త్వరలో మొబైల్ మెడికల్ టీమ్‌లు
గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు
పీహెచ్‌సీల పనితీరుపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ యువరాజ్ వెల్లడి
రావికమతం : వైద్యాధికారుల పోస్టుల భర్తీకి ఎదురు చూడకుండా అందుబాటులో ఉన్న సర్జన్లు, వైద్య నిపుణుల సేవలు పల్లెవాసులకు అందేలా త్వరలో మొబైల్ మెడికల్ టీములను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. బుధవారం ఆయన కొత్తకోట, రావికమతం పీహెచ్‌సీలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. అందుబాటులో ఉన్న వైద్య నిపుణులతో గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించాలని సంకల్పించామన్నారు. ఇందుకోసం అన్ని సౌకర్యాలున్న వాహనం, టెక్నీషియన్లు, సర్జన్లు, అనుభవజ్ఞుల బృందంతో ఈ వాహనం ఒక్కోరోజు ఒక్కో ప్రాంతానికి వస్తుందని చెప్పారు. జిల్లాలో 86 పీహెచ్‌సీలున్నా సరైన వైద్యం అందక ప్రాంతీయ ఆస్పత్రులకు, అక్కడి నుంచి కేజీహెచ్‌కు వస్తున్నారన్నారు.
ఆపరేషన్లు, సర్జరీలు మానేసి జిల్లాలోని వైద్యులు ప్రాథమిక చికిత్సలు చేస్తున్నారన్నారు. ఇకపై వాటికి స్వస్తి పలకాలనే కొత్తగా మొబైల్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులూ ఇకపై పీహెచ్‌సీల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. ఏజెన్సీ కన్నా మైదాన ప్రాంత పీహెచ్‌సీల్లోనే మాతా శిశు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వీటి నివారణకు తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. తొలుత కొత్తకోట పీహెచ్సీ శిథిల భవనంలో కొనసాగడాన్ని చూశారు.
కొత్త భవనం 95 శాతం పనులతో నిలిచి పోయిందని వైద్యాధికారి చెప్పారు. అక్కడి నుంచే డీఎంఅండ్హెచ్ఓతో ఫోన్లో మాట్లాడారు. మూడు రోజుల్లోనే పనులు పూర్తికి హామీ ఇచ్చారు. అనంతరం రావికమతం పీహెచ్‌సీని సందర్శించి మందుల గడువు తేదీని పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్, ప్రసూతి వార్డులను చూశారు. అక్కడ రోగులతో మాట్లాడారు. సబ్‌సెంటర్లు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పనితీరు తెలుసుకున్నారు. ఆయన వెంట కొత్తకోట, రావికమతం వైద్యులు నరేంద్రకుమార్, వాసవి పాల్గొన్నారు.
రోలుగుంట పీహెచ్సీ తనిఖీ..
రోలుగుంట పీహెచ్‌సీని కలెక్టర్ యువరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. రోగుల వార్డును పరిశీలించి వైద్యసేవలపై ఆరా తీశారు. ల్యాబ్‌లో వివిధ పరీక్షల గురించి అడిగారు. జనని సుర క్ష యోజన కింద ప్రభుత్వం ఇచ్చే రూ 1000 ఎంత మందికి ఇచ్చారో అడిగి రికార్డులను సరిపోల్చారు. స్టోర్ రూములో మందులను పరిశీలించారు. వైద్యులు స్థానికంగా ఉండాలని, రోగులకు వైద్య సేవలపై ఫిర్యాదులొస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.