breaking news
Michael Adams
-
హరికృష్ణకు రెండో గెలుపు
న్యూఢిల్లీ: షెన్జెన్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయాన్ని సాధించాడు. చైనాలో గురువారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 67 ఎత్తుల్లో మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. ఈ టోర్నీలో హరికృష్ణ సాధించిన రెండు విజయాలూ ఆడమ్స్పైనే రావడం విశేషం. ఏడో రౌండ్ తర్వాత హరికృష్ణ 3.5 పాయింట్లతో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సిరిల్ వర్మ
హనోయ్ (వియత్నాం): వియత్నాం ఇంటర్నేషనల్ చాలెంజ్ కప్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 12వ సీడ్ సిరిల్ వర్మ 21–15, 22–24, 21–7తో లె డక్ ఫాట్ (వియత్నాం)పై కష్టపడి గెలిచాడు. అంతకుముందు తొలి రౌండ్లో సిరిల్ 21–8, 21–10 జాస్పర్ వూన్ చాయ్ యు (బ్రూనై)పై విజయం సాధించాడు. భారత్‌కే చెందిన బోధిత్ జోషి, అభిషేక్ యెలెగార్ రెండో రౌండ్లో ఓడిపోగా... చిరాగ్ సేన్ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–మనీషా ద్వయం 21–23, 8–21తో వాంగ్ సిజి–నీ బోవెన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.