నెలవారీగా ప్యాకెట్ మనీ ఖర్చులు కూడా అందిస్తామని చెబుతున్నారు. జిల్లాలో పాఠశాలలు.. సీట్ల వివరాలు.. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. బోథ్, బజార్ హత్నూర్, గుడిహత్నూర్, జైనథ్, నార్నూర్, బండారుగూడ (ఆదిలాబాద్)లో ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో ఆరోతరగతిలో రెండు సెక్షన్లు కలిపి వంద సీట్లు ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 600 సీట్లు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఖాళీలు భర్తీ చేస్తారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి తేదీని ఈనెల 8 వరకు పొడిగించారు. ఇతర తరగతుల్లో కూడా ఏమైనా సీట్లు ఖాళీగా ఉంటే ఆ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. ఆయా పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు అందుబాటులో ఉంచారు. ఎంపిక ప్రక్రియ ఇలా.. రాత పరీక్ష ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ ప్రకారం విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఆరోతరగతిలోని వందసీట్లలో 50శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. 15 శాతం ఎస్సీలకు, ఆరుశాతం ఎస్టీలకు కేటాయిస్తారు. బీసీలకు కేటాయించిన సీట్లలో బీసీ(ఏ) 7 శాతం, బిసీ(బి) 10 శాతం, బీసీ(సి) 1 శాతం, బీసీ(డి) 7 శాతం, బీసీ(ఈ) 4 శాతం కోటా ఉంటుంది. మొత్తం సీట్లలో బాలికలకు 33.3 శాతం ఉండేలా చూస్తారు. ఇంటర్నెట్లో దరఖాస్తులు ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలు పొందే విద్యార్థులు కచ్చితంగా ఇంటర్నెట్లో http://telanganams.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో పాస్‌పోర్టు సైజ్ఫొటో, డిజిటల్ సంతకం, చిరునామా, ప్రస్తుతం చదువుతున్న వివరాలు, ఆధార్‌కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రూ.50 చెల్లించాలి. ఏప్రిల్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12, మధ్యాహ్నం 2 గంటలకు 4 గంటల వరకు ఉంటుంది. మే 18న పరీక్షా ఫలితాలు విడుదల చేస్తారు. మే 27న ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల అర్హత జాబితా ప్రదర్శిస్తారు. మే 28 నుంచి 30 వరకు ప్రవేశాలు తీసుకుంటారు. -
‘మోడల్’ టీచర్లను నియమించాలి
డిచ్పల్లి : జిల్లాలోని మోడల్ స్కూళ్లల్లో ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డిచ్పల్లి శివారులోని 44వ నెంబరు జాతీయ రహదారిపై డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లి దండ్రులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్యాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఆదరా బాదరగా ఏర్పాటు చేసిందని, కానీ వాటిలో మౌలిక వసతులు ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు లేక విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉపాధ్యాయులు లేక పిల్లలు ఉదయం పాఠశాలకు వచ్చి, ఒకటి రెండు తరగతులు పూర్తయిన తర్వాత ఖాళీగా కూర్చుని సాయంత్రం ఇళ్లకు వెళుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే మోడల్ స్కూళ్లు, కళాశాలల్లో ఉపాధ్యాయులను, లెక్చరర్లను నియమించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రహదారిపై ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై-2 శ్రీధర్‌గౌడ్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులను సముదాయించి రాస్తారోకో విరమింప జేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కార్తీక్, సతీశ్, శ్రీకాంత్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రవి, ఉపసర్పంచ్ గంగాధర్, మోహన్, సత్యప్రసాద్ పాల్గొన్నారు.