breaking news
Minister Satyendra Jain
-
ఢిల్లీలో మ్యాగీపై నిషేధం
15 రోజుల పాటు వేటు వేసిన రాష్ట్ర సర్కారు ♦ నూడుల్స్‌లో సీసం మోతాదు అధికంగా ఉందని పరీక్షల్లో వెల్లడి ♦ మ్యాగీ నూడుల్స్ వినియోగాన్ని నిలిపివేయాలని సైన్యం ఆదేశం ♦ బిగ్‌బజార్, కేంద్రీయ భండార్లలో మ్యాగీ విక్రయాల నిలిపివేత ♦ తెలుగు రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాల్లోనూ నూడుల్స్‌కు పరీక్షలు ♦ తమిళనాడులో నెస్లే పాలపొడిలో బయటపడ్డ సజీవ లార్వా! సాక్షి, న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. వాటి విక్రయాలపై ఢిల్లీ ప్రభుత్వం 15 రోజుల పాటు నిషేధం విధించింది. ఈ ఫాస్ట్ ఫుడ్ (తక్షణ ఆహారం)ను వినియోగించరాదని సైన్యం కూడా బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ సూపర్ మాల్స్ అయిన బిగ్ బజార్, కేంద్రీయ భండార్లు దేశవ్యాప్తంగా గల తమ దుకాణాల్లో వీటి విక్రయాలను నిలిపివేశాయి. ఇతర రాష్ట్రాలు సైతం మ్యాగీ నూడుల్స్ సహా వివిధ రకాల ఫాస్ట్ ఫుడ్లపై నాణ్యతా పరీక్షలకు ఆదేశాలిచ్చాయి. మరోవైపు.. గతంలో ఎన్నడూ లేని విధంగా మ్యాగీ నూడుల్స్ తయారు చేస్తున్న ‘నెస్లే ఇండియా’ సంస్థపై కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆహార భద్రతా ప్రమాణాలను ఆ సంస్థ ఉల్లంఘించిందని ఆరోపించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన బహుళజాతి సంస్థ భారతీయ విభాగమైన నెస్లే ఇండియా సంస్థ తయారు చేసి, పంపిణీ చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తుల్లో ‘2 మినిట్ మ్యాగీ నూడుల్స్’ విస్తృత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నట్లు ఫిర్యాదులు రావటంతో.. ఈ ఉత్పత్తి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్న సినీనటులు అమితాబ్‌బచ్చన్, మాధురీదీక్షిత్, ప్రీతిజింటాలపై కేసులు నమోదు చేయాలని బిహార్ కోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చిన విషయమూ విదితమే. ఈ కేసు విషయంలో చట్ట ప్రకారం సహకరిస్తానని అమితాబ్ చెప్పారు. 13 నమూనాల్లో పదింట అధికంగా సీసం మ్యాగీ నూడుల్స్‌కు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో 13 మాగీ నూడుల్స్ నమూనాలను పరీక్షించగా 10 నమూనాల్లో సీసం మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఢిల్లీ సర్కారు తెలిపింది. ఈ విషయమై నెస్లే ఇండియా ప్రతినిధులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ పేర్కొన్నారు. దీంతో.. రాష్ట్రంలో వీటి విక్రయాలపై 15 రోజులు నిషేధం విధించినట్లు తెలిపారు. నగరంలో ప్రస్తతం ఉన్న మ్యాగీ నూడుల్స్ స్టాకును 15 రోజుల్లో వెనక్కి తీసుకుని.. కొత్త స్టాకును అందుబాటులోకి తేవాలని నెస్లే ఇండియాను ఆదేశించామన్నారు. కొత్త స్టాకును కూడా పరీక్షించి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విక్రయించటానికి అనుమతిస్తామని చెప్పారు. ఆహార కల్తీ చట్టంలోని నిబంధనల కింద నెస్లే ఇండియా సంస్థపై కోర్టులో కేసు దాఖలు చేస్తామన్నారు. ఆహార కల్తీకి పాల్పడే వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని కూడా సమీక్షించి మార్పులు చేస్తామని తెలిపారు. అలాగే.. ఇతర సంస్థలు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్న నూడుల్స్పైనా పరీక్షలకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోనూ నూడుల్స్‌కు పరీక్షలు మరోవైపు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, హరియాణా తదితర రాష్ట్రాలు కూడా మాగీ నూడుల్స్ నమూనాలను సేకరించి ఆహార భద్రతా ప్రమాణాల పరీక్షలు చేపట్టాయి. పశ్చిమబెంగాల్లో కురుకురే, లేస్ వంటి ప్రజాదరణ పొందిన చిరుతిళ్ల నమూనాలనూ పరీక్షిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి సాధన్ పాండే తెలిపారు. అయితే.. మహారాష్ట్ర, కేరళ, గోవా ప్రభుత్వాలు మాత్రం తాము నిర్వహించిన పరీక్షల్లో ప్రతికూల నివేదికలేవీ రాలేదని పేర్కొనటం నెస్లే ఇండియాకు కాస్త ఊరటనిస్తోంది. ఇదిలావుంటే.. నెస్లే ఇండియా తయారు చేసే పాల పొడి ఉత్పత్తిలో సజీవ లార్వా ఉందని, ఇది వినియోగించటం ప్రమాదకరమని పరీక్షల్లో ప్రాథమికంగా తేలిందని తమిళనాడు అధికారులు అనధికారికంగా తెలిపారు. సరైన అవగాహన లేదు.. ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముద్రించే సమాచారం గురించి వినియోగదారులకు సరైన అవగాహన లేదని, ప్యాకెట్లలో ఉన్న ఆహారం గురించి కచ్చితమైన వివరాలు తెలుసుకోవడం వారి హక్కు అని బుధవారం ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ)’ సంస్థ పేర్కొంది. దేశంలో సెలబ్రిటీల వ్యాపార ప్రకటనలను నియంత్రించేందుకు చట్టపరంగా నిబంధనలు లేవని, అలాంటి ప్రకటనలను కచ్చితంగా నియంత్రించేందుకు నిబంధనలు రూపొందించాలని సూచించింది. వివాదం ఎలా మొదలైంది..? మ్యాగీ.. రెండు నిమిషాల్లోనే నూడుల్స్! దేశంలోనే తొలి ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్ ఇది. అంతర్జాతీయ కంపెనీ నెస్లే 1947 నుంచే అందిస్తున్న ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలనూ బాగా ఆకట్టుకుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో విక్రయిస్తున్న మ్యాగీ నూడుల్స్‌లో సీసం(లెడ్), మోనోసోడియం గ్లుటామేట్‌లు అనుమతించిన మోతాదు కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గతనెలలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించడంతో వివాదం మొదలైంది. ఆహార పదార్థాల్లో సీసం 0.01 పీపీఎం మాత్రమే ఉండాలి. కానీ లక్నోలో స్వాధీనం చేసుకున్న మ్యాగీ శాంపిళ్లలో ఏకంగా 17 పీపీఎంల సీసం ఉన్నట్లు తేలింది. దీంతో దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇందులో మోతాదుకు మించి ఉన్నాయంటున్న లెడ్(సీసం), మోనోసోడియం గ్లుటామేట్(ఎంఎస్‌జీ)ల వల్ల మన ఆరోగ్యానికి ఎంత హానికరం అని పరిశీలిస్తే... మోనోసోడియం గ్లుటామేట్ (ఎంఎస్‌జీ) గ్లుటామిక్ యాసిడ్, దాని గ్లుటామేట్‌లు(అయాన్లు, లవణాలు) కలిపితే మోనోసోడియం గ్లుటామేట్ ఏర్పడుతుంది. ఆహార పదార్థాల రుచిని పెంచేందుకు దీనిని కలుపుతారు. ఇది మోతాదుకు మించితే.. ♦ తలనొప్పి, చికాకు, అసౌకర్యం కలుగుతాయి. ♦ కొంతమందిలో ‘చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్’ వస్తుంది. ♦ ఈ సిండ్రోమ్ వల్ల తలపోటు, వెన్ను, నొప్పులు, మగత కలుగుతాయి. ♦ ఛాతీలో మంట, దవడలు బిగుసుకుపోవడం, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. సీసం(లెడ్) ♦ ప్రాథమికంగా ఇది లోహం. విషపూరితం. ♦ గాలి, నీరు, ఆహారం, అనేక రకాలుగా మనుషుల్లోకి చేరుతుంది. ♦ ఆహార పదార్థాల్లోకి నీరు, పదార్థాలు, ప్యాకేజింగ్, ఇతర మార్గాల్లో వస్తుంది. ఇది మోతాదుకు మించితే.. ♦ కడుపు నొప్పి, తలనొప్పి వస్తాయి. ♦ గందరగోళం, చికాకు కలుగుతాయి. ♦ రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ♦ మోతాదు మరీ మించితే.. మూర్ఛ. కోమాలోకి వెళతారు. మరణమూ సంభవించవచ్చు. -
డిస్కంలకు బకాయిలు చెల్లించం
- మంత్రి సత్యేంద్ర జైన్ - బకాయిలను సబ్సిడీలతో సరిపెట్టాలని నిర్ణయం - విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకూడదని ఆదేశం న్యూఢిల్లీ: పవర్ సబ్సీడీలో భాగంగా డిస్కంలకు డబ్బులు చెల్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి సరఫరాలో డిస్కంలు చెల్లించాల్సిన మొత్తంతోనే సరిపెట్టాలని యోచిస్తోంది. బీఎస్‌ఈఎస్‌కు రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్), బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్‌లు చెల్లించాల్సిన బకాయిలను.. ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సీడీలతో సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. రెండు డిస్కంలు ఢిల్లీ ట్రాన్స్‌కో లివిటెడ్‌కు సుమారు రూ. 6 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీకి ట్రాన్స్‌కో తిక్రీకాలన్ ప్రాంత ంలో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన భూగర్భ సరఫరా వ్యవస్థ లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్‌లు చెల్లించాల్సిన బకాయిలపై సంప్రదించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగడం, తక్కువ మొత్తాలు వసూలు చేయడంతో బీఎస్ఈఎస్ రూ. 10 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన తెలిపారు. నెలలో 400 యూనిట్ల విద్యుత్ వినియోగంపై ఢిల్లీ ప్రభుత్వం 50 శాతం సబ్సీడీ ఇస్తుందని హామీనిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వేసవిలో విద్యుత్ కోతలపై డిస్కంలను మంత్రి హెచ్చరించారు. డిస్కంలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యుత్ సర ఫరాకు ఎలాంటి అంతరాయం ఉండకూడదని ఆయన చెప్పారు. దీనిని సమర్థిస్తూ డిస్కంలు లిఖితపూర్వకంగా సెక్రటరీకి తెలిపాయని పేర్కొన్నారు. ఢిల్లీ ట్రాన్స్‌కో తిక్రీకాలన్లో 400కేవీ సబ్‌స్టేషన్‌తో కలిసే 200కేవీ సబ్‌స్టేషన్‌ను కలపడానికి పీరాఘరీలో కొత్తగా 200కేవీ సామర్థ్యం గల భూగర్భ స్టేషన్‌ను నిర్మించింది. -
'ఆప్' కార్యక్రమాన్ని బహిష్కరించిన జర్నలిస్టులు
న్యూఢిల్లీ: సచివాలయంలోకి అనుమతించకపోవడంతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఢిల్లీ జర్నలిస్టులు బహిష్కరించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రెస్ కాన్పరెన్స్‌ను బాయ్‌కాట్ చేశారు. సాధారణంగా సచివాలయంలోకి జర్నలిస్టులను అనుతిస్తారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త నిబంధనలు పెట్టింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా గదిలో వేచి ఉండాలని సచివాలయ అధికారులు తెలపడంతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. సత్యేంద్ర జైన్ ప్రెస్‌మీట్‌ను కవర్ చేసేందుకు జర్నలిస్టులు నిరాకరించారు. ప్రెస్‌మీట్‌కు సత్యేంద్ర రెండున్నర గంటల ఆలస్యంగా రావడంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సచివాలయంలోకి అనుమతించకపోవడంపై మంత్రిని నిలదీశారు. అయితే తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేసేందుకు పాటు పడుతోందని, ఏమీ దాచి పెట్టడం లేదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనీష్ సిసోడియా.. ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ విలేకరులతో అన్నారు.