భారత్‌లో షావోమి తొలి రిటైల్ స్టోర్!!
‘మి హోమ్ స్టోర్’ పేరుతో బెంగళూరులో ఏర్పాటు
► మే 20 నుంచి అందుబాటులోకి
బెంగళూరు: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘షావోమి’ తాజాగా తన తొలి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ‘మి హోమ్ స్టోర్’ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. దీన్ని మే 20 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ తెలిపింది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 100కు పైగా ‘మి హోమ్ స్టోర్ల’ ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నామని పేర్కొంది.
రానున్న నెలల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాల్లో రిటైల్ స్టోర్లను ప్రారంభిస్తామని తెలిపింది. కస్టమర్లు షావోమి కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్, పవర్ బ్యాంక్స్, హెడ్‌ఫోన్స్, ఫిట్నెస్ బ్రాండ్స్, ఎయిర్ ఫ్యూరిఫయర్స్ వంటి తదితర ప్రొడక్టులను ‘మి హోమ్ స్టోర్’లకు వెళ్లి ప్రత్యక్షంగా కొనుగోలు చేయవచ్చని వివరించింది. ఇంటర్నెట్ప్లస్, న్యూ రిటైల్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నామని షావోమి వైస్ ప్రెసిడెంట్ మనూ జైన్ తెలిపారు. కస్టమర్లు తమ ప్రొడక్టులను మి.కామ్‌లో ప్రి–బుకింగ్ చేసుకొని, వాటిని ఈ స్టోర్లలో కలెక్ట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.