ముదురుతున్న వివాదం
బీసీసీఐతో అమీతుమీకి సిద్ధమవుతున్న ఎంసీఏ
నేడు అత్యవసర సమావేశం
ముంబై: బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)ల మధ్య వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. ఐపీఎల్-7 ఫైనల్ మ్యాచ్‌ను వాంఖడే నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి తరలించాలని గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎంసీఏ.. బీసీసీఐతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సోమవారం ఎంసీఏ మేనేజింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించింది. బీసీసీఐతో భవిష్యత్ సంబంధాలను నిర్ణయించే దిశగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.
మ్యాచ్ తరలింపునకు గల అసలు కారణమేంటో చెప్పాలని ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్ అటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తోపాటు బీసీసీఐ సభ్యులకు శనివారమే లేఖ రాశారు. దీనికితోడు ఐపీఎల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంసీఏ అధికారులు ఇప్పటికే తమ అక్రిడిటేషన్లను కూడా నిర్వాహకులకు తిరిగి ఇచ్చేశారు. స్పష్టమైన కారణం తెలపకుండానే మ్యాచ్‌ను తరలిస్తూ తీసుకున్న నిర్ణయానికి నిరసనగానే తమ అక్రిడిటేషన్లు వెనక్కి ఇచ్చేశామని ఎంసీఏ మీడియా మేనేజర్ వినోద్ దేశ్‌పాండే తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం వాంఖడేలో ఐదు లీగ్ మ్యాచ్‌లతోపాటు ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సివుంది.
అయితే ఎలిమినేటర్‌ను బ్రబౌర్న్ స్టేడియానికి, ఫైనల్‌ను బెంగళూరుకు తరలించాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటికి మూడు లీగ్ మ్యాచ్‌లు జరగగా, మరో రెండు మ్యాచ్‌లు జరగాల్సి వున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు మ్యాచ్‌లను కూడా వేరే చోట నిర్వహించుకోవాల్సిందిగా ఎంసీఏలో ఎక్కువ మంది సూచిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.