breaking news
Mobile phone network
-
సెల్‌ఫోన్ యూజర్స్‌కు అలర్ట్.. పొంచి ఉన్న ‘బ్లూబగ్గింగ్’
సాక్షి, విజయవాడ: ఫోన్లో బ్లూటూత్.. వైఫై, హాట్ స్పాట్ ఎప్పుడూ ఆన్ చేసుకుని ఉంటున్నారా.. అయితే జాగ్రత్త పడండి. సైబర్ నేరగాళ్లు మాటు వేసి ఉంటున్నారు. ఫోన్లోని వ్యక్తిగత సమాచారమంతా దోచేస్తున్నారు. ఆ తర్వాత వేధింపులు, బెదిరింపులతో మానసిక క్షోభకు గురి చేసి.. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి బ్లూబగ్గింగ్ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే బ్లూ బగ్గింగ్ నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు పది మీటర్ల దూరం నుంచే బ్లూటూత్, హాట్‌స్పాట్ ద్వారా ‘పెయిర్’ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఏదో పనిలో ఉండి చూసుకోకుండా ‘ఓకే’ బటన్ క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్ల ఫోన్‌తో మన ఫోన్ కనెక్టవుతుంది. వెంటనే మాల్వేర్తో పాటు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్‌ను ఫోన్లోకి పంపిస్తారు. అక్కడి నుంచి మన ఫోన్ ఆపరేటింగ్ పూర్తిగా వారి చేతిలోకి వెళ్లిపోతుంది. ఫోన్లో బ్లూటూత్ ఆపేసినా.. వారు అప్పటికే పంపించిన ప్రోగ్రామింగ్, మాల్వేర్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. సాధారణంగా వైఫై వినియోగించే వారికి తప్పనిసరిగా పాస్వర్డ్ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో వైఫై ఫ్రీగా లభ్యమవుతోంది. ఫోన్లో వైఫై ఆప్షన్ ఆన్ చేసుకున్న వారికి ఆటోమేటిక్‌గా వైఫై కనెక్ట్ అవుతోంది. ఫ్రీగా వైఫై ఇచ్చే ప్రాంతాల్లో తరచూ బ్లూబగ్గింగ్ సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. క్విక్ సపోర్ట్, టీం వ్యూయర్, ఎనీడెస్క్ తదితర యాప్స్ సాయంతో ఫోన్ ఆపరేటింగ్ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు పసిగడుతుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ముందుగా సొమ్మును దోచేస్తున్నారు. ఫొటోలు, వీడియోలను పూర్తిగా కాపీ చేసుకుని.. వాటిని మారి్ఫంగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి దొరికినంత లాగేస్తున్నారు. మన ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను సైబర్ నేరగాళ్లు పూర్తిగా వారి మొబైల్‌కు మళ్లించుకుంటున్న ఘటనలు కూడా జరిగాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా కేసులు ఇప్పటివరకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో 15 వెలుగు చూశాయని పోలీసులు చెప్పారు. అప్రమత్తంగా ఉండాలి బ్లూ బగ్గింగ్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బ్లూటూత్, వైఫై, హాట్స్పాట్లను అవసరమైనప్పుడే ఆన్ చేసుకోవాలి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించకుండా ఉంటే మంచింది. స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే పెయిర్ రిక్వెస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించొద్దు. – ఎల్.రాజవర్ష, ఎస్ఐ, సైబర్ పోలీస్‌స్టేషన్ -
నోకియాలో ఆల్కాటెల్-లూసెంట్ విలీనం
లండన్: నోకియాలో ఫ్రాన్స్‌కు చెందిన ఆల్కాటెల్-లూసెంట్ కంపెనీ విలీనమైంది. మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన పరికరాలు తయారుచేసే ఆల్కాటెల్ లూసెంట్ కంపెనీని 1,660 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశామని నోకియా పేర్కొంది. ఈ డీల్ వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయని వివరించింది. ఈ విలీనం కారణంగా ఏర్పడే సంస్థను నోకియా కార్పొరేషన్‌గా వ్యవహరిస్తారు. ఈ డీల్‌లో భాగంగా ఒక్కో ఆల్కాటెల్-లూసెంట్ షేర్‌కు 0.55 నోకియా షేర్లు కేటాయిస్తారు. ఈ నోకియా కార్పొరేషన్లో ఆల్కాటెల్ వాటాదారులు వాటా 33.5 శాతంగా, నోకియా వాటాదారుల వాటా 66.5 శాతంగా ఉంటుంది. ఈ నోకియా కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ప్రస్తుత నోకియా చైర్మన్ రిస్టో సీలస్మా, సీఈఓగా రాజీవ్ సూరి వ్యవహరిస్తారు. 1999 తర్వాత టెలికాం రంగంలో ఇదే అతి పెద్ద డీల్. ఆ ఏడాది ఆసెండ్ కమ్యూనికేషన్స్‌ను లూసెంట్ టెక్నాలజీస్ సంస్థ 2,100 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇక 2006లో లూసెంట్‌ను ఆల్కాటెల్ 1,340 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విలీనంతో... మొబైల్ ఫోన్ల నెట్‌వర్క్‌కు సంబంధించిన పరికారలందజేసే అతి పెద్ద సంస్థగా నోకియా కార్పొరేషన్ అవతరిస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఎరిక్సన్, హువాయ్‌లు ఉంటాయి. ఈ రెండు కంపెనీల విలీనం తర్వాత ఏర్పాటయ్యే సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.14 లక్షలుగా ఉంటుందని అంచనా. ఈ విలీనం వల్ల 20 కోట్ల యూరోల వడ్డీ వ్యయాలు ఆదా అవుతాయి. 2019 కల్లా 90 కోట్ల యూరోల నిర్వహణ వ్యయాలు ఆదా అవుతాయి.