breaking news
maturity benefits
-
మీ ‘లైఫ్’ పాలసీ సరైనదేనా..?
గుడ్డివాళ్లు ఏనుగును తాకితే...? తోక పట్టుకున్నవారికి అదో తాడులా... తొండం తాకిన వారికి అదో పాములా... నడుము భాగాన్ని తాకినవారికి అదో గోడలా అనిపించింది. అంతేతప్ప ఎవ్వరికీ అదో ఏనుగులా అనిపించలేదు. దేన్నయినా సమగ్రంగా చూడాలి తప్ప ఒకే కోణంలో చూడొద్దని చెప్పేటపుడు పురాణాల్లోని ఈ తత్వాన్ని గుర్తు చేస్తుంటారు. ప్రస్తుతం మనవాళ్లు కొంటున్న బీమా పాలసీలకూ ఇదే తత్వం వర్తిస్తోంది. ఎందుకంటే నూటికి 90 శాతం మంది బీమా అవసరాన్ని అర్థం చేసుకుని కొనటం లేదు. రకరకాల కోణాల్లో దాన్ని చూసి డబ్బులు వృథా చేస్తున్నారన్నది తాజా సర్వేల సారాంశం. ఈ సర్వేల ప్రకారం... కొందరేమో బంధుమిత్రులు బలవంతపెట్టారనో, ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేకో మొహమాటానికి బీమా పాలసీ తీసుకుంటున్నారు. మరికొందరేమో దీన్నో పెట్టుబడి సాధనంగా, పన్ను ఆదా చేసే పాలసీగా భావించి కొంటున్నారు. ఇంకొందరేమో గడువు తీరిన తరువాత తమ చేతికి ఎంత వస్తుందన్నదానిపైనే దృష్టి పెడుతున్నారు. నిజానికి ఈ మూడూ సరికాదు. బీమా అవసరాన్ని అర్థం చేసుకుని, ఆ అవసరం కోసమే దాన్ని తీసుకోవాలి. ప్రతి ఒక్కరికీ బీమా తప్పనిసరిగా ఉండాలి కూడా. అసలు బీమా అవసరమేంటో... డబ్బులు ఎలా వృథా అవుతున్నాయో... వీటినెలా నివారించాలో వివరించే ‘వెల్త్’ స్టోరీ ఇది... ‘ఎండోమెంట్’ ఇష్టమైతే... కష్టమే జీవిత బీమా తీసుకోవాలనుకున్నవారు ఎక్కువగా ఎండోమెంట్ ప్లాన్లను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇందులో లో పాలసీదారు మరణించినట్టయితే ఎంపిక చేసుకున్న కవరేజీ (సమ్ అష్యూర్డ్) మేర పరిహారం లభిస్తుంది. అలాకాకుండా పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా సరే... ఈ ప్లాన్‌లో ఇస్తామని చెప్పిన అంతిమ ప్రయోజనాన్ని అందిస్తారు. చాలా మందికి నచ్చేది ఇదే. ఎందుకంటే భారతీయ భావనలో ‘మనం లేకపోతే’ అనే పదం చాలామందికి నచ్చదు. మనం జీవించి ఉంటామన్న ఆశే అందరికీ ఉంటుంది. దానివల్లే... జీవించి ఉంటే ఇంత మొత్తం వస్తుందని ఎండోమెంట్ ప్లాన్లలో చెబుతుంటారు. చాలామంది దీన్ని చూసే కొంటుంటారు. కానీ ఇది సరికాదన్నది నిపుణుల మాట.తప్పనిసరిగా ‘టర్మ్’ ఉండాలి... అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అనే పేరులోనే ఉంది కదా... అది జీవితానికిచ్చే బీమా అని. మరి జీవితానికి బీమా చేసుకుంటే చాలు కదా! ఆ బీమా మొత్తం నుంచి కూడా పెట్టుబడి తరహాలో లాభాన్ని ఆశించటమెందుకు? లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్లు అన్నవి కేవలం రక్షణ కల్పించడానికే పనికొస్తాయి. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే ఇవి పరిహారాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ పాలసీ గడువు తీరాక కూడా పాలసీదారు జీవించి ఉంటే చేతికి రూపాయి కూడా రాదు. చాలా మందికి ఇదే నచ్చదు. ఒక్కసారి తేడా చూద్దాం!. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఏడాదికి రూ.10–12 వేల ప్రీమియాన్ని చెల్లిచండానికి సిద్ధపడతే... ఎండోమెంట్ ప్లాన్‌ను ఎంపిక చేసుకున్న సందర్భంలో రూ.2 లక్షల సమ్ అష్యూర్డ్‌తో కవరేజీ లభిస్తుంది. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఇంతే ప్రీమియానికి రూ.50 లక్షల వరకూ కవరేజీ లభిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే రూ.2 లక్షలు సరిపోతుందా? రూ.50 లక్షలయితే కొన్నాళ్లయినా ఆ కుటుంబం నిలదొక్కుకోగలదు కదా? పాలసీ గడువు ముగిశాక కూడా బతికి ఉంటే ఆ 2 లక్షలు వెనక్కి వస్తాయన్న ఉద్దేశంతో కంటే ఎండోమెంట్ పాలసీ మంచిదా? లేక పాలసీ గడువు ముగిశాక రూపాయి రాకపోయినా... ఈ మధ్యలో ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకోగల రూ.50 లక్షల పాలసీ మంచిదా? ఇదిగో... ఈ కోణంలో సమగ్రంగా ఆలోచిస్తే బీమా విషయంలో డబ్బులు వృథా కావు. తక్కువ కాలం... తక్కువ కవరేజీ వద్దు కొంతమంది జీవిత బీమా పాలసీలను 5 ఏళ్ల కాలానికి, పదేళ్ల కాలానికి, 15 ఏళ్ల కాలానికి కూడా తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు వీటినే అంటగట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి పాలసీలు అమ్మితే వారికి వచ్చే లాభం ఎక్కువ. ఎందుకంటే ఐదేళ్లు తిరిగేసరికి మీరు మళ్లీ ఇంకో పాలసీ తీసుకోక తప్పదు కదా... అందుకని!. ఇది కూడా డబ్బు వృథా చేయటమే. ఎందుకంటే పాలసీదారుకు కనీసం 70 ఏళ్లు వచ్చేవరకైనా కవరేజీ ఉండాలి. అది 30 ఏళ్ల వయసులో తీసుకున్నా... లేక 40 ఏళ్ల వయసులో తీసుకున్నా సరే!. ఎందుకంటే సాధారణ అంచనాల ప్రకారం పాలసీదారుకు , 70 ఏళ్లు వచ్చేసరికి తన పిల్లలు కూడా పెద్దవాళ్లయి ఉంటారు. 70లోగా ఏమైనా జరిగితే... బీమా కవరేజీ మొత్తం కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఒకవేళ 70 ఏళ్లు పూర్తయినా తను జీవించి ఉంటే పాలసీగడువు ముగిసిపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అప్పటికే కుటుంబం ఎంతో కొంత సెటిలై ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించి దీర్ఘకాలానికి జీవితబీమా తీసుకోవాలి తప్ప... స్వల్ప కాలానికి తీసుకుంటే అది డబ్బులు వృథా చేయటమే. దీనికితోడు చిన్నచిన్న కవరేజీ కుటుంబానికి సరిపోదని గుర్తుంచుకోవాలి. కుటుంబ పెద్ద వార్షిక సంపాదనకు కనీసం 10 నుంచి 20 రెట్ల వరకు కవరేజీ ఉంటే మంచిది. ఈ స్థాయి కవరేజీకి ప్రీమియం కట్టడం కేవలం టర్మ్ ప్లాన్లలోనే సాధ్యం.యులిప్‌లూ ఎండోమెంట్ లాంటివే... యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) కూడా ఒక రకంగా ఎండోమెంట్ లాంటివే. ఎండోమెంట్లో బీమా చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి, వచ్చిన రాబడిని పాలసీదారులకు చెల్లిస్తారు. యులిప్‌లలో మోరా్టలిటీ, ప్రీమియం అలోకేషన్ తదితర చార్జీలు మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో ఎండోమెంట్ కంటే యులిప్‌లలో కొంచెం అదనపు రాబడి (8 శాతం వరకు) ఆశించొచ్చు. కానీ, వీటిల్లో మొదటి ఐదేళ్లు లాకిన్ పీరియడ్ ఉంటుంది. బీమా సంస్థలు చార్జీల రూపంలో ఎక్కువ మినహాయించుకుంటూ ఉంటాయి. పైగా ఇది కూడా బీమా, పెట్టుబడి కలిపిన సాధనం. కనుక కవరేజీ మెరుగ్గా ఉండదు. పన్ను మినహాయింపు చూడొద్దుఎండోమెంట్ ప్లాన్లలో మెచ్యూరిటీ గడువు తీరాక చేతికి అందే మొత్తంపై ఆదాయపు పన్ను ఉండదు. పైపెచ్చు చెల్లించే ప్రీమియాన్ని సెక్షన్ 80సీ కింద (పాత పన్ను విధానం) చూపించుకుని పన్ను ఆదా చేసుకోవచ్చు. చాలా మంది ఈ ప్రయోజనం కోసం ఎండోమెంట్ ప్లాన్ కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి టర్మ్ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియంపైనా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. కాకపోతే ఎండోమెంట్ ప్లాన్లతో చివర్లో వచ్చే మొత్తాన్ని చూసుకుంటే అది మనం చెల్లించిన ప్రీమియానికి సరిపడా ఉంటుంది. దీనికి బదులు తక్కువ ప్రీమియంతో వచ్చే టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగతా మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను పోను నికర రాబడి.. ఎండోమెంట్ ప్లాన్లలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇంకా పెరుగుతుంది. రైడర్లూ అవసరమే.. → జీవిత బీమాలో అదనపు రైడర్లూ మంచివే. ఎందుకంటే దేశంలో జీవిత బీమా క్లెయిమ్‌లలో 70 శాతం ప్రమాద మరణాలు లేదా ప్రమాదం కారణంగా వైకల్యానికి సంబంధించినవే ఉంటున్నాయి. అయినాసరే చాలామంది ఈ రైడర్లను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయక్కర్లేదు. ఏటా రూ.200 నుంచి 1,000కే రైడర్లను పొందొచ్చు. → యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ (ప్రమాద మరణం లేదా అంగ వైక ల్యం) రైడర్ల ను తప్పకుండా జోడించుకోవాలి. → వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ కూడా అవసరమే. దీనికి ప్రీమియం రూ.100–200 వరకే ఉంటుంది. ప్రమాదాల్లో వైకల్యం పాలైన సందర్భాల్లో భవిష్యత్తు ప్రీమియం చెల్లించాల్సిన అవసరాన్ని ఈ రైడర్ తప్పిస్తుంది. → జీవిత బీమా అయినా, ఆరోగ్య బీమా అయినా, చివరికి హోమ్ ఇన్సూరెన్స్ అయినా.. కనీసం రెండేళ్లకోసారి సమీక్షించుకోవాలి. ఆదాయంతోపాటు కుటుంబ బాధ్యతలూ పెరుగుతుంటాయి. తీసుకున్న కవరేజీ, అందులోని సదుపాయాలు తమ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా? అన్నది పరిశీలించుకోవాలి. అవసరమైతే, అదనపు కవరేజీ తీసుకోవాలి. -
బీమా పాలసీ కొనసాగించలేకపోతున్నారా?
కారణాలేవైనా కానీ మీరు తీసుకున్న బీమా పాలసీని కొనసాగించలేకపోతున్నారా..? ప్రీమియం చెల్లింపును భారంగా భావిస్తున్నారా..? దీంతో పాలసీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ ముందు ఓ చక్కని మార్గం ఉంది. పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది. దీనికంటే పెయిడప్ పాలసీగా మార్చుకుంటే సరి. ఈ అవకాశం ఎండోమెంట్ పాలసీల్లో ఉంటుంది. ఎండోమెంట్ పాలసీలు బీమా రక్షణతోపాటు, పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. ఈ ఎండో మెంట్ పాలసీ కాల వ్యవధి ముగియక ముందే దాన్ని నిలిపివేయాలని భావిస్తే రెండు మార్గాలు ఉన్నాయి. దాన్ని పెయిడప్ పాలసీగా మార్చుకోవడం ఒకటి. ఇలా చేస్తే బీమా కవరేజీ కొనసాగుతుంది. లేదా పాలసీని బీమా సంస్థకు స్వాధీనం చేసి సరెండర్ వ్యాల్యూని పొందడం. ఈ రెండు మార్గాల్లో ఉన్న మంచి చెడులను తెలియజేసే కథనమే ఇది. పెయిడప్ పాలసీ పెయిడప్ పాలసీ ఆప్షన్లో జీవిత బీమా నిర్ణీత కాలం వరకు కొనసాగడం అనుకూలతగా చెప్పుకోవాలి. అంటే ప్రీమియం చెల్లించకపోయినా కానీ, ఈ కవరేజీ కొనసాగుతుంది. అలాగే, పాలసీ కాల వ్యవధి సమయంలో పాలసీదారు మరణిస్తే సమ్ అష్యూరెన్స్ (బీమా మొత్తం)ను నామినీకి చెల్లించడం జరుగుతుంది. పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. కాకపోతే పాలసీని పెయిడప్‌గా మార్చుకుంటే చివర్లో వచ్చే ప్రయోజనాలు కొంత తగ్గిపోతాయి. ఎందుకంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక. దాంతో కాల వ్యవధి తీరిన తర్వాత పాలసీదారుకు లభించే మొత్తం తగ్గుతుంది. పెయిడప్‌గా మార్చిన నాటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక వార్షికంగా తాజా బోనస్‌లు కూడా నిలిచిపోతాయి. అప్పటి వరకు సమకూరిన బోనస్‌లను కాల వ్యవధి తీరిన తర్వాత చెల్లిస్తారు. ‘‘ఇటీవలి ఐఆర్డీఏఐ నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ నిబంధనలు 2019 ప్రకారం పెయిడప్కు అర్హమైన పాలసీల్లో చెల్లించాల్సిన కనీస ప్రీమియం రెండు సంవత్సరాలుగా నిర్దేశించడం జరిగింది. అంటే ఇంకా మిగిలి ఉన్న కాలంతో సంబంధం లేకుండా అన్ని పాలసీలకు పెయిడప్ విషయంలో రెండేళ్ల ప్రీమియం చెల్లిస్తే చాలు’’ అని హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీ తెలిపింది. యూనిట్ లింక్డ్ ప్లాన్ (యులిప్)లను కూడా పెయిడప్ పాలసీలుగా మార్చుకోవచ్చు. అయితే, లాకిన్ పీరియడ్ వరకు (ఐదేళ్ల పాటు) అందులో కొనసాగాల్సి ఉంటుంది. పాలసీదారుపై చార్జీల భారం మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే యులిప్‌లలో జీవిత బీమా కవరేజీ రిస్క్ చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఫండ్ నిర్వహణ చార్జీలు కొనసాగుతాయి. నాన్ లింక్డ్ ఎండోమెంట్ పాలసీల్లో పెయిడప్‌గా మారిన తర్వాత ఎటువంటి చార్జీలను విధించడం జరగదు. స్వాధీనం చేస్తే..? ఒకవేళ పాలసీలో కొనసాగకూడదని భావిస్తే దాన్ని స్వాధీనం చేసి స్వాధీన విలువను (సరెండర్ వ్యాల్యూ) పొందొచ్చు. సరెండర్ చేసినట్టయితే ఆ తర్వాత బీమా కవరేజీ కూడా ముగిసినట్టే. ఈ ఆప్షన్లోనూ కనీసం కొంత కాలం పాటు ప్రీమియం చెల్లింపు తర్వాతే సరెండర్ చేయడానికి వీలుంటుందని పాలసీబజార్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ అక్షయ వైద్య తెలిపారు. యులిప్‌లలో కనీసం ఐదేళ్లు కొనసాగిన తర్వాతే సరెండర్‌కు వీలుంటుంది. యులిప్‌లలో ఐదేళ్లు ప్రీమియం చెల్లింపు తర్వాత ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసే నాటికి ఉన్న ఫండ్ విలువ ను చెల్లించడం జరుగుతుంది. ముందుగా వైదొలిగినందుకు ఎటువంటి చార్జీల విధింపు ఉండదు. అదే నాన్ లింక్డ్ ప్లాన్లలో అయితే రెండేళ్ల తర్వాత స్వాధీనం చేయవచ్చు. సరెండర్ చార్జీలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. పాలసీ స్వాధీనం విషయంలో చెల్లించాల్సిన కనీస మొత్తాలను ఐఆర్డీఏఐ నిర్దేశించింది. అయితే, పాలసీ తొలి నాళ్లలో స్వాధీనం చేసినట్టయితే, చెల్లించిన ప్రీమియంలో 50%వరకు నష్టపోవాల్సి రావచ్చు. నాన్లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్‌ను రెండో ఏడాది స్వాధీనం చేస్తే చెల్లించిన మొత్తం ప్రీమియంలో 30 శాతమే వెనక్కి వస్తుంది. మూడో ఏడాది స్వాధీనం చేస్తే 35% లభిస్తుంది. పాలసీ తొలినాళ్లలో స్వాధీనం చేయడం ద్వారా ఎక్కువ మొత్తాన్ని నష్టపోవాల్సి ఉంటుంది. పాలసీ తొలి ఏడేళ్ల కాలంలో స్వాధీనం చేస్తే ఎంత చెల్లించాలన్న దానిని ఐఆర్డీఏఐ పేర్కొంది. పెయిడప్, సరెండర్... ఏది నయం? ఒక్కసారి ఎండోమెంట్ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత కనీసం రెండేళ్లు అయినా ప్రీమియం చెల్లిచాలి. అప్పుడే దాన్నుంచి పెద్దగా నష్టం రాదు. బీమాతోపాటు పొదుపు కలసిన పాలసీల్లో రెండేళ్లలోపే బయటపడితే వచ్చేదేమీ పెద్దగా ఉండదు. కనీసం రెండేళ్లు చెల్లించిన తర్వాత పెయిడప్, సరెండర్ ఆప్షన్లను పరిశీలించొచ్చు. అయినా కానీ తొలినాళ్లలో ఇలా చేయడం వల్ల అంత ప్రయోజం ఉండదు. పెయిడప్, సరెండర్ ఈ రెండింటిలో ఏది నయం? అన్న ప్రశ్నే ఎదురైతే పెయిడప్‌గా మార్చుకోవడమే మంచిది. ఎందుకంటే, ఇందులో జీవిత బీమా కొనసాగుతుంది. కాల వ్యవధి తీరాక కొంత వెనక్కి వస్తుంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీకి పరిహారం దక్కుతుంది. మరో జీవిత బీమా పాలసీ తీసుకున్నా తర్వాతే ఒక పాలసీ నుంచి వెదొలగడాన్ని పరిశీలించాలి. -
చైల్డ్ ప్లాన్
బేసిక్స్.. బీమా చదువు మొదలు.. లైఫ్‌స్టయిల్ దాకా ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు అత్యుత్తమ భవిష్యత్తునే అందించాలని కోరుకుంటారు. పిల్లల కలలు, ఆకాంక్షలు సాకారం చేయడానికి తోడ్పడే సాధనాల్లో చైల్డ్ ప్లాన్లు కూడా ఉంటాయి. పాలసీదారుకు లైఫ్ కవరేజీ ఇవ్వడంతో పాటు పిల్లల విద్యావ్యయాలను ఎదుర్కొనే ధీమాను కలిగిస్తాయివి. సాధారణంగా టర్మ్ ప్లాన్లలో పాలసీదారు మరణించిన పక్షంలో క్లెయిమ్ మొత్తం చెల్లించడంతో పాలసీ ముగిసిపోతుంది. అదే చైల్డ్ ప్లాన్ల విషయానికొస్తే... పాలసీదారు మరణించినా ఈ పథకం కొనసాగుతుంది. మిగిలిన ప్రీమియంల భారాన్ని బీమా కంపెనీనే చూసుకుంటుంది. పాలసీదారు పాలసీ వ్యవధి తర్వాత కూడా జీవించి ఉన్న పక్షంలో టర్మ్ ప్లాన్లలో ఎలాంటి మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు. అదే చైల్డ్ ప్లాన్లలో మెచ్యూరిటీ ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలు పుట్టినప్పట్నుంచీ ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు. చైల్డ్ యూనిట్ లింక్డ్ ప్లాన్లు (యులిప్), చైల్డ్ ఎండోమెంట్ ప్లాన్లు అంటూ వివిధ రకాల ప్లాన్లు ఉన్నాయి. చైల్డ్ యులిప్‌లో కొంత మొత్తం ప్రీమియాన్ని బీమా కంపెనీలు డెట్ సాధనాల్లోను.. మిగతా మొత్తాన్ని స్టాక్ మార్కెట్లలోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఫండ్ తరహాలోనే ఆయా యూనిట్ల నెట్ అసెట్ వేల్యూని బట్టి రాబడులు ఉంటాయి. చైల్డ్ ఎండోమెంట్ ప్లాన్ల విషయానికొస్తే.. మొత్తం ప్రీమియాన్ని డెట్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. దానికి అనుగుణంగానే రాబడులు ఉంటాయి. ఈ పథకాల్లో ప్రీమియం వెయివర్ (అంటే పాలసీదారు మరణించిన పక్షంలో ఇక ప్రీమియాలు కట్టనక్కర్లేదు), యాక్సిడెంటల్ డెత్, వైకల్యం వంటి రైడర్లు ఉంటాయి.


