ట్రంప్ సైలెంట్ బాంబ్! అంతకు మించి..
వాషింగ్టన్: ఒకవైపు ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్(Trump Tariffs)ల గురించి చర్చించుకుంటున్న వేళ.. అమెరికా అనూహ్య చర్యలకు దిగింది. గప్‌చుప్‌గా ఆసియా రీజియన్‌లో భారీగా సైన్య మోహరింపునకు దిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశమైంది.బీ-2 స్టెల్త్ బాంబర్లకు ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధవిమానాలుగా పేరుంది. అమెరికాలో అలాంటివి 20 ఉండగా.. వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర రీజియన్‌లోని యూఎస్-బ్రిటన్ మిలిటరీ బేస్ డియాగో గార్సియా రన్‌వేపై మోహరింపజేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాడార్ సిగ్నల్స్ కూడా అందకుండా.. షెల్టర్‌లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఇండో ఫసిఫిక్ రీజియన్‌లోనూ యుద్ధవిమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక విమాన వాహక నౌకతోనే(అరేబియా సముద్రంలో USS Harry S. Truman) గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 3కి పెంచే యోచనలో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్‌లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. అయితే.. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.యూఎస్ఎస్ నిమిట్జ్హఠాత్తుగా ఎందుకంటే..ఆయా రీజియన్లలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. వాటికి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ.. మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందన్నది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఇరాన్, యెమెన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.హెచ్చరికలతో మొదలైనప్పటికీ..గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌ను, మద్ధతుగా నిలిచిన ఇరాన్‌ను హెచ్చరించారాయన. అలాగే.. అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ వస్తున్నది చూస్తున్నాం. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు, ఇరాన్ కోసమే మోహరింపజేసి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా యెమెన్‌పై దాడికి ఇది చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పనిలో పనిగా ఇరాన్ మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ వద్ద యూఎస్ఎస్ నిమిట్జ్ క్యారీయర్‌ను, మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ వాహక నౌకను మోహరింపజేయడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్ ఆలోచన అంతకు మించే ఉందన్న చర్చ నడుస్తోంది.