ఎండిన మిరపకు నష్ట పరిహారం ఇవ్వాలి
► రైతు సంఘం కార్యదర్శి ఏరువ పాపిరెడ్డి
తర్లుపాడు: కరువు వలన ఎండిపోయిన మిరప పంటను నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం కార్యదర్శి ఏరువ పాపిరెడ్డి కోరారు. ఈ నెల 4న గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని చలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మండలంలోని నాయుడుపల్లె, చెన్నారెడ్డిపల్లె, సీతానాగులవరం, తుమ్మలచెరువు, మీర్జాపేట, కారుమానుపల్లె గ్రామాల్లో రైతు సంఘం నాయకులు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మిరప పంట తెగుళ్లతో గణనీయంగా తగ్గటంతో పాటు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు పొలాలను వదలేశారన్నారు. ఎకరాకు 1.50లక్షల వరకు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి వచ్చే సమయంలో ధరలు పడిపోవటంతో రైతులు అప్పుల పాలయ్యారన్నారు. మిర్చి పంట సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎకరాకు 50వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు.
దళారుల మాయజాలంతో పండించిన మిరప పంటకు ధరలు లేవని, క్వింటా 5వేలకు మించి అమ్మటం లేదన్నారు. మార్క్ఫెడ్ ద్వార క్వింటా మిర్చి 10వేల రూపాయలకు కొనుగోలు చేయించాలని కోరారు. వర్షాలు లేక తీవ్ర కరువు ఏర్పడి బోర్లు ఎండిపోయి మిర్చి పంటలు నిలువున వదలి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ఏడాది క్వింటా 15వేలు అమ్మకం చేసినా మిర్చి ఈ ఏడాది 5వేలకు దిగజారిందని, 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామన్న ప్రభుత్వం బడ్జెట్లో దాని ఊసే లేదన్నారు. గిట్టుబాటు ధర కోసం, కరువు వలన ఎండిన మిర్చి, పత్తి పంటలను నమోదు చేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న జరిగే ధర్నా కార్యక్రమంలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తవనం నారాయణరెడ్డి, వెన్నా సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.