breaking news
MGR birth centenary
-
దీప అరంగేట్రం
► ఇక దీప రాష్ట్రవ్యాప్త పర్యటన ► అమ్మ జయంతిలోగా అభిప్రాయ సేకరణ ► వచ్చే నెల 24న కీలక ప్రకటన ► అమ్మ మరణంపై అనుమానం లేదు ► ఎన్నికల్లో పోటీ ఖాయం ► ఎక్కడనేది తర్వాత ప్రకటిస్తా ఎంజీఆర్ శతజయంతి సాక్షిగా మంగళవారం నుంచి తన రాజకీయ అరంగేట్రం జరిగిపోయిందని జయలలిత అన్నకుమార్తె దీప ప్రకటించారు. అసలైన రాజకీయ జీవితం అమ్మ జయంతి రోజైన ఫిబ్రవరి 24వ తేదీన పూర్తిస్థాయిలో ప్రారంభం అవుతుందని ఆమె తెలిపారు. అన్నాడీఎంకే కార్యకర్తల కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చినట్టు స్పష్టం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నైః చెన్నై టీ.నగర్‌లోని ఇంట్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీప మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావడం ద్వారా తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని తెలిపారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని తన రాజకీయ పయనాన్ని ప్రారంభిస్తున్నానని అన్నారు. కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించేందుకు తాను ముహూర్తం పెట్టుకున్న అమ్మ జయంతికి 35 రోజులు గడువు ఉంది. ఈ కాలంలో రాష్ట్రమంతటా పర్యటించి ప్రజలను కలుసుకుంటానని తెలిపారు. అదేరోజున తన రాజకీయ ప్రణాళికను ఆవిష్కరిస్తానని తెలిపారు. నేడు రాజకీయ ప్రవేశంతో తొలి దశ పూర్తికాగా, ఫిబ్రవరి 24న మలిదశ ప్రారంభమై వేగంగా ముందుకు సాగుతుందని చెప్పారు. తన రాజకీయ అరంగేట్రం గురించి వస్తున్న అనుమానాలు ప్రస్తుత ప్రకటనతో పటాపంచలు అయినట్టేనని అన్నారు. 1972లో ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించి అధికారంలోకి తీసుకురాగా, ఆ తరువాత అదేస్థాయిలో జయలలిత పార్టీని ముందుకు నడిపిం చారని చెప్పారు. జయ మరణం తరువాత పార్టీ కార్యకర్తలు తనను రాజకీయాల్లో ఆహ్వానించారని, అయితే తనకు వ్యక్తిగత జీవితం, బాధ్యతలు ఉన్నందున వెంటనే జవాబు చెప్పలేక పోయానని అన్నారు. తనకు జన్మభూమి తమిళనాడు, మాతృభాష తమిళం రెండు కళ్లుగా భావించి రాజకీయాల్లో కొనసాగుతానని తెలిపారు. జయలలిత చూపిన మార్గంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతానని చెప్పారు. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీల నుంచి తనను ఎవ్వరూ సంప్రదించలేదని, తన ఇంటికి వచ్చే కార్యకర్తలను మాత్రమే కలుస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో తనకు గాడ్‌ఫాదర్ లేరు, ఏ పార్టీ నేతలు తనను రెచ్చగొట్టడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత స్థానంలో మరెవ్వరిని ఊహించలేమన్నారు. జయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన సోదరుడు దీపక్ అక్కడే ఉన్నందున అత్త మరణంలో తనకు సందేహాలు లేవని అన్నారు. జయ ఆస్తుల కోసం తాను ఆశపడడం లేదని, ఆమె వినియోగించిన పెన్ ఇస్తే చాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమ్మ మరణించిన నాటి నుంచి తన ఇంటికి వచ్చి ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంజీర్, జయలలితకు నివాళి: తన రాజకీయ అరంగేట్ర ప్రకటనకు ముందుగా ఎంజీఆర్, జయలలితలకు దీప నివాళులర్పించారు. తన ఇంటికి సమీపంలోని ఎంజీఆర్ స్మారక భవనం, అన్నాశాలైలోని ఎంజీఆర్ విగ్రహం, మెరీనాబీచ్‌లోని ఎంజీఆర్, జయలలిత సమాధి వద్ద ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. మంగళవారం ఉదయం 7 గంటలకు చెన్నైలోని ఎంజీఆర్ స్మారక భవనానికి తాళం వేసి ఉండడంతో ఆమె అభిమానులు ఆ తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లారు. వారి వెంట దీప కూడా లోపలికి వెళ్లి అక్కడి ఎంజీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. దీప వస్తున్నట్టుగా ముందస్తు సమాచారం ఉన్నా తగిన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో ఆమె అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ మెరీనా బీచ్ రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. దీప ఇంట జనసందోహం: దీప తొలిసారిగా రాజకీయ ప్రకటన చేస్తున్నారని ప్రచారం జరగడంతో మంగళవారం ఆమె ఇంటి పరిసరాలు జనంతో కిటకిటలాడాయి. దీపకు అనుకూలంగా నినాదాలు, డ్రమ్స్, బాణాసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. మెరీనాబీచ్ వద్దనున్న సమాధుల వద్ద అన్నాడీఎంకే మహిళా కార్యకర్తలు నృత్యాలు చేస్తూ దీపకు స్వాగతం పలికారు. దీపను చూడాలని పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహం చూపారు. దీపకు స్వాగతం చెప్పిన వారి చేతుల్లో అన్నాడీఎంకే పతాకాన్ని పోలినట్లుగా మూడు రకాల పతాకాలు ఉండడం విశేషం. జనాన్ని అదుపుచేసేందుకు అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. దీంతో దీప తన ఇంటి ముందు ప్రయివేటు సెక్యూరిటీని పెట్టాల్సి వచ్చింది. నిరుత్సాహపరిచిన దీప ప్రకటన: జయలలిత మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలన బిందువుగా మారిన దీప ఈ నెల 17న చేయబోయే రాజకీయ ప్రకటన ఏ విధంగా ఉంటుందో అని ఉత్కంఠతో ఎదురుచూసిన వారిని నిరుత్సాహపరిచింది. తన ఇంటికి వచ్చేవారితో నెలరోజులుగా చెబుతున్న మాటలనే మీడియా ముందు ఉద్ఘాటించారు. కొత్త పార్టీని పెట్టడమా, మరేదైనా పార్టీలో చేరడమా అనేది స్పష్టం చేయకుండా ప్రజాభిప్రాయ సేకరణకై రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ఎందుకీ జాప్యమని మీడియా ప్రశ్నించడంతో ఇందులో జాప్యమేమీ లేదని బదులిచ్చారు. తన రాజకీయ ప్రవేశాన్ని ఖరారు చేయడం కోసమే మీడియా ముందుకు వచ్చానని సమర్ధించుకున్నారు. శశికళ గురించి మీడియా ప్రతినిధులు అనేక ప్రశ్నలు సంధించినా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. సీఎం పన్నీర్‌సెల్వం పాలన బావుందని కితాబివ్వడం మరింత విశేషం. ఎన్నికల్లో పోటీ చేసేది ఖాయమని ప్రకటించడం మాత్రమే ప్రత్యేకంగా పరిగణించాల్సిన అంశం. -
17న దీప అరంగేట్రం
-
17న దీప అరంగేట్రం
► రాజకీయ ప్రవేశంపై ముమ్మరంగా అభిప్రాయసేకరణ ►పురట్చిమలర్ (విప్లవ పుష్పం) దీపగా ప్రచారం ►ఫిబ్రవరి 24న సేలంలో దీప పేరవై మహానాడు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనా డు రాజకీయ వినీలాకాశంలో మరో నేత త్వరలో మెరవనుంది. పురట్చిమలర్ దీప (విప్లవ పుష్పం) అనే నామకరణం కూడా జరిగిపోయింది. ఈనెల 17వ తేదీన ఎంజీఆర్ శత జయంతిరోజున అధికారికంగా ప్రకటించనున్నట్లు దీప సోమవారం తెలియజేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి గా శశికళ ఎంపికను ససేమిరా అంటున్న పార్టీ శ్రేణులన్నీ దీప ఇంటి బాటపడుతున్నాయి. చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి 15 రోజులుగా తండోపతండాలుగా కార్యకర్తలు వస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు దీప పలువురు రాజకీయపెద్దలను, శ్రేయోభిలాషులను కలుసుకుంటున్నారు. దీప ఇంట్లో లేని సమయాల్లో ఆమె భర్త మాధవన్, సాయంత్రం వేళల్లో దీప ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇంటి వద్ద ఒక రిజిస్టర్‌ను అందుబాటులో పెట్టి తన కోసం వచ్చేవారి పేరు, చిరునామా, సెల్‌ఫోన్ నంబరుతోపాటు అభిప్రాయాలను నమోదు చేసేందుకు ఏర్పాటు చేశారు. చెన్నై టీనగర్‌లోని ఆటో స్టాండ్ వారు దీప చిత్రంతో కూడిన స్టిక్కర్లను అంటించుకుని మద్దతు తెలిపారు. మరో విప్లవం: అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ ను పురట్చితలైవర్ (విప్లవనాయకుడు), దివంగత జయలలితను పురట్చితలైవి(విప్లవనాయకి) అని తమిళనాడు ప్రజలు పిలుచుకుంటారు. ఇదే కోవలో దీపకు ‘విప్లవమలర్’(విప్లవ పుష్పం) అని పిలుచుకోవడం ప్రారంభించారు. విప్లవమలర్ దీప, కాబోయే ముఖ్యమంత్రి పేరుతో క్యాలెండర్లు, స్టిక్కర్లు చలామణిలోకి వచ్చేశాయి. 17న ముహూర్తం: దీప ఇంటికి వస్తున్న ప్రజానీకం ప్రతిరోజూ అడిగేది ఒకటే ప్రశ్న. ‘రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? ఈ ప్రశ్నకు సోమవారం దీప బదులిచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల శుభసమయాన ఈనెల 17న తన రాజకీప్రవేశంపై ప్రకటన చేస్తానని తెలిపారు. అమ్మ పేరు, ప్రతిష్టలు నిలబెట్టేలా అందరూ ఆశిస్తున్నట్లే తన నిర్ణయం ఉంటుంది, తనపై అభిమానంతో తరలివచ్చేవారి కోసం పనిచేస్తానని ఆమె అన్నారు. 17వ తేదీ నుంచి తన రాజకీయ పయనం కొనసాగుతుందని తెలిపారు. వచ్చే నెల 24న దీపా పేరవై మహానాడు: జయలలిత జన్మదినమైన ఫిబ్రవరి 24వ తేదీన సేలంలో జయలలిత దీపాపేరవై మహానాడు నిర్వహించి సభ్యత్వ నమోదు వివరాలను వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పేరవై రాష్ట్ర కన్వీనర్ జీఆర్.రామచంద్రన్ మాట్లాడుతూ, ఇంతవరకు 28 జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోందని అన్నారు.