breaking news
Merchant suicide
-
ప్రాణం తీసిన రియల్ వ్యాపారం
సిరిసిల్లటౌన్: ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మోసగించారని బీజేపీ దళిత మోర్చా మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజుపై అభియోగాలు వెల్లువెత్తాయి. సిరిసిల్లకు చెందిన ఎనగందులు వెంకటేశం (56) అలియాస్ ‘భారతీయు డు’.. నాగరాజు ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ నుంచి మానకొండూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గడ్డం నాగరాజు స్వస్థలం సిరిసిల్ల. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశంకు భూమి అమ్మకానికి ఒప్పుకున్నాడు. నాగరాజు రూ.45 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఏడాది గడిచినా రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. దీనితో శనివారం ఉదయం వెంకటేశం.. నాగరాజు ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. అతని ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజును పోలీసులు అరెస్టు చేయాలంటూ.. శవంతో బంధువులు ధర్నా చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్ వచ్చి బలవంతంగా ఆందోళన విరమింపజేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
నోట్ల రద్దుతో గిరాకీ లేక వ్యాపారి ఆత్మహత్య
మానవపాడు: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కిరాణ దుకాణానికి గిరాకీ లేక, అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడుకు చెందిన జయకృష్ణయ్య శెట్టి (39) సొంత గ్రామం కర్నూల్ జిల్లా వెల్దూర్తి మండలం రామళ్లకోట. 14 ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమ్తితం మానవపాడు గ్రామానికి వచ్చారు. స్థానిక ఎస్సీకాలనీలో కిరాణం షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. పెద్దనోట్ల రద్దుతో కిరాణ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. షాపుపై చేసిన అప్పులు అధికం కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం భార్య లక్ష్మీదేవి తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో జయకృష్ణయ్యశెట్టి మంగళవారం రాత్రి ఇంట్లోనే చీరతో ఉరివేసుకున్నాడు. బుధవారం దుకాణానికి వెళ్లిన స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఏఎస్ఐ రామచందర్‌జీ చేరుకొని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. రూ.రెండు లక్షల వరకు అప్పులు ఉన్నాయని, నెలరోజులుగా కిరాణదుకాణానికి గిరాకీ తగ్గిందని, ఎలా బతకాలి... పిల్లలను ఎలా చదవించుకోవాలం టూ పదేపదే చెప్పేవాడని భార్య లక్ష్మీదేవి రోదిస్తూ చెప్పింది.