నగ్నత్వం ఫ్యాషన్ అనుకుంటున్నారు
బెంగళూరు ఘటనపై ఎస్పీ నేత అబూ అజ్మీ వివాదాస్పద వ్యాఖ్య
ముంబై/న్యూఢిల్లీ: బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మహిళలపై జరిగిన కీచకకాండపై సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర కమిటీ చీఫ్, ఎమ్మెల్యే అబూ అజ్మీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎంత నగ్నంగా కనిపిస్తే అంత ఫ్యాషన్ అనుకుంటున్నారు..కురచ దుస్తులు ధరిస్తున్నారు. బెల్లం ఉన్న చోటే ఈగలు ముసురుతాయి. అందమైన ముఖంతో సమస్యలొస్తాయి. అబ్బాయిలను, అమ్మాయిలను స్వేచ్ఛగా కలసి తిరగనీయొద్దు.. భారత్లోకి వచ్చిన పడిన పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరిస్తున్నారు. దీన్ని ఆపాలి. అర్ధనగ్నంగా రాత్రి పార్టీల్లో పాల్గొనడం మన సంస్కృతి కాదు’ అని మంగళవారం అన్నారు.
కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బెంగళూరు కీచకానికి పాశ్చాత్య సంస్కృతే కారణమన్నారు. నగరంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో ఇలాంటి వేధింపులు మామూలేనని చెప్పుకొచ్చారు. అబూ అజ్మీ, పరమేశ్వర్ల వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ లలితా కుమారమంగళం మండిపడ్డారు. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ వారికి సమన్లు జారీ చేశామన్నారు.