breaking news
memon hanged
-
ఉరి అమలు ఇలా
-
యాకూబ్ వీలునామా రాయలేదు
యాకూబ్ మెమన్ ఎలాంటి వీలునామానూ రాయలేదని ఆయన న్యాయవాది అనిల్ గెదామ్ తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి కానీ, రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్ ద్వారా కానీ తనకు ఏదో ఊరట లభిస్తుందని యాకూబ్ ఆశించినట్లు చెప్పారు. అందుకే వీలునామా రాయలేదని అన్నారు. మరణశిక్ష అమలు చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు కోరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. జైలు వద్ద పటిష్ట భద్రత యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన సన్నాహాలను అదనపు డీజీపీ (జైళ్లు) మీరా బోర్వాంకర్ పర్యవేక్షించారు. ఆమెకు డీఐజీ(జైళ్లు) రాజేంద్ర దామ్నె, జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి సహకరించారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పుణేలోని ఎరవాడ జైల్లో ఉరితీసిన సమయంలో కూడా యోగేశ్ దేశాయి అక్కడే విధుల్లో ఉన్నారు. జైలు భద్రతను పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. యాకూబ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చగానే బుధవారం మధ్యాహ్నం నాగ్‌పూర్ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ముంబై పోలీసు విభాగానికి చెందిన సుశిక్షిత ‘క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ)’ను రంగంలోకి దింపారు. యాకూబ్‌ను ఉంచిన సెల్ వద్ద కూడా పహారా బాధ్యతలను ఈ టీమ్‌కే అప్పగించారు. జైలు పరిసరాల్లో జనం గుమిగూడకుండా 144 సెక్షన్‌ను విధించారు. ఉరిఅనంతరం, మెమన్ మృతదేహాన్ని జైళ్లోనే ఖననం చేస్తారా? లేక బంధువులకు అప్పగిస్తారా? అనే విషయంపై జైలు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ఒకవేళ, మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలని నిర్ణయిస్తే.. పోస్ట్‌మార్టమ్ పూర్తిచేసి యాకూబ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగిస్తారు. -
ఉరి అమలు ఇలా
జైలు మాన్యువల్ ప్రకారం.. యాకూబ్ మెమన్ను గురువారం వేకుజామున నిద్ర లేపారు. స్నానాదికాలు పూర్తయ్యాక తేలిగ్గా ఉండే ఆహారం అందించారు. తర్వాత ప్రార్థన చేసుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఇచ్చారు. మరణశిక్ష అమలు చేసే ముందు వైద్యులు మెమన్ను పరీక్షించి, తర్వాత ఉరికంబం వద్దకు తీసుకెళ్లారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం దేశ్‌పాండే టాడా కోర్టు ఉత్తర్వుల్లోని ఉరిశిక్ష అమలు భాగాన్ని మెమన్‌కు చదివి వినిపించారు. మేజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు రాగానే తలారి తన చేతిలో ఉన్న లివర్‌ను లాగి, ఉరిశిక్ష అమలు చేశాడు. అరగంట పాటు ఆ శరీరం అలాగే ఉరికంబంపై వేలాడుతూ ఉండాలని జైలు మాన్యువల్ స్పష్టం చేస్తోంది. ఆ తరువాత వైద్యుడు పరీక్షించి, చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఆ తరువాత పోస్ట్‌మార్టం ప్రక్రియ ఉంటుంది. ఉరి అమలు చేసే ముందు, మెమన్ బరువును ఉరికంబం, ఉరితాడు తట్టుకోగలదా? లేదా? అనే విషయాన్ని పరీక్షించారు. మెమన్ బరువుకు ఒకటిన్నర బరువున్న వస్తువుతో ప్రయోగం చేసి ఆ విషయాన్ని నిర్ధారించారు. ఎరవాడ జైల్లో అఫ్జల్ కసబ్‌ను ఉరితీసిన బృందాన్ని మెమన్ ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు నాగపూర్ జైలుకు రప్పించారు. పదేళ్లలో నాలుగోది యాకుబ్ మెమన్ ఉరితీతతో కలిపి భారత్‌లో గత పదేళ్లలో నాలుగు ఉరిశిక్షలు మాత్రమే అమలయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2004-2013 మధ్య దేశంలోని కోర్టులు ఏకంగా 1,303 మందికి మరణశిక్షలు విధించాయి. వీరిలో ముగ్గురే ఉరికంబమెక్కారు. ఓ టీనేజీ అమ్మాయిని రేప్ చేసి చంపిన వాచ్‌మన్ ధనంజయ్ ఛటర్జీని 2004 ఆగస్టు14న బెంగాల్‌లోని అలిపోర్ జైలులో ఉరితీశారు. 2008 ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ కసాయి కసబ్ ను 2012 నవంబరు 12న పుణే యెరవాడ జైల్లో ఉరితీశారు. 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడింది)ను తీహార్ జైలులో ఉరి తీశారు. గత పదేళ్లలో ఉరికంబమెక్కిన వారిలో యాకుబ్ నాలుగోవాడు కానున్నాడు. ఈ పదేళ్ల కాలంలో 3,751 ఉరిశిక్షలను వివిధ కోర్టులు జీవితఖైదుగా మార్చాయి.