breaking news
MGR legacy
-
మనసులో మాట బయటపెట్టిన జయ మేనకోడలు
రాజకీయాల్లోకి వస్తానని స్పష్టీకరణ త్వరలో సొంతంగా పార్టీ పెడుతున్నట్టు వెల్లడి చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు జే. దీపాకుమార్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే తాను సొంతంగా పార్టీ పెడుతున్నానని, అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు తనకు అండగా ఉంటారనే విశ్వాసం ఉందని ఆమె పేర్కొన్నారు. దివంగత నేత ఎంజీఆర్ వారసత్వం తనదేనని ఆమె ఉద్ఘాటించారు. శనివారం తన నివాసం ఎదుట పెద్ద ఎత్తున గుమిగూడిన మద్దతుదారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. జయలలలిత వారసురాలు దీపాకుమారేనంటూ తమిళనాడు అంతటా ఆమె మద్దతుదారులు కటౌట్లు, బ్యానర్లతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన క్యాడర్ శాంతియుతంగా వేచి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల 17న అన్నాడీఎంకే స్థాపకుడు ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా తామంతా కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిద్దామని మద్దతుదారులకు సూచించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 'మేం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తాం' అని ఆమె అన్నారు. ప్రతిరోజూ వేలాదిమంది దీప ఇంటిముందు గుడిగూడి ఆమె నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నారు. తనను చూసేందుకు వచ్చిన వారిని జయలలిత తరహాలో రెండు ఆకుల ముద్రతో దీప పలుకరిస్తున్నారు. జయ వారసత్వం దీపకే దక్కాలంటూ ఆమె మద్దతుదారులు రాష్ట్రమంతాట కటౌట్లు, బ్యానర్లు కడుతున్నారు. దీప జయలలితకు పుష్ఫగుచ్ఛం ఇస్తున్నట్టు గ్రాఫిక్ ఫొటోలు సృష్టించి మరీ కటౌట్లు దర్శనమిస్తుండటం గమనార్హం. -
మనసులో మాట బయటపెట్టిన దీప