breaking news
Medhomadhanam
-
కార్పొరేషన్ ‘హస్త’గతమెలా...
ఖమ్మం: జిల్లాలో కీలకమైన ఖమ్మం కార్పొరేషన్ ఎలా ‘హస్త’గతం చేసుకోవాలన్న అంశంపై, పట్టణ ప్రాంతాల్లో పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా నాయకులతో ఏఐసీసీ, టీపీసీసీ నాయకులు ఆదివారం హైదరాబాదులో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆదివారం హైదరాబాద్‌లో మేథోమధనం కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ సెక్రటరీ రామచంద్ర కుంధియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎస్సీ-ఎస్టీ కమిషన్ సభ్యుడు కొప్పుల రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇన్చార్జీలు శీలంశెట్టి వీరభద్రం, ఐతం సత్యం, శ్రీనివాస్‌రెడ్డి,వీవీ అప్పారావు, పరుచూరి మురళి, ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మండల-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాలు, వివిధ రంగాల ప్రజలు, సామాజిక వర్గాల వారు పార్టీకి ఎందుకు దూరమయ్యారు...? వారిని ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి..? తదితరాంశాలపై ఈ సమావేశం చర్చించింది. త్వరలో ఎన్నికలు జరిగే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో గెలుపుఐ చర్చించింది. నలుగురు ఎమ్మెల్యేలు కమిటీగా ఏర్పడి, కార్పేరేషన్ ‘చెయ్యి’ జారకుండా చూడాలని అధిష్టానం చెప్పినట్టు తెలిసింది. జిల్లా నాయకులు మాట్లాడుతూ... గత నాలుగు నెలలుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కొన్నేళ్లుగా నగర అధ్యక్షుడు లేకపోవడంతో పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నట్టుగా చెప్పినట్టు తెలిసింది. ఏఐసీసీ సభ్యులు సమాధానమిస్తూ.. సెప్టెంబర్ మొదటి వారంలో రామచంద్ర కుంధియాను జిల్లాకు పంపిస్తామని, ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని చెప్పినట్టు సమాచారం. జిల్లాకు సంబంధించిన అనేక విషయాలపై నేటి సమావేశంలో చర్చ జరిగే అవకాశమున్నట్టు తెలిసింది. -
లక్ష వరకూ రుణమాఫీ చేస్తాం: కేసీఆర్
-
లక్ష వరకూ రుణమాఫీ చేస్తాం: కేసీఆర్
హైదరాబాద్ : నవ తెలంగాణ నిర్మాణం వైపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన కసరత్తును ముమ్మరం చేశారు. కొత్త రాష్ట్రంలో సరికొత్త పాలనకు ప్రణాళికలు, చట్టాల రూపకల్పన లక్ష్యంగా మంత్రులు, కార్యదర్శులు, అన్ని శాఖల అధిపతులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఆయన సోమవారం భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన మేథోమథనంలో కేసీఆర్ నవ తెలంగాణ నిర్మాణానికి అనుసరించాల్సిన విధి విధానాలపై అధికారులకు నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు. కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటామని, రూ.లక్ష వరకూ రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానం హైదరాబాద్ నుంచి కాదని, గ్రామస్థాయి నుంచి రావాలన్నారు. వందల కోట్ల ప్రజాధనం ఎక్కడకి పోతుందో తేలాలన్నారు. ప్రబుత్వ పథకాల అమలులో రూపాయి కూడా దుర్వినియోగం కారాదని కేసీఆర్ సూచించారు. త్వరలోనే సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యే వరకూ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రజా ప్రతినిధుల శిక్షణా తరగతుల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమని ఆయన చెప్పారు. నెల రోజులుగా ప్రతిశాఖపై సమీక్ష జరిపామని, శాఖలవారీ సమీక్షలతో పూర్తి స్థాయి అవగాహన వచ్చినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త పంథాతో ముందుకు వెళతామని తెలిపారు. తెలంగాణలో కుటుంబాలకు మించిన రేషన్ కార్డులు ఉన్నాయని, 22 లక్షల పైగా అదనపు కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పుడున్న చట్టాలు ఉమ్మడి రాష్ట్రం కోసం చేసినవని అన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్లతో ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో అవకతవకలకు పాల్పడితే ఎంతటి వారిపైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చిత్తశుద్ధితో నవ తెలంగాణ నిర్మించుకుందామని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.